
ఏపీలో రెవెన్యూ సమస్యలపై మంత్రి అనగాని సంస్కరణలు ఫలిస్తాయా?
కలెక్టర్ నాయకత్వంలో లీగల్ సెల్ ఏర్పాటు, లైజనింగ్ ఆఫీసర్ల నియామకం రెవెన్యూపై పెత్తనానికా?
ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెండింగ్ కేసులు 32,970కి చేరుకోవడం, రికార్డుల మాయం, ఫేక్ పట్టాలు, కబ్జాలు, కోర్టు వివాదాలు, ఇవన్నీ రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీసుకుంటున్న చర్యలు, లైజనింగ్ ఆఫీసర్ల నియామకం, లీగల్ సెల్ ఏర్పాటు, ఆన్‌లైన్ లిటిగేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏ మేరకు సఫలమవుతాయి?
పెండింగ్ కేసుల భారం
రాష్ట్ర శాసనసభలో మంత్రి సత్యప్రసాద్ వెల్లడించినట్లు 10.2.2026 నాటికి 32,970 రెవెన్యూ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2005 వరకు కేవలం 4 కేసులు మాత్రమే ఉండగా, 2016-2020 మధ్య 17,291కి పెరిగాయి. 2021-2025 మధ్య 12,434 కేసులు పేరుకుపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసుల సంఖ్య తగ్గిందని మంత్రి చెప్పినప్పటికీ, వాస్తవంలో సమస్యల మూలాలు లోతుగా ఉన్నాయి. సమస్యలు కూటమి ప్రభుత్వంలోనే పెరుగుతున్నాయి.
కబ్జాకోరుల నుంచి తన భూమిని కాపాడాలని కోరుతున్న ఓ మహిళ
కొత్తగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలోని యర్రగొండపాలెం వంటి పట్టణాల్లో 39 ఏళ్ల క్రితం ఎన్జీవోలకు, విలేకరులకు కేటాయించిన స్థలాల రికార్డులు మాయమవడం వల్ల కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఫేక్ పట్టాలు సృష్టించి ఒరిజినల్ పట్టాదారులపై కేసులు పెట్టడం, పోలీసుల వత్తిడి సాధారణమవుతున్నాయి. ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారి ఫోర్జరీ సంతకాలతో పట్టాలు పుట్టించి రెచ్చిపోతున్నారు. ఆ పట్టాలు అటు రెవెన్యూ అధికారుల వద్ద కానీ, పోలీసు అధికారుల వద్ద కానీ కబ్జాకు యత్నిస్తున్న వారు బయట పెట్టడం లేదు. మా వద్ద పట్టాలు ఉన్నాయంటూ హల్ చల్ చేస్తున్నారు. దీంతో కేసులు, రెవెన్యూ వివాదాలు ఇక్కడ నిత్య కృత్యమయ్యాయి.
ఈ సమస్యలకు మూలకారణం రికార్డుల లోపం, అధికారుల కుమ్మక్కు. మంత్రి సత్యప్రసాద్ ఇప్పటికే కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కానీ ఇది సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తుందా అనేది ప్రశ్న. రికార్డుల డిజిటలైజేషన్ పూర్తి కాకుండానే అటకెక్కినట్లు విశ్వసనీయ సమాచారం. డిజిటలైజేషన్ పూర్తయి ఉంటే రికార్డులు కొంతవరకైనా అందుబాటులో ఉండేవి.
పరిష్కారానికి జిల్లా స్థాయిలో లైజనింగ్ అధికారులు
మంత్రి సత్యప్రసాద్ తీసుకుంటున్న చర్యలు ఆశాజనకంగా ఉన్నాయి. హైకోర్టు కేసుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో లైజనింగ్ ఆఫీసర్ల నియామకం, కలెక్టర్ నాయకత్వంలో లీగల్ సెల్ ఏర్పాటు సమన్వయాన్ని పెంచుతాయి. ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ లిటిగేషన్ కేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (APOLCMS) ద్వారా జిల్లా అధికారులు, ప్రభుత్వ ప్లీడర్ల మధ్య సమన్వయం మెరుగుపడిందని మంత్రి చెప్పారు. ఇది ప్రారంభ దశలోనే కేసులను పరిష్కరిస్తోంది.
