
కృష్ణపట్నం పోర్ట్ అభివృద్ధి వెనుక 'గ్రీన్ డీల్' రహస్యం
పర్యావరణం పేరుతో భూముల మార్పిడి ?
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్ట్ అభివృద్ధి పేరుతో జరిగిన అటవీ భూముల బదిలీ వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోర్ట్ దక్షిణ భాగంలో కంటైనర్ కాంప్లెక్స్, రైలు-రోడ్డు కనెక్టివిటీ కోసం అవసరమైన 'ద్వీపాలు' (ఐలాండ్స్) పేరుతో ముత్తుకూరు మండలంలోని ఎపూర్ రిజర్వ్ ఫారెస్ట్ (RF) నుంచి 1,033 ఎకరాల అటవీ భూమిని డైవర్ట్ చేశారు. దీనికి బదులుగా జిల్లాలోని వివిధ గ్రామాల్లోని ‘కొండ పోరంబోకు’ భూములను అటవీ శాఖకు అప్పగించారు. ఈ మార్పిడి వెనుక ఉన్న ఉద్దేశ్యం స్పష్టమైన పర్యావరణ సంరక్షణ కాదు. మరింతగా కార్పొరేట్ లాభాలు, రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
జి.ఓ.ఎంస్. నెం.571 ద్వారా భూమి బదిలీ
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2012లో జారీ చేసిన జి.ఓ.ఎంస్. నెం.571 ద్వారా ఈ భూమి బదిలీ జరిగింది. ఇందులో పంగిలి (రాపూరు మండలం)లో 216 ఎకరాలు, వరికుంటపాడులో 230 ఎకరాలు, తురుపు యర్రబల్లి (కొండాపురం మండలం)లో 468.06 ఎకరాలు, దేవరాజు-సూరాయపల్లి (సీతారామపురం మండలం)లో 27.91 ఎకరాలు, గుడినరవ (ఉదయగిరి మండలం)లో 87.97 ఎకరాల ప్రభుత్వ భూములను అటవీ శాఖకు ఇచ్చారు. ఈ భూములు ఎక్కువగా బంజరు లేదా కొండ ప్రాంతాలవి. అంటే అటవీ సంపదకు సమానమైన విలువ లేదు. అయితే డైవర్ట్ చేసిన 1,033 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ భాగం. ఇందులో పర్యావరణ సమతుల్యతకు కీలకమైన వృక్షసంపద, జీవవైవిధ్యం ఉన్నాయి.
ఈ వ్యవహారం వెనుక ఉన్న మతలబు పరిశీలిస్తే... ఇది సాధారణ భూమి మార్పిడి కాదు. పర్యావరణ నిబంధనలను వక్రీకరించి, పోర్ట్ డెవలపర్లకు అనుకూలంగా చేసిన 'గ్రీన్ వాషింగ్' లాగా కనిపిస్తుందనేది పరిశీలకుల వాదన. 2012లో ఈ ఆదేశాలు జారీ అయినప్పుడు కృష్ణపట్నం పోర్ట్ నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ చేతుల్లో ఉంది. కానీ 2020-2021లో ఇన్‌కమ్ టాక్స్ రైడ్స్ తర్వాత, అదానీ గ్రూప్ దీన్ని అక్వైర్ చేసింది. కృష్ణపట్నం పోర్ట్ అక్విజిషన్ వెనుక లేని వస్తువులు చూడడం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
కృష్ణపట్నం పోర్టులో ఒక భాగం
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల ఒత్తిడి, రాజకీయ ఒప్పందాలు?
కృష్ణపట్నం పోర్ట్‌ను అదానీ గ్రూప్ అక్వైర్ చేసిన వ్యవహారం వెనుక ‘సంయుక్త కుట్ర లేదా ఒప్పందం’ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ప్రభుత్వ ఏజెన్సీలు (ఇన్‌కమ్ టాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటివి) రాజకీయ నాయకుల మధ్య సమన్వయంతో, పోర్ట్ యజమానులపై ఒత్తిడి తెచ్చి అదానీకి అనుకూలంగా విక్రయం చేయించారనేది. ఇది సాధారణ వ్యాపార డీల్ కాదు, మరింతగా ‘బలవంతపు అక్విజిషన్’ లాగా కనిపిస్తుంది. ఈ ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు, పర్యావరణ వాదులు, మీడియా నివేదికల నుంచి వచ్చాయి. అదానీ గ్రూప్ వీటిని ‘తప్పుడు, ఆధారరహితమైనవి’ అని ఖండిస్తోంది.
