అమరావతికి అప్పు కోసమేనా ‘టిస్’తో సామాజిక తనిఖీ!
x

అమరావతికి అప్పు కోసమేనా ‘టిస్’తో సామాజిక తనిఖీ!

అమరావతిలో సామాజిక తనిఖీ చేయటం సీఆర్డీఏకు సాధ్యం కాదా? టిస్ ద్వారా అయితే మరింత విశ్వసనీయత ఉంటుందనే కోణం...


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ పథకం (LPS) అమలులో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) బాధ్యతలను టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS)కు అప్పగించడం వెనుక రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణాలు ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ కింద మొదటి విడతలో 34,000 ఎకరాలకు పైగా భూములు సేకరించి పదేళ్లు గడిచినా అనేక ఆరోపణలు, ఆలస్యాలు, అసమానతలతో రైతులకు అందాల్సిన ప్లాట్లు అందలేదు. టిస్‌ను నియమించడం ద్వారా సీఆర్‌డీఏ పారదర్శకత, విశ్వసనీయతను పెంచాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నా, ఇది కేవలం పైపైకి మాత్రమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు సీఆర్‌డీఏకు తెలియలేదు అంటే ఎవ్వరూ నమ్మరు. అయినా థర్డ్ పార్టీ చేత ఆడిట్ చేయించింది. ఇది రైతుల ఆవేదనను పరిష్కరించడం కంటే అంతర్జాతీయ ఫండింగ్ రిక్వైర్‌మెంట్లు, రాజకీయ లబ్ధి కోసం ఎక్కువగా కనిపిస్తుందనే విమర్శలు వచ్చాయి.

టిస్ నియామకం ఎందుకు, ఎప్పుడు?

టిస్‌ను సామాజిక తనిఖీకి నియమించడం వెనుక ప్రధాన కారణం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో పారదర్శకత, సామాజిక న్యాయాన్ని ధృవీకరించడం. 2025 మేలో టిస్ వెబ్‌సైట్‌లో ప్రకటించిన రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగ ప్రకటన ప్రకారం ‘‘అమరావతి క్యాపిటల్ రీజియన్‌లో భూ సమీకరణ ప్రక్రియపై సామాజిక తనిఖీ’’ ప్రాజెక్టును సీఆర్‌డీఏ నిధులతో చేపట్టింది. ‘టిస్’ సామాజిక శాస్త్రాల్లో ప్రసిద్ధ సంస్థగా ఇలాంటి ఆడిట్లలో అనుభవం ఉంది. ఉదాహరణకు కేరళలో ఐసీడీఎస్ పథకాల తనిఖీలు, ఇతర రాష్ట్రాల్లో సోషల్ ఆడిట్లు నిర్వహించింది. సీఆర్‌డీఏ దీన్ని ఎంచుకోవడం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.

1. అంతర్జాతీయ ఫండర్లు అయిన వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి రూ.15,000 కోట్ల లోన్ కోసం సామాజిక, పర్యావరణ సేఫ్‌గార్డులు అవసరం. వీటికి ఇండిపెండెంట్ అసెస్‌మెంట్ తప్పనిసరి.

2. రైతుల నిరసనలు, బలవంతపు భూ సమీకరణ ఆరోపణల పై విశ్వసనీయత పెంచడం. వరల్డ్ బ్యాంక్ ఇన్‌స్పెక్షన్ ప్యానెల్ రిక్వెస్టర్లు 2017లోనే ఎల్‌పీఎస్‌లో బలవంతం, ఆర్థిక అన్యాయం ఉన్నాయని ఆరోపించారు. 2025లో మందడం రైతులు సీఆర్‌డీఏపై ఏడీబీ, వరల్డ్ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఒత్తిళ్ల మధ్య టిస్‌ను నియమించడం, సమస్యలను 'ఇండిపెండెంట్'గా పరిశీలించి, రుణాలను ఇబ్బందులు లేకుండా తీసుకోడానికి ఒక వ్యూహంగా కనిపిస్తుంది.

క్లీన్ చిట్ కోసమేనా?