2026-27 బడ్జెట్‌లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్లకు రూ.3,867.53 కోట్లు కేటాయించడం గమనార్హం. బ్లాక్‌చైన్ ఆధారిత డిజిటల్ రికార్డులు, పాత డాక్యుమెంట్ల స్కానింగ్, వెబ్‌ల్యాండ్ సిస్టమ్ లోపాల సవరణ, వీక్లీ రెవెన్యూ క్లినిక్స్ పాత ఇర్రెగ్యులారిటీలను సరిచేస్తాయని మంత్రి పేర్కొన్నారు.
అలాగే 22A నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించడాన్ని సింప్లిఫై చేస్తున్నామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. జిల్లా స్థాయిలో ఇన్‌ఛార్జి మంత్రులు, కలెక్టర్లతో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం ద్వారా పారదర్శకత పెంచుతున్నారు.
నేరుగా సీఎం సభలోనే సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరిస్తున్న ఓ రైతు
గ్రీవెన్స్ లో 61శాతం రెవెన్యూ సమస్యలు
అయితే సవాళ్లు తక్కువేమీ కావు. అసెంబ్లీలో TDP లెజిస్లేటర్లు మంత్రిని విమర్శించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS)లో 61 శాతం ఫిర్యాదులు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించినవేనని, రిజాల్వ్ డెడ్‌లైన్ లేదని విమర్శలు వచ్చాయి. YSRCP నుంచి కూడా విమర్శలు వచ్చాయి. రెవెన్యూ ఇన్‌కమ్ డ్రాప్ (-99.82 శాతం), స్టేట్ ఓన్ టాక్సెస్ (-0.11 శాతం) మొదలైనవి ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి.
సక్సెస్ అవకాశాలు, వాస్తవం
మంత్రి చర్యలు సక్సెస్ అవుతాయా? పాజిటివ్ గా చూస్తే, డిజిటలైజేషన్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ రికార్డుల మాయమవటాన్ని తగ్గిస్తాయి. APOLCMS వల్ల కేసులు త్వరగా పరిష్కారమవుతాయి. బడ్జెట్ అలకేషన్ ద్వారా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగు పడుతుంది. మంత్రి పోస్ట్‌లో పేర్కొన్నట్లు 2018 TDP హయాంలోనే GO 1348 ద్వారా డిజిటలైజేషన్ ప్రారంభమైంది. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు.
నెగటివ్ గా ఆలోచిస్తే... అధికారుల కుమ్మక్కును పూర్తిగా అరికట్టకపోతే చర్యలు ఫలించవు. పెండింగ్ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. YSRCP విమర్శలు చూస్తే రెవెన్యూ ఇన్‌కమ్ తగ్గడం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ చర్యలు ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవల్ ఇంప్లిమెంటేషన్ కీలకం.
పరిష్కారంలో వేగం పెంచాలి: సీపీఐ
రెవెన్యూ వివాదాలు ప్రతి గ్రామం, పట్టణాల్లోనూ పేరుకుపోవడానికి పాలకుల తీరే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య విమర్శించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన వారు కబ్జాలకు పాల్పడుతున్నారని, అటువంటి వారిపై త్వరలోనే తిరుగుబాటు ఆయా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల నుంచి వస్తుందన్నారు. తాము ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నందున అందులో ఈ సమస్య కూడా ప్రధాన భాగమన్నారు. సామాజిక అసమానతలు కూడా ఈ వివాదాలకు కారణం అవుతున్నాయని, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉత్పన్నం కావడానికి రెవెన్యూ సమస్యలు కారణం అవుతున్నాయన్నారు. కొందరు చట్ట ప్రతినిధులు చట్టాలను గౌరవించడం లేదని, స్థానికంగా పోలీసులు, రెవెన్యూ వారిని అడ్డం పెట్టుకుని సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే గ్రామాల నుంచి చాలా వరకు ఈ సమస్యలు తన దృష్టికి వచ్చాయని, గ్రామ సీపీఐ శాఖల ద్వారా అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు సీపీఐ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రెవెన్యూ మంత్రి చేపట్టిన సంస్కరణలు తక్షణ న్యాయం వైపు అడుగులు వేయాలని కోరారు.
మొత్తంగా మంత్రి చర్యలు 60-70 శాతం సక్సెస్ రేట్‌తో ముందుకు సాగవచ్చు. కానీ అధికారుల జవాబుదారీతనం, పొలిటికల్ విల్ పెంచకపోతే సమస్యలు కొనసాగుతాయి. రాష్ట్ర ప్రజలు త్వరగా పరిష్కారాలు కోరుకుంటున్నారు. అందుకే ఇది ప్రభుత్వానికి సవాలు.

