అమరావతి అరటి తోటలో బిల్ గేట్స్ కు ఏమి బోధపడింది?
x
అరటి తోటలో ఓ మహిళా రైతు చేతిలోని సెల్ ఫోన్ యాప్ పరిశీలిస్తున్న బిల్ గేట్స్ , పక్కన సీఎం చంద్రబాబు

అమరావతి అరటి తోటలో బిల్ గేట్స్ కు ఏమి బోధపడింది?

అమరావతికి ప్రచారం తగ్గింది. వెంటనే ఇమేజ్ పెరగాలంటే ఎవరో ఒక పెద్ద తల రావాలి. ఆ తలే బిల్ గేట్స్. ఇంతకూ ఆయనకు అమరావతిలో ఏమి బోధపడిందో చెప్పలేదు.


రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ను అమరావతి ఎందుకు రప్పించారు? బిల్ గేట్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఏమి ఇచ్చారు? 24 గంటల పాటు అమరావతిని చుట్టబెట్టిన బిల్ గేట్స్ పోతూ పోతూ చంద్రబాబుకు ఇచ్చిన హామీ ఏమిటీ? ఇప్పుడు ఇవన్నీ చర్చనీయాంశాలే. వేయి బిలియన్ డాలర్ల ప్రశ్నలే. పరిశీలకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..

అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి శాసనబద్ధ హోదా (లీగల్ స్టేటస్) రావడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను రాష్ట్రానికి ఆహ్వానించి, ప్రజల్లో అమరావతి అభివృద్ధికి ఏమీ అడ్డంకి లేదనే విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆలస్యమవుతున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 2025 డిసెంబర్‌లో వెల్లడించారు.

2026 జనవరి చివరి వారంలో పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందని అందరూ భావించారు. అయితే అది జరగలేదు. బిల్ గేట్స్ సందర్శనను కేవలం అమరావతికి పబ్లిసిటీ తెచ్చే ప్రయత్నంగా చూస్తున్న విమర్శకులు, ఎప్‌స్టీన్ ఫైల్స్ సంబంధాలు, భారత్‌ను 'ల్యాబ్'గా ఉపయోగించడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, వ్యవసాయం, టెక్నాలజీ రంగాల్లో సహకారం పెంచుకోవడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ఒక రోజు ముందుగా బిల్ గేట్స్ ను ఏపీకి రప్పించి సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్‌ను ప్రపంచవ్యాప్తంగా హైలైట్ చేశారు. వ్యవసాయ క్షేత్రాలు, రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) నుంచి టెక్నాలజీ ఆధారిత పాలన వరకు... గేట్స్‌ను ‘హలో ఫ్రెండ్... హౌ ఆర్ యూ?’ అని స్వాగతించిన చంద్రబాబు, తనను ‘ముందుచూపు కలిగిన వ్యక్తి’గా గేట్స్ చేత చెప్పించుకున్నారు.

అమరావతి సచివాలయం నుంచి ఆర్టీజీఎస్ వరకు ‘టెక్ షో’

గన్నవరం విమానాశ్రయం నుంచి నారా లోకేశ్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఘన స్వాగతం పలికింది. సచివాలయంలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు స్వయంగా స్వాగతించారు. ఆ తర్వాత ఆర్టీజీఎస్ సెంటర్‌లో గంటన్నర పాటు గేట్స్‌ను తిప్పి తిప్పి చూపించారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని హెల్త్ ఇనిషియేటివ్, అమరావతి క్యాపిటల్ డెవలప్‌మెంట్ సిస్టమ్స్... బ్లాక్‌చెయిన్, క్యూఆర్ కోడ్‌లతో భూమి రికార్డులు సురక్షితం చేసిన విధానాలు, జీఎస్‌డీపీ గ్రోత్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కెపీఐలు) ద్వారా ట్రాకింగ్... గేట్స్ ఆశ్చర్యపోయారు.

అరటి తోట సందర్శన...

అమరావతి సమీపంలోని ఉండవల్లి గ్రామంలోని బనానా ఫార్మ్‌ను కూడా సందర్శించారు. డ్రోన్లు, ఏఐ ద్వారా వ్యవసాయం... గేట్స్ ఫౌండేషన్ ద్వారా సంజీవని ప్రాజెక్ట్ (కుప్పం పైలట్)ను ప్రశంసించారు. “చౌకగా డయాగ్నస్టిక్ సర్వీసెస్ ఇస్తే పేదలకు ఎంతో మేలు” అని సూచనలు ఇచ్చారు. ఇక్కడే గేట్స్ చంద్రబాబును ‘గుడ్ ఓల్డ్ ఫ్రెండ్’ అని పిలిచి 1997లోని మొదటి సమావేశం గుర్తు చేశారు. “చంద్రబాబు డిజిటల్ టెక్నాలజీలో నా కంటే ముందు ఉన్నారు. ఆయన ఆలోచనలు వినూత్నం, విభిన్నం. సమకాలీన నాయకుల్లో సింగపూర్ ప్రధాని ఒక్కరే ఆయనలా విజన్ కలిగి ఉన్నారు” అని ప్రశంసలు కురిపించారు.

