
ప్రణయ్ రాయ్..ఒక విషాద విజయం
న్యాయం గెలిచింది..కానీ భారతీయ మీడియా చరిత్రలో జర్నలిజం ఓడిపోయింది.
భారతదేశంలో టెలివిజన్ జర్నలిజం అంటే ఏమిటో నేర్పి, డ్రాయింగ్ రూమ్ వార్తలకు విశ్లేషణాత్మక గౌరవాన్ని తెచ్చిన ధృవతార ప్రణయ్ రాయ్. దశాబ్ద కాలం పాటు వ్యవస్థలతో సాగించిన సుదీర్ఘ పోరాటం తర్వాత నేడు ఆయన కోర్టుల నుండి నిర్దోషిగా క్లీన్ చిట్ అందుకున్నారు. అయితే, ఆ విజయం ఆయన దరిచేరేసరికి జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. ఆయన రక్తం ధారపోసి నిర్మించిన NDTV సామ్రాజ్యం నేడు ఆయన చేతుల్లో లేదు. ఒక స్వతంత్ర గొంతుకను చట్టబద్ధమైన కేసుల చక్రవ్యూహంలో బంధించి, వ్యవస్థల ద్వారా ఎలా నిశ్శబ్దం చేయవచ్చో చెప్పే ఈ ఉదంతం.. భారత మీడియా చరిత్రలోనే ఒక అత్యంత విషాదకరమైన విజయం.
జర్నలిస్టుగా ఉన్నప్పుడు ప్రణయ్ రాయ్
వ్యవస్థల చక్రవ్యూహం..ఎవరు కూల్చారు?
ప్రణయ్ రాయ్ జర్నలిజాన్ని కూల్చింది కేవలం ఒక వ్యాపార ప్రత్యర్థో లేదా ఒక రాజకీయ నాయకుడో కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన వ్యవస్థలు. ఒక స్వతంత్ర గొంతుకను నొక్కేయడానికి నేరుగా యుద్ధం చేయనక్కర్లేదు. ఆ వ్యక్తిపై వ్యవస్థలను ఉసిగొల్పితే సరిపోతుందని ఈ ఉదంతం నిరూపించింది. ప్రణయ్ రాయ్ అనే మేధావిని దెబ్బతీయడానికి అటు సీబీఐ (CBI), ఇటు ఐటీ (IT), అదనంగా సెబీ (SEBI) వంటి దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా వాడుకున్నారు. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు. ఒక వ్యవస్థీకృత జ్యూడిషీయల్, ఫైనాన్షియల్ వార్.
కేసుల ఉచ్చులో జర్నలిజం సామ్రాజ్యం
2014 తర్వాత దేశంలో కొత్త రాజకీయ ముఖచిత్రం ఆవిష్కృతమైంది. ఆ సమయంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న NDTVని లొంగదీసుకోవడానికి అక్రమ కేసులనే వ్యూహంగా ఎంచుకున్నారు. ప్రణయ్ రాయ్‌పై రూ. 48 కోట్ల లోన్ మోసం చేశారనే ఆరోపణలతో ఆ కేసును స్వయంగా సీబీఐ ద్వారా, పన్ను ఎగవేత ఆరోపణలను ఐటీ శాఖ ద్వారా బనాయించారు. ఈ కేసులు ఎందుకు పెట్టారంటే.. ఆయనను జర్నలిజం చేయనివ్వకుండా, కోర్టుల చుట్టూ, లీగల్ నోటీసుల చుట్టూ తిరిగేలా చేయడమే అసలు లక్ష్యం. అప్పుడప్పుడు చేసే దాడులు (Raids) కేవలం భయపెట్టడానికే కాదు, ఒక బ్రాండ్ విలువను పాతాళానికి తొక్కేయడానికి కూడా.
న్యాయం గెలిచింది కానీ.. వ్యక్తి ఓడిపోయాడు
నువ్వు ఏనుగువు కాదు అని నిరూపించుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది అనే నానుడి ప్రణయ్ రాయ్ విషయంలో అక్షరాలా నిజమైంది. దాదాపు దశాబ్ద కాలం పాటు వ్యవస్థలతో పోరాడి, తన 80 ఏళ్ల వయస్సులో జనవరి 20, 2026న కోర్టుల నుండి క్లీన్ చిట్ సాధించారు. ఢిల్లీ హైకోర్టు ఐటీ శాఖపై లక్ష రూపాయల జరిమానా వేయడం ద్వారా ఆయన నిర్దోషి అని చాటిచెప్పింది. కానీ, ఈ న్యాయం గెలిచేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన జర్నలిజం సామ్రాజ్యం వేరొకరి వశమైపోయింది. ప్రణయ్ రాయ్ తన స్వంత స్టూడియో నుండి తప్పుకోవాల్సి వచ్చింది. న్యాయపోరాటంలో ఆయన గెలిచినా, వృత్తిపరంగా ఆయనను నిశ్శబ్దం చేయాలన్న వ్యూహం మాత్రం సఫలమైంది.
