
సెంట్రల్ బడ్జెట్ ఏపీ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేస్తుందా?
యూనియన్ బడ్జెట్ 2026-27, ఆంధ్రప్రదేశ్‌కు లభించిన మేలు, విశ్లేషణ.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 యూనియన్ బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు మంచి మేలు జరుగుతుందని బడ్జెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు, రవాణా మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లు, ఖనిజ సంపద వినియోగం, డేటా సెంటర్లు, పర్యాటకం వంటి రంగాల్లో ప్రత్యేక కేటాయింపులు, ప్రోత్సాహకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నాయనేది ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయం. ఈ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు లభించిన మేలును, అది ఎలా ప్రభావం చూపుతుందో వివరంగా పరిశీలిద్దాం.
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా రూ.3,752.09 కోట్లు అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేటాయించారు. ఇది రాష్ట్ర రాజధాని అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తుంది. అమరావతి ప్రాజెక్టు పూర్తి కావడంతో రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతమవుతుంది. అదేవిధంగా పోలవరం ద్వారా కోస్తా ప్రాంతాల్లో సాగు విస్తరణ జరిగి, వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది. ఇది రైతులకు ఆర్థిక భద్రతను అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది.
రైల్వే రవాణాలో మేలు...
రవాణా రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద మేలు జరిగింది. బడ్జెట్‌లో ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లలో రెండు హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు - ఆంధ్రప్రదేశ్‌ను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇవి కర్నూలు, గుంతకల్, అనంతపురం, కడప, రేణిగుంట వంటి స్టేషన్లను అనుసంధానం చేస్తాయి. ఈ కారిడార్లు పూర్తి కావడంతో రవాణా సమయం తగ్గి, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతమవుతాయి. ఫలితంగా పారిశ్రామిక వృద్ధి పెరిగి ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. అంతేకాకుండా రూ.12.2 లక్షల కోట్ల పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కేటాయింపు, కొత్త ఫ్రైట్ కారిడార్లు, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ విస్తరణ, సీప్లేన్ సర్వీసులు రాష్ట్ర లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇది పోర్ట్-లెడ్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తూ ఎగుమతులను పెంచుతుంది.
పూర్వోదయ రాష్ట్రాలలో ఒకటిగా గుర్తింపు...
పారిశ్రామిక, టెక్నాలజీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మంచి అవకాశాలు లభించాయి. రాష్ట్రం 'పూర్వోదయ' రాష్ట్రాలలో ఒకటిగా గుర్తించి తూర్పు తీర పారిశ్రామిక కారిడార్‌లో భాగమవుతుంది. ఇది పారిశ్రామిక ఉత్పాదకత, లాజిస్టిక్స్‌ను మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా ఒడిశా, కేరళ, తమిళనాడు మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌కు 'రేర్ ఎర్త్ కారిడార్' కేటాయించారు. ఇది ఖనిజ సంపద వెలికితీత, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలోని తీరప్రాంత ప్లేసర్ శాండ్స్‌లో లభ్యమయ్యే 6.9 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ నిల్వలను సద్వినియోగం చేసుకోవడంతో, సెమికండక్టర్ సప్లై చైన్ బలపడుతుంది. ఇండియా సెమికండక్టర్ మిషన్ (ISM 2.0) కింద రూ.40,000 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో మాన్యుఫ్యాక్చరింగ్, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు బలోపేతమవుతాయి. ఇది పెట్టుబడులు, ఉద్యోగాలను పెంచుతుంది.
డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు...
డేటా సెంటర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలకు 2047 వరకు దీర్ఘకాలిక పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా విశాఖపట్నంలో గూగుల్ ప్రతిపాదిత హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు మేలు జరుగుతుంది. ఇది భారత్‌ను గ్లోబల్ డేటా సెంటర్ హబ్‌గా మారుస్తూ ఏఐ-సపోర్టెడ్ సదుపాయాలను సృష్టిస్తుంది. ఫలితంగా విశాఖపట్నంలో ఉద్యోగాలు పెరిగి, డిజిటల్ ఎకానమీ వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా 5 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కొనసాగుతుంది. ఇది విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల అభివృద్ధికి సహాయపడుతుంది.
అరకు వ్యాలీలో టూరిజం ప్రోత్సాహకాలు
పర్యాటక రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు మంచి బూస్ట్ లభించింది. పులికాట్ సరస్సు వెంబడి బర్డ్‌వాచింగ్ ట్రైల్స్ అభివృద్ధి, అరకు వంటి ప్రాంతాల్లో టూరిజం ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా సస్టైనబుల్ టూరిజం పెరుగుతుంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలపరిచి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. అంతేకాకుండా టెక్స్‌టైల్ సెక్టర్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని పత్తి సాగు ప్రాంతాలు మేలు పొందుతాయి.
పలువురి అభిప్రాయాలు
మొత్తంగా ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీర్ఘకాలిక దృష్టికి అనుగుణంగా ఉందని, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీఐఐ-ఏపీ నేతలు అభినందించారు.
సీపీఐ, సీపీఎం నేతలు జి ఈశ్వరయ్య, వి శ్రీనివాసరావులు బడ్జెట్ రూపలక్పన పెట్టుబడి దారులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. రానున్న సంవత్సరాల్లో ఈ బడ్జెట్ ప్రభావం కారణంగా విద్య, వైద్యం, ఆర్థిక రంగాలు పూర్తిగా దెబ్బతిని రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడమే కాకుండా ప్రజలను అడుక్కుతినేవాళ్లుగా తయారు చేస్తుందని విమర్శించారు.
వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రాష్ట్ర ఫండింగ్ అవసరాలను పట్టించుకోలేదని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మొత్తం మీద ఈ కేటాయింపులు రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు, వృద్ధిని పెంచుతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలంటే నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన ఆర్థిక విధానాలను బలపరచాలనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు పిలుపు నివ్వడం విశేషం.

