’వాస్తవ పొరపాటు‘.. వ్యవస్థలకు ఓ గుణపాఠం?
x

’వాస్తవ పొరపాటు‘.. వ్యవస్థలకు ఓ గుణపాఠం?

స్కిల్ కేసు క్లోజర్ రిపోర్ట్ .. దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపై పెను ప్రశ్నలు.


రాజకీయ కక్షసాధింపులు, వ్యవస్థల దర్యాప్తు, న్యాయస్థానాల తీర్పులు.. ఈ మూడింటి కలయికకు ’ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‘ కేసు ఒక క్లాసిక్ ఉదాహరణగా నిలిచిపోనుంది. 2021లో ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి 2026లో క్లోజర్ రిపోర్ట్ వరకు, ఈ కేసు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నో మలుపులు తిరిగింది. చివరకు ఏ సీఐడీ అయితే ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రధాన నిందితుడిగా పేర్కొని అరెస్ట్ చేసిందో.. అదే సీఐడీ ఈ కేసు నమోదును ఒక ’మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్‘ (Mistake of Fact) అని పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో కేసును మూసివేసింది. ఐదేళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత తేలిన ఈ చేదు నిజం.. దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపై ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది.

దర్యాప్తు ప్రస్థానం..ఆరోపణల నుంచి అంగీకారం వరకు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో మొదలైన ఈ కేసులో రూ. 371 కోట్ల భారీ అవినీతి జరిగిందని.. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించబడ్డాయని సీఐడీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే నారా చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ అనుభవించారు. అయితే, ఐదేళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత సమర్పించిన క్లోజర్ రిపోర్ట్ నాటి ఆరోపణలను పూర్తిగా పటాపంచలు చేసింది. నిధుల మళ్లింపునకు సంబంధించి ఎటువంటి ’మనీ ట్రైల్‘ లభించలేదని.. ఈ ప్రాజెక్టు కేవలం కేబినెట్ ఆమోదంతో తీసుకున్న విధానపరమైన నిర్ణయం అని సీఐడీ ఇప్పుడు అంగీకరించింది. నాడు సాక్ష్యాధారాలు ఉన్నాయని అరెస్ట్ చేసిన సంస్థే.. నేడు ’వాస్తవాలను తప్పుగా అంచనా వేశాం‘ అని పేర్కొనడం ఒక పెద్ద వైఫల్యం తప్ప మరేమిటి?

క్లీన్ చిట్ వెనుక చట్టపరమైన సత్యాలివే

ఈ కేసులో కేవలం రాష్ట్ర సంస్థే కాకుండా.. కేంద్ర దర్యాప్తు సంస్థ (ED) కూడా 2024లోనే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. తాజా క్లోజర్ రిపోర్ట్‌లో సీఐడీ ఐదు కీలక అంశాలను వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదని, శిక్షణ కేంద్రాల ఏర్పాటు వాస్తవమేనని, వేల మంది విద్యార్థులు అక్కడ శిక్షణ పొందారని గుర్తించారు. సిమెన్స్ వంటి అంతర్జాతీయ సంస్థల పాత్రపై లభించిన స్పష్టత కూడా ఈ కేసు మూసివేతకు ప్రధాన కారణమైంది. ఫలితంగా చంద్రబాబు నాయుడితో పాటు మరో 36 మంది (మాజీ మంత్రులు, ఐఏఎస్ అధికారులు) ఈ రాజకీయ చదరంగం నుండి క్లీన్ చిట్‌తో బయటపడ్డారు.

రాజకీయ వర్సెస్ చట్టబద్ధత.. నేర్చుకోవాల్సిన పాఠం

ఈ కేసు పరిణామాలు రెండు ప్రధాన పాఠాలను నేర్పుతున్నాయి. మొదటిది రాజకీయ కోణం.. ప్రభుత్వం మారినప్పుడల్లా దర్యాప్తు సంస్థల వాదనలు కూడా మారుతుండటం ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైన ధోరణి. దీనిని ప్రతిపక్షం ’ప్రభుత్వ ప్రభావిత నిర్ణయం‘గా అభివర్ణిస్తుంటే, అధికార పక్షం ’సత్యం గెలిచింది‘ అని నమ్ముతోంది. ఇక రెండవది చట్టపరమైన కోణం.. దర్యాప్తు సంస్థ ’మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్‘ అని అంగీకరించడం అంటే.. ప్రాథమికంగా కేసు నమోదు చేసే సమయంలోనే వాస్తవాలను సరిగ్గా విశ్లేషించలేదని అర్థం.

ఒక జాతీయ స్థాయి నాయకుడిని.. నాడు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేతని సుదీర్ఘకాలం జైల్లో ఉంచిన తర్వాత, అది కేవలం ’వాస్తవ పొరపాటు‘ అని సరిపెట్టుకోవడం వ్యవస్థల పనితీరును ఎండగడుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడితే, అంతిమంగా నష్టపోయేది ఆ సంస్థల ప్రతిష్టే. భవిష్యత్తులోనైనా దర్యాప్తు సంస్థలు రాజకీయాలకు అతీతంగా.. పక్కా ఆధారాలతోనే అడుగులు వేయాలని ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఒక హెచ్చరికగా నిలుస్తుంది.

Read More
Next Story