
బడ్జెట్ 2025 హామీలు – అమలు ఎంత? ఫలితం ఏమిటి?
బడ్జెట్ 2026 ముందు ఆర్థిక పురోగతిపై సమీక్ష..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025 వచ్చే ఐదేళ్లలో ‘సబ్ కా వికాస్’ సాధిస్తామని హామీ ఇచ్చింది. వినియోగం పెంపు, మూలధన వ్యయం, తయారీ రంగం బలోపేతం, ఎగుమతుల వృద్ధి వంటి కీలక అంశాలపై పెద్ద ప్రకటనలు చేసింది. సంవత్సరం గడిచాక, ఆ హామీలు ఎంతవరకు అమలయ్యాయన్నదానిపై ఒక చిన్న సమీక్ష ఇది.
వినియోగ వృద్ధి: ఊపొచ్చిందా?
మధ్యతరగతికి ఊరటనిచ్చేలా ఆదాయపు పన్ను స్లాబ్‌లను సవరించినా, వినియోగంలో ఆశించిన స్థాయిలో వృద్ధి కనిపించడం లేదు. FY25లో 7.2 శాతంగా ఉన్న వినియోగ వృద్ధి, FY26 తొలి అర్ధభాగంలో 7.5 శాతానికి చేరినా, ఏడాది మొత్తానికి మళ్లీ 7 శాతానికి తగ్గే అవకాశముందని అంచనాలు చెబుతున్నాయి. GST కోతలు కూడా వినియోగాన్ని నిలబెట్టేంత బలంగా కనిపించడం లేదు.
మూలధన వ్యయం: కేంద్రం వేగం – రాష్ట్రాలు వెనుకంజ..
కేంద్రం మౌలిక సదుపాయాలపై ఖర్చును పెంచినా, రాష్ట్రాల పనితీరు ఆశించినంతగా లేదు. రాష్ట్రాలపై ఆదాయ వ్యయం భారంగా ఉండటంతో, మూలధన వ్యయం పరిమితమవుతోంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వంటి కీలక పథకాలపై ఇప్పటికీ స్పష్టమైన సంకేతాలు లేవు.
FDI, FPI: పెట్టుబడులు ఎందుకు వెనక్కి?
బీమా రంగంలో FDI పరిమితిని 100 శాతానికి పెంచినా, పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. లాభాల బుకింగ్, బాహ్య పెట్టుబడుల వల్ల నికర విదేశీ పెట్టుబడులు భారీగా తగ్గాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు కూడా మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నారు.
తయారీ రంగం: మిషన్లు ప్రకటించారు. అమల్లో లేదు
‘నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్’ ప్రకటించినా, ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ లేదు. PLI పథకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో కొత్త PLI 3.0 తెచ్చారు. తయారీ రంగం వృద్ధి కొంత పెరిగినా, మొత్తం ఆర్థిక వ్యవస్థలో దాని వాటా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఎగుమతులు: సుంకాల తగ్గింపు ప్రయోజనం కలిగించలేదా?
అమెరికాతో వాణిజ్య వివాదాల నేపథ్యంలో సుంకాలను సవరించినా, ఫలితం ఆశించినంత లేదు.అమెరికా పరస్పర సుంకాలు విధించడంతో భారత ఎగుమతిదారులు ఒత్తిడిలో ఉన్నారు. దేశ ఎగుమతుల వాటా GDPలో తగ్గుతుండటం ఆందోళనకరం.
ఆర్థిక క్రమశిక్షణ: లక్ష్యాలు చేరుతాయా?
లోటు, రుణ భారం తగ్గిస్తామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవ స్థితి బడ్జెట్ పత్రాలు సమర్పించిన తర్వాతే స్పష్టమవుతుంది. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే, ఈ లక్ష్యాలు చేరడం కష్టమేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
బడ్జెట్ 2026 నుంచి ఏమి అవసరం?
- వినియోగాన్ని పెంచేందుకు నగదు పంపిణీ కాకుండా నాణ్యమైన ఉద్యోగాలు, మెరుగైన వేతనాలు, సామాజిక భద్రతపై దృష్టి
- కార్పొరేట్లకు ఇచ్చే సబ్సిడీలను క్రమంగా ఉపసంహరించి ప్రైవేట్ పెట్టుబడులకు వాస్తవ ప్రోత్సాహం
- తయారీ రంగంలో సబ్సిడీలకన్నా స్వేచ్ఛాయుత పోటీ, పరిశోధన–అభివృద్ధిపై భారీ ఖర్చు
- సుంకాలు, టారిఫ్ కాని అడ్డంకులను తొలగించి వాణిజ్య సరళీకరణ
- పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి సరైన తరలింపు, పంపిణీ మౌలిక సదుపాయాలు అణుశక్తి ఖరీదైనదిగా మారుతున్న నేపథ్యంలో దాని అవసరంపై పునఃపరిశీలన.