కృష్ణపట్నం పోర్ట్‌ను నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ (NECL) నిర్మించి నిర్వహిస్తోంది. 2012లో మొదటి ఇన్‌కమ్ టాక్స్ రైడ్స్ జరిగాయి. ఆ తర్వాత 2018 అక్టోబర్‌లో మరోసారి ఐటీ ఆఫీసర్లు నవయుగ ఆఫీసులు, ఎగ్జిక్యూటివ్‌ల నివాసాలపై సోదాలు చేశారు. ఇందులో ట్యాక్స్ ఎవేషన్, షెల్ కంపెనీల ద్వారా డబ్బు లాండరింగ్, అన్‌డిస్‌క్లోజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆరోపణలు ఉన్నాయి. నవయుగ గ్రూప్ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు సన్నిహితులు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం.
కాంపిటీషన్ కమిషన్ ఆమోదం
2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ) ముఖ్యమంత్రి అయిన తర్వాత, నవయుగ కాంట్రాక్టులను రివ్యూ చేసి క్యాన్సిల్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ బీజేపీతో సన్నిహితంగా ఉంది. జగన్ ప్రభుత్వం అదానీకి అనుకూలంగా పలు ప్రాజెక్టులు (సోలార్ పవర్ వంటివి) ఇచ్చింది. ఈ ఒత్తిడి మధ్య 2020 ఫిబ్రవరిలో అదానీ పోర్ట్స్ 75 శాతం షేర్లు కొనుగోలు చేసింది. 2021లో పూర్తి నియంత్రణ తీసుకుంది. మొత్తం విలువ రూ.13,500 కోట్లు. ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం ఇచ్చింది.
ఆరోపణల వివరాలు
ఐటీ, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలు రైడ్స్ చేసి, కంపెనీలను బలహీనపరిచి అదానీకి విక్రయించేలా చేస్తున్నాయని ఆరోపణలు. ఉదాహరణకు నవయుగ పై రైడ్స్ తర్వాత వారి ఆర్థిక స్థితి క్షీణించింది. పోర్ట్ విక్రయం జరిగింది.
మోదీ ప్రభుత్వం అదానీ కి అనుకూలంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు (జగన్ ప్రభుత్వం) సహకరించిందని విమర్శలు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ఈ ఆరోపణలు చేశారు. ‘‘సీబీఐ, ఈడీ రైడ్స్ తర్వాత అదానీకి పోర్ట్ వచ్చింది’’.
ఇలాంటి ప్యాటర్న్ అదానీ ఇతర అక్విజిషన్లలో కనిపిస్తుంది. ముంబై ఎయిర్‌పోర్ట్ (జీవీకే గ్రూప్ రైడ్స్ తర్వాత), అంబుజా సిమెంట్స్ (హోల్సిమ్ రైడ్స్ తర్వాత), ఎన్‌డీటీవీ (ప్రమోటర్లపై కేసుల తర్వాత). ఈ ఆరోపణలు అదానీ గ్రూప్ 'ఇన్‌ఆర్గానిక్ గ్రోత్' (అక్విజిషన్ల ద్వారా) వెనుక ప్రభుత్వ సహాయం ఉందని సూచిస్తున్నాయి.
అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ అన్ని అక్విజిషన్లు చట్టబద్ధంగా, మార్కెట్ విలువల ప్రకారం జరిగాయని చెబుతోంది. ప్రతిపక్షాలు (కాంగ్రెస్, ఏఏపీ) ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిరూపిత కుంభకోణం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యవహారాలను పరిశీలిస్తోంది. మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నవయుగ బిడ్ చేసినప్పటికీ, అదానీ కి విక్రయించడం ద్వారా పోర్ట్ మోనోపలీ సృష్టించారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదానీ నియంత్రణలో ఉన్న పోర్ట్ అభివృద్ధికి ఈ భూమి ఉపయోగపడుతోంది. పెట్రోలియం ఇంపోర్ట్ అనుమతి కూడా ఇటీవల మంజూరైంది.
ఫారెస్ట్ భూములు వేరే పర్పస్ కు ఎలా ఇస్తారు?: ఈఏఎస్ శర్మ
మడ ఫారెస్ట్ అడవులు సముద్రానికి ఎంతో ఉపయోగం. ఈ అడవులు ఉంటేనే పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. అటువంటిది వాటిని నాశనం చేస్తే భవిష్యత్ తరాలు ఇబ్బందుల్లో పడతారు. కృష్ణపట్నం పోర్టుకు ఐస్ ల్యాండ్స్ ఇచ్చేసి పనికి రాని కొండ పోరంబోకు భూములను రెవెన్యూ నుంచి ఇవ్వటం కూడా తప్పని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ కొండ పోరంబోకు భూములు అడవులుగా మార్చాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. పైగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుని కేటాయిస్తే సరిపోదు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ కేంద్రం అనుమతి కావాలి. అదాని కి కావాల్సినవి ఇవ్వాలనుకుంటే ఇది మార్గం కాదు అని చెప్పారు. సోలార్ ఎనర్జీకి సంబంధించిన డీల్స్ లో కూడా అదానీకి ప్రభుత్వం ఫేవర్ చేసిందనే విషయాన్ని ఇప్పటికే తాను కేంద్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసినట్లు చెప్పారు.
