తిరుమల లడ్డూ వ్యవహారం: సిట్ నివేదిక నుంచి ఏకసభ్య కమిటీ వరకు...
x

తిరుమల లడ్డూ వ్యవహారం: సిట్ నివేదిక నుంచి ఏకసభ్య కమిటీ వరకు...

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిటందని నిర్థారణ. బాధ్యులు ఎవరు? చర్యలు ఎలా?


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం... కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఈ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమితమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాధ్యతలు, సిట్ ఆరోపణలు, గత సంఘటనలు, బాధ్యులపై చర్యల అవకాశాలు... ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తుల మనసులో మెదిలే ప్రశ్నలకు సమాధానాలు కావాలి.

సిట్ సభ్యులు ఎవరు? రిపోర్టులో ఏముంది?

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు సీబీఐ సూపర్‌విజన్‌లో సిట్‌ను నియమించింది. సిట్‌లో సీబీఐ డీఐజీ సురేందర్ కుమార్, సీజీటీఏ ఐజీ సంపత్ కుమార్, ఏపీ పోలీసు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఏపీ విజిలెన్స్ డీఐజీ రఘురామిరెడ్డి, ఎఫ్‌ఎస్‌ఎల్ సూపరింటెండెంట్ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ టీమ్ 2019-2024 మధ్య జరిగిన టెండర్లు, నెయ్యి సరఫరా ప్రక్రియను పూర్తిగా పరిశీలించింది.

సిట్ రిపోర్టులో షాకింగ్ నిజాలు!

తిరుమల లడ్డులోకి 59.71 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. దీని విలువ రూ.234.51 కోట్లు. నెయ్యిలో జంతు కొవ్వు లేదు కానీ, కూరగాయల కొవ్వు, ఇతర రసాయనాలు కలిపారు. 36 మందిని నిందితులుగా పేర్కొంది. అందులో 12 మంది టీటీడీ అధికారులు. టెండర్ ప్రక్రియలో అక్రమాలు, హవాలా ద్వారా లంచాలు, నిధుల మళ్లింపు జరిగినట్టు తేలింది. బోలేబాబా డెయిరీ వంటి సంస్థలు నకిలీ పత్రాలతో టెండర్లు పొందాయి. ఈ విషయాలు బయటికి వచ్చేసరికి భక్తులు ఆందోళన చెందారు.

ఏకసభ్య కమిటీ ఎందుకు? ఏమి చేస్తుంది?

సిట్ రిపోర్టును మరింత లోతుగా పరిశీలించి, బాధ్యులపై చర్యలకు సిఫారసు చేయడానికి ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఈ కమిటీ నాయకుడు. 45 రోజుల్లో నివేదిక సమర్పించాలి. టెండర్ నిబంధనల సడలింపు, అధికారుల వైఫల్యాలు, పర్యవేక్షణ లోపాలను పరిశీలిస్తుంది. అధికారుల నుంచి రికార్డులు తీసుకుని, వివరణలు అడిగే అధికారాలు ఉన్నాయి.

ఇది సిట్ అధికారులను అవమానించడమా? అనే సందేహాలు పలువురిలో ఉన్నాయి. సిట్ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చింది. ఏకసభ్య కమిటీ ఆ రిపోర్టును ఆధారంగా తీసుకుని పరిపాలనా లోపాలను మరింత స్పష్టం చేసి చర్యలను సూచిస్తుంది. ఇది ప్రక్రియలో భాగమే.

గతంలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయా?

తిరుమల దేవస్థానంలో గతంలో కూడా కల్తీ నెయ్యి ఆరోపణలు వచ్చాయి. 2022లో మైసూరు సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్ నివేదికలో బోలేబాబా, వైష్ణవి డెయిరీల నెయ్యి కల్తీగా తేలింది. కానీ అప్పటి అధికారులు చర్యలు తీసుకోలేదు. 2019-2024 మధ్య ఇలాంటి లోపాలు జరిగాయి. ఉదాహరణకు 2022 మార్చిలో ఒక భక్తుడు సోషల్ మీడియాలో లడ్డూలో నెయ్యి పస లేదంటూ పోస్ట్ చేశారు. ఇలాంటి ఫిర్యాదులు గతంలోనూ వచ్చాయి. కానీ సమగ్ర దర్యాప్తు ఇప్పుడే జరిగింది.


ప్రభుత్వ జీవోలో 'గత ప్రభుత్వం' ఎందుకు?

ప్రభుత్వం జారీ చేసిన జీవోలో 'గత ప్రభుత్వ హయాంలో బాధ్యులపై చర్యలు' అని పేర్కొంది. ఇది రాజకీయంతో ముడిపడి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టెండర్ నిబంధనలు సడలించారు. కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది రాజకీయంగా వైఎస్సార్సీపీని టార్గెట్ చేయడమే. సిట్ రిపోర్టులో బాధ్యులు తేలకపోవడం లేదు. 36 మందిని నిందితులుగా పేర్కొంది. కానీ మరిన్ని వివరాలు కావాలని కమిటీ ఏర్పాటు అయింది.

ఇప్పటికే చర్యలు... అరెస్టుల అవకాశం?

ప్రొక్యూర్‌మెంట్ అధికారులపై చర్యలు తీసుకోవడం టీటీడీలో సాధారణమే. ఇప్పుడు కూడా కొందరు అధికారులపై వేటు పడింది. మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేశారు. అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు సిఫారసు చేశారు. వీరు టెండర్ నిబంధనలు సడలించి, పర్యవేక్షణలో వైఫల్యం చూపారని సిట్ చెప్పింది. ఇప్పటికే డెయిరీ ఎక్స్‌పర్ట్ విజయభాస్కర్ రెడ్డి లంచాలు తీసుకున్నట్టు అంగీకరించాడు. అనిల్, ధర్మారెడ్డి, బాలాజీలపై మరిన్ని ఆరోపణలు వస్తే అరెస్ట్ తప్పకపోవచ్చు.

టీటీడీ మాజీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డిపై?

ఆయన హయాంలోనే నిబంధనలు మార్చారని ఆరోపణలు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం నిరాకరించింది. అరెస్ట్ అవకాశం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ‘ల్తీలో నా ప్రమేయం లేదు’ అంటున్నారు సుబ్బారెడ్డి.

దినేష్ కుమార్ ను ఎందుకు ఎంచుకున్నారు?

దినేష్ కుమార్ 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. 2017లో ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఆనంతపూర్, అదిలాబాద్ కలెక్టర్, సోషల్ వెల్ఫేర్ కమిషనర్, ఇరిగేషన్ సెక్రటరీ, పోలవరం సీఈఓ వంటి కీలక పదవులు నిర్వహించారు. పనితీరు అద్భుతం అని సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు అందుకున్నారు. రిటైర్డ్ అయినా పరిపాలనా అనుభవం కారణంగా ఏపీ ప్రభుత్వం ఆయన్నే ఎంచుకుంది. ‘పారదర్శకత, నిష్పక్షపాతం’ ఆయన బలం అని ప్రభుత్వంలోని కొందరు చెబుతున్నారు.

కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ప్రభుత్వం ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుందా? ఏకసభ్య కమిటీ నివేదిక తర్వాతే స్పష్టత వస్తుంది. భక్తులు ఆశిస్తున్నది ఒక్కటే... తిరుమల పవిత్రత కాపాడాలి!

Read More
Next Story