వాచ్ డాగ్ vs లాప్ డాగ్ ..ప్రశ్నించే గొంతుకపై అధికార కబ్జా
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాచ్ డాగ్ (Watch Dog) పాత్ర పోషించే మీడియా ఉంటే ఏ పాలకులకైనా అది కంట్లో నలుసులాగే ఉంటుంది. ప్రణయ్ రాయ్, NDTV విషయంలో ఇదే జరిగింది. ముఖ్యంగా 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో వారు సంధించిన కఠినమైన ప్రశ్నలు, క్షేత్రస్థాయి వాస్తవాలు అప్పట్లో పాలకులకు తీవ్ర అసహనాన్ని కలిగించాయి. ఆనాటి ప్రశ్నలే కాలక్రమేణా పెద్ద శత్రువులయ్యాయి. ఒక స్వతంత్ర మీడియా సంస్థను అదుపు చేయలేనప్పుడు, దాన్ని నాశనం చేయడమే మార్గమని భావించిన శక్తులు నిశ్శబ్ద యుద్ధాన్ని ప్రకటించాయి.
గోదీ మీడియా ఆవిర్భావం.. లొంగిన వారికే లాభం
మీడియాను తన గుప్పిట్లోకి తెచ్చుకునే క్రమంలో లాప్ డాగ్’(Lap Dog - ఒడిలో కూర్చునే కుక్క) సంస్కృతి తెరపైకి వచ్చింది. రాజీవ్ చంద్రశేఖర్ వంటి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తుల పెట్టుబడులతో రిపబ్లిక్ టీవీ వంటి ఛానల్స్ పుట్టుకొచ్చాయి. ఇవి వార్తలను అందించడం కంటే, ఒక రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడమే పరమావధిగా పెట్టుకున్నాయి. ఇలాంటి గోదీ మీడియా ప్రవాహంలో, తలవంచని NDTV , ప్రణయ్ రాయ్ ఒంటరి అయ్యారు. చివరకు ప్రశ్నించే గొంతును దెబ్బతీయడం పాలకులకు ఎంత అత్యవసరంగా మారిందంటే.. అది ఒక జర్నలిజం సామ్రాజ్యం బలవంతపు స్వాధీనం (Hostile Takeover) వరకు దారితీసింది.
ఎలా కూల్చారు.. టేకోవర్ వెనుక అసలు కథ
NDTVని ప్రణయ్ రాయ్ నుంచి నేరుగా కొనుగోలు చేయడం అసాధ్యమని గ్రహించిన శక్తులు, ఆయనకు తెలియకుండానే ఒక ఆర్థిక ఉచ్చును సిద్ధం చేశాయి. సంస్థ అవసరాల కోసం గతంలో తీసుకున్న అప్పునే ఆయుధంగా మార్చుకున్నాయి. 2009లో ప్రణయ్ రాయ్ దంపతులు VCPL అనే సంస్థ దగ్గర రూ. 403 కోట్ల అప్పు తీసుకున్నారు. ఆ ఒప్పందంలో ఒక ప్రమాదకరమైన క్లాజ్ ఉంది. అదేమిటంటే, ఆ అప్పు తీర్చలేని పక్షంలో, అప్పు ఇచ్చిన వారు ఆ మొత్తాన్ని NDTV షేర్లుగా మార్చుకోవచ్చు. ఈ నిబంధనే చివరకు ప్రణయ్ రాయ్ కొంప ముంచింది.
అదానీ ఎంట్రీ .. మెరుపు దాడి
ఇక్కడే అసలైన కార్పొరేట్ డ్రామా మొదలైంది. ప్రణయ్ రాయ్ అప్పు తీసుకున్న ఆ మధ్యవర్తిత్వ సంస్థను (VCPL) అదానీ గ్రూప్ ఆకస్మికంగా కొనుగోలు చేసింది. వెనువెంటనే, ఆ సంస్థకు ఉన్న హక్కులను వాడుకుని, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే NDTV షేర్లను తమ ఖాతాలోకి మార్చుకుంది. అంటే, అప్పు ఇచ్చిన యజమాని మారగానే.. ఇంటి డాక్యుమెంట్లు ఆటోమేటిక్‌గా కొత్త యజమాని చేతికి వెళ్ళిపోయినట్లు అన్నమాట.