‘టెక్‌లో ముందుండాలి’... గేట్స్ ద్వారా చెప్పించిన సందేశం

చంద్రబాబు స్ట్రాటజీ స్పష్టం. గేట్స్ ఫౌండేషన్ ద్వారా హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, టెక్-డ్రివెన్ గవర్నెన్స్‌లో సహకారం పెంచుకోవడం. “భారత డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, చంద్రబాబు కీలక పాత్ర” అని గేట్స్ కితాబిచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు గేట్స్ సపోర్ట్ హామీ ఇచ్చారు. ఇది ఏపీకి గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్‌లను బలోపేతం చేస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

పాలన గురించి వ్యాపారి ఏమి నేర్పిస్తాడు?: ఫ్రొఫెసర్ కేఎస్ చలం

పాలన గురించి పాలకుల వద్ద నుంచి నేర్చుకోవాలి. వ్యాపారం గురించి వ్యాపారుల వద్ద నుంచి నేర్చుకోవాలి. వ్యాపారి అయిన బిల్ గేట్స్ పాలన గురించి ఏమి చెబుతాడు, చంద్రబాబు ఏమి నేర్చుకుంటాడని ప్రముఖ ఆర్థిక వేత్త ప్రొఫెసర్ కేఎస్ చలం అన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు బిల్ గేట్ రావడం సుభ పరిణామమే కాని ఆయన ఇమేజ్ ఇప్పుడు తగ్గిపోయింది అని అన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ సంబంధాలు, భారత్‌ను 'ల్యాబ్'గా ఉపయోగించడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు. ‘‘బిల్ గేట్స్ గొప్ప నాయకుడు కాదు. అమెరికాలో ముగ్గురు ధనవంతుల్లో ఒకరు. ఈయనకు 2.50 లక్షల ఎకరాల భూమి ఉంది. అతను ఏ ఫౌండేషన్ పెట్టినా పెట్టుబడి కోసం మాత్రమే పెడతాడు. ఎవ్వరికీ సాయం చేసిన దాఖలాలు లేవు. ఫ్యామిలీనే వదిలేసిన వ్యక్తి. మొరాలిటీ ఉండాలి. అది ఆయన వద్ద లేదు. కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో తెలియని వ్యక్తి బిల్ గేట్స్. ఆయన కంప్యూటర్ కనిపెట్ట లేదు. ఒక సాఫ్ట్ వేర్ ద్వారా వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి నేర్చుకుంటుంది’’ అని ప్రశ్నించారు.

గతంలో బిల్ గేట్స్ అంటే ఒక బ్రాండ్ వ్యాల్యూ ఉంది. ఇప్పుడు అది కూడా పోయింది. ఆయన నుంచి నేర్చుకోవాల్సంది ఏమీ లేదని, ప్రచారం కోసం పిలిపించారు తప్ప ఆయన నుంచి నేర్చుకునేందుకు కాదని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని చలం పేర్కొన్నారు.

చంద్రబాబు గురించి గొప్పలు చెప్పేందుకు బిల్ గేట్స్ వచ్చాడు: సీనియర్ జర్నలిస్ట్ రాజగోపాల్

అమరావతికి బిల్ గేట్స్ వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగిడేందుకు మాత్రమే. ఆర్టీజీఎస్ గురించి చంద్రబాబు వివరించారు. టెక్నాలజీలో ముందుకు వెళుతున్నామని బాబు చెప్పుకున్నారు. అన్నీ విన్న గేట్స్ చంద్రబాబు అంతటి ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి. ఇప్పటికే ఇది రుజువైందని చెప్పటం ఆయనను పొగడటమేనని సీనియర్ జర్నలిస్టు డొక్కా రాజగోపాల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని పరిశీలించిన బిల్ గేట్స్ కనీస సహకారం అందిస్తానని చెప్పలేదని గుర్తు చేశారు.

బ్రాండ్ ఇమేజ్‌కు బూస్ట్ రావాలని...

ఈ సమావేశం సందర్భంగా విమర్శలు లేవని చెప్పలేము. “అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగింది తప్ప, పెట్టుబడులు రాలేదు” అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వాస్తవం చూస్తే... బిల్ గేట్స్ వంటి ఐటీ దిగ్గజం అమరావతికి రావడం ద్వారా ప్రపంచ దృష్టి ఆకర్షించడం సాధ్యమైంది.

ఈ సమావేశం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. “చంద్రబాబు గేట్స్‌ను ఒక రోజు ముందు రప్పించి బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేశారు” అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏపీలో సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని అందరూ ఆశిస్తున్నారు.

Read More
Next Story