ఇంత దారుణమా? : సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య
మడ అడవులు పర్యావరణాకి ఎంతో మేలు చేస్తాయి. ఫారెస్ట్ భూములు రోజురోజుకు కుంచించుకు పోతున్నాయి. కృష్ణపట్నం పోర్టు సమీపంలోని ఐస్ ల్యాండ్స్ ను అదాని కంపెనీకి అప్పగించడం వెనుక గ్రీన్ ల్యాండ్ డీల్స్ ఉన్నాయని చెప్పక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను ఇష్టానుసారం అమ్ముతోంది. కొందరికి ఉచితంగా ఇస్తోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి తనయుడు మా ఇష్టం మీరెవరు ప్రశ్నించడానికి అంటున్నారు. ఇదేమి పాలన అంటూ ఈశ్వరయ్య ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టుకు మూడు ఐస్ ల్యాండ్స్ అప్పగించి పనికి రాని కొండ పోరంబోకు భూమిని ఫారెస్ట్ వారికి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఏపీలో అడవులు ఇప్పటికే నాశనం అయ్యాయి. సాధారణ అడవులు ఒక వైపు స్మగ్లర్ల చేతుల్లో నాశనం అవుతుంటే పెట్టుబడి దారుల చేతుల్లోని మడ అడవులు పోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులు అయినందున భూములను పెట్టుబడి దారులకు అప్పనంగా అప్పగించే పద్ధతి ఉప సంహరించుకోవాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. ఈ విధంగా సెంటు భూమి పేదవాడికి ఇచ్చేందుకు కూడా లేకుండా చేస్తే పెట్టుబడి దారులు రాజ్యం ఏలుతారని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు నాయుడు పెట్టుబడి దారుల చేతుల్లో పెట్టారని విమర్శించారు. ఈ విధమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా తాము ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఈశ్వరయ్య చెప్పారు.
పర్యావరణ దృక్కోణంలో...
రిజర్వ్ ఫారెస్ట్ భూమిని డైవర్ట్ చేసి, బదులుగా బంజరు భూములు ఇవ్వడం ద్వారా అటవీ సంపద నష్టం జరిగింది. ఈ భూముల్లో మాంగ్రోవ్ ప్యాచెస్ ఉన్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇవి తీరప్రాంత రక్షణకు కీలకం. అయితే ప్రభుత్వం ఈ మార్పిడిని ‘సమాన విలువ’ గా చూపించి గ్రామ సభల్లో అభ్యంతరాలు రాకుండా తహసీల్దార్లు చర్యలు తీసుకున్నారు. ఇది స్థానికుల అభిప్రాయాలను అణచివేసినట్లు కనిపిస్తుంది. ఇటువంటి వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్‌లో ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ కాంట్రవర్సీలతో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై 76.74 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ గ్రాబ్ ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై ప్రోబ్ ఆర్డర్ చేశారు.
రాజకీయ కోణంలో...
ఈ భూమి మార్పిడి మంత్రి వర్గం నిర్ణయం ద్వారా జరిగింది. కానీ దీని వెనుక కార్పొరేట్ పొలిటికల్ నెక్సస్ కనిపిస్తుంది. అదానీ గ్రూప్ ఇటువంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం, ప్రభుత్వం నిబంధనలను సడలించడం. ఇది 'పబ్లిక్ ఇంటరెస్ట్' పేరుతో జరుగుతున్నట్లు కనిపిస్తున్నా, వాస్తవానికి ప్రైవేట్ మోనొపొలీ సృష్టికి దారి తీస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి ఫారెస్ట్ డైవర్షన్లు ఇతర ప్రాజెక్టుల్లో కూడా కనిపిస్తున్నాయి. డమగుండం ఫారెస్ట్ ల్యాండ్ నావల్ బేస్ కోసం లేదా విశాఖలో కార్తీక వనం ప్రాజెక్టు.
మొత్తంగా ఈ ‘భూమి స్వాప్’ వ్యవహారం పర్యావరణ సంరక్షణకు బదులు, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికులు, పర్యావరణ వాదులు ఈ మార్పిడిని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై పారదర్శకత చూపాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇటువంటి నిర్ణయాలు మరిన్ని కుంభకోణాలకు దారి తీస్తాయి.