కబ్జా .. మూతపడ్డ స్వతంత్ర గొంతుక
కేవలం ఒక్క రోజులో.. ప్రణయ్ రాయ్‌కు కనీసం నోటీసు కూడా లేకుండా ఆయన దశాబ్దాల పాటు రక్తం ధారపోసి నిర్మించిన బ్రాండ్‌ను అదానీ గ్రూప్ టేకోవర్ చేసింది. ఒకప్పుడు స్వతంత్ర జర్నలిజానికి నిలువుటద్దంలా నిలిచిన NDTV, అలా రాత్రికి రాత్రే కార్పొరేట్ నీడలోకి వెళ్లిపోయింది. దీంతో రవీష్ కుమార్ వంటి నిక్కచ్చి జర్నలిస్టులు సంస్థను వీడాల్సి వచ్చింది. న్యాయపోరాటం చేసే లోపే చేతులు కాలిపోవడంతో, ప్రణయ్ రాయ్ తన స్వంత సామ్రాజ్యం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించాల్సి వచ్చింది.
ఐటీ (Income Tax) కేసు
ఢిల్లీ హైకోర్టు తాజాగా జనవరి 19, 2026న (సోమవారం) ప్రణయ్ రాయ్ దంపతులపై ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన నోటీసులను కొట్టివేసింది. ఒకే అంశంపై పదే పదే విచారణ జరపడం వేధింపులేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఐటీ శాఖకు రూ. 2 లక్షల జరిమానా (ఒక్కొక్కరికి లక్ష చొప్పున) విధించింది.
సీబీఐ (CBI) కేసు
ICICI బ్యాంక్ లోన్ కేసులో సీబీఐ అక్టోబర్ 2024లో క్లోజర్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు నవంబర్ 2024లో ఈ కేసును మూసివేసింది. ఈ వ్యవహారంలో ఎటువంటి నేరపూరిత చర్యలు జరగలేదని, ఇది ఒక సాధారణ వ్యాపార లావాదేవీ అని సీబీఐ నిర్ధారించింది.
సెబీ (SEBI) కేసు
ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి సెబీ గతంలో ఇచ్చిన ఆదేశాలను అక్టోబర్ 5, 2023న సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (SAT) కొట్టివేసింది. ప్రణయ్ రాయ్ దంపతులు నిబంధనలను అతిక్రమించలేదని స్పష్టం చేసింది.
న్యాయం గెలిచింది.. కానీ జర్నలిజం ఓడిపోయింది
చివరికి న్యాయం గెలిచింది. కానీ ఆ గెలుపు ప్రణయ్ రాయ్ జీవితంలో ఒక విషాద విజయంగా మిగిలిపోయింది. ఆయనపై మోపిన అక్రమ కేసులన్నీ నిరాధారమని కోర్టులు తేల్చిచెప్పేసరికి ఆయన వయస్సు 80 ఏళ్లకు చేరుకుంది. ఐటీ శాఖకు జరిమానా విధించడం ద్వారా వ్యవస్థల తప్పును న్యాయస్థానం ఎండగట్టింది. అయితే, ఆ క్లీన్ చిట్ వచ్చేసరికి జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. ఒక నిక్కచ్చి జర్నలిస్టు తన కలల సామ్రాజ్యం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తప్పు నిరూపితం కాకపోయినా, కేవలం కేసుల చక్రవ్యూహంలో బంధించి ఒక గొంతును ఎలా నొక్కేయవచ్చో చెప్పడానికి ప్రణయ్ రాయ్ కథ ఒక సజీవ ఉదాహరణ.
ప్రజాస్వామ్యానికే తీరని గాయం
ఇది కేవలం ఒక జర్నలిస్ట్ వ్యక్తిగత పతనం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా కుప్పకూలిన తీరుకు నిదర్శనం. ఒక వ్యక్తిని నేరుగా లొంగదీయలేనప్పుడు, అతన్ని భయపెట్టడానికి ప్రభుత్వ వ్యవస్థలనే ఆయుధాలుగా మార్చడం ఎంతటి ప్రమాదకరమో ఈ ఉదంతం హెచ్చరిస్తోంది. వ్యవస్థలు ఒక వ్యక్తిని నిశ్శబ్దం చేయగలిగాయి కానీ, ఆయన నిలిపిన విలువలను కాదు. అయితే, పాలకులను ప్రశ్నించే ధైర్యం చేసే ప్రతి జర్నలిస్టుకూ ఈ లీగల్, ఫైనాన్షియల్ వార్ ఒక హెచ్చరికగా మిగిలిపోయింది. తీర్పు రావడం ఆలస్