
బడ్జెట్ 2026: ఒడిశాకు కేంద్రం భారీ ప్రోత్సాహకం..
ఒడిశాలోని నేషనల్ వాటర్‌వే–5కు ప్రాధాన్యం
కేంద్ర బడ్జెట్(Budget)లో ఒడిశా రాష్ట్రానికి కేంద్రం కీలక ప్రాధాన్యం దక్కింది. జలమార్గాలు, సరుకు రవాణా కారిడార్లు, అరుదైన ఖనిజ కేంద్రాలు, పర్యాటక రంగ అభివృద్ధి వంటి అంశాలతో ఒడిశాను, తూర్పు భారత అభివృద్ధికి వ్యూహాత్మక కేంద్రంగా మార్చేందుకు కేంద్రం ప్రణాళిక ప్రకటించింది.
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman), రాబోయే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలు అమలు చేస్తామని తెలిపారు. ఇందులో ఒడిశాలోని నేషనల్ వాటర్‌వే–5కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ మార్గం తాల్చర్, అంగుల్ వంటి ఖనిజ ప్రాంతాలు, కళింగనగర్ వంటి పారిశ్రామిక కేంద్రాలను పరదీప్, ధర్మా పోర్టులతో అనుసంధానించనుంది. దీని వల్ల లోతట్టు రవాణా, వాణిజ్య రంగాలకు ఊతం లభించనుంది.
ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్‌ను కూడా గేమ్‌చేంజర్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఓడరేవుల బలోపేతం, ఎంఎస్ఎంఈల వృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదలతో పాటు ఒడిశా జాతీయ సరఫరా గొలుసులో కీలక లాజిస్టిక్స్ హబ్‌గా ఎదగనుంది.
అరుదైన భూమి (రేర్ ఎర్త్) కారిడార్ ఏర్పాటు ద్వారా క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, భవిష్యత్ పరిశ్రమలకు ఒడిశాను కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పురావస్తు, కొబ్బరి, జీడిపప్పు, పర్యాటక రంగాలపై దృష్టి పెట్టడం ద్వారా గ్రామీణ ఉపాధి, తీరప్రాంత మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి దోహదం అవుతుందని భావిస్తున్నారు.
ఇక ఖనిజ సంపద అధికంగా ఉన్న ఒడిశాతో పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కీలక ఖనిజ సదుపాయాల ఏర్పాటు కోసం కేంద్రం మద్దతు ప్రకటించింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