టిస్ నియామకం సీఆర్‌డీఏకు 'క్లీన్ చిట్' ఇవ్వడానికి మాత్రమేనా? టిస్ కు నిధులు సీఆర్‌డీఏ నుంచి వస్తుండటం వల్ల ఇండిపెండెన్స్ ప్రశ్నార్థకం. గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) నివేదికలో ఎల్‌పీఎస్ లక్ష్యాలు సాధించలేదని, రూ.2,244 కోట్లు వ్యర్థమయ్యాయని విమర్శించింది. అయినా సీఆర్‌డీఏ స్వయంగా ఆడిట్ చేయకుండా థర్డ్ పార్టీకి అప్పగించడం, బాధ్యతలను తప్పించుకోవడంగా కనిపిస్తుందనే విమర్శలు పరిశీలకుల నుంచి వస్తున్నాయి.

సీఆర్‌డీఏకు సమస్యలు తెలియవా? నిర్లక్ష్యమా... వ్యూహమా?

ఇప్పటి వరకు ఉన్న సమస్యలు సీఆర్‌డీఏకు తెలియకపోవడం అసాధ్యం. ఎల్‌పీఎస్ అమలులో బలవంతపు సమీకరణ, కులాధారిత టార్గెటింగ్, రైతుల ఆదాయ నష్టం వంటి ఆరోపణలు 2016 నుంచే ఉన్నాయి. దళితులు, భూమిలేని పేదలు ఉద్యోగాలు కోల్పోయారు. భూమి విలువలు హెచ్చుతగ్గులు ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్లలోనే ఎల్‌పీఎస్ 'సబ్‌స్టాంటియల్‌గా పూర్తి' అయినా ఇండిపెండెంట్ అసెస్‌మెంట్ అవసరమని చెప్పారు. సీఏజీ రిపోర్ట్ ప్రకారం ఎక్స్‌పర్ట్ కమిటీ సూచనలు పట్టించుకోకుండా 70 శాతం భూమిని పూలింగ్ చేశారు. ఇది ఆర్థిక భారమయ్యింది.

సీఆర్‌డీఏ ఎందుకు స్వయంగా పరిష్కరించలేదు?

రాజకీయంగా పాలకులు మారటం వల్ల ప్రాజెక్ట్ నిలిచిపోయింది. రైతులు 1,900 రోజులు నిరసనలు చేశారు. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతిని పునరుద్ధరిస్తున్నా, సమస్యలు కొనసాగుతున్నాయి. టిస్ నియామకం, సమస్యలను 'అధికారికంగా' గుర్తించి, రైతుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఒక టూల్‌గా కనిపిస్తుంది. అయితే టిస్ సూచనల ప్రకారం స్పష్టమైన సరిహద్దులు, విడతల వారీ అభివృద్ధి అమలు చేయడం వల్ల మాత్రమే అనుకున్నది సాధ్యమవుతుంది.

మొత్తంగా టిస్ నియామకం సానుకూల అడుగయినా, సీఆర్‌డీఏ నిర్లక్ష్యం వల్లే సమస్యలు పెరిగాయి. ఇది రైతులకు న్యాయం చేయడం కంటే ఫండింగ్, రాజకీయ ఇమేజ్ కోసం ఎక్కువ ప్రయత్నం జరిగింది. ప్రభుత్వం తక్షణమే టైమ్‌బౌండ్ యాక్షన్ తీసుకోకుంటే అమరావతి 'ప్రజల రాజధాని' కాకుండా 'పాలకుల ఆటకట్టు'గా మిగిలిపోతుంది.

రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం: ముప్పాళ్ల

రాజధాని నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. దీనిని స్వాగతిస్తున్నాం. అయితే భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి సర్కార్ విఫలమైందని సీపీఐ జాతీయ సమితీ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన ‘ది ఫెడరల్’ ప్రతినిధితో మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్లాట్లు కేటాయించి, రిజిస్ట్రేషన్ లు పూర్తి చేసి నిర్మాణాలు చేసుకునేందుకు సీఆర్డీఏ పర్మిషన్ లు ఇవ్వాలి. రైతుల్లో ఉన్న ఆందోళనలు తొలకాలంటే వెనువెంటనే ఈ పని చేయాలి. లేకుంటే రెండో విడత భూ సేకరణ సజావుగా జరిగే అవకాశం లేదనే విషయం స్పష్టమవుతోంది అని నాగేశ్వరావు అన్నారు. మొదటి విడత తీసుకున్న భూముల్లో రాజధాని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్లీ రెండో విడత, మూడో విడత భూ సమీకరణకు పూనుకోవడం రైతులను బాధ పెట్టడమేనని అన్నారు.

Read More
Next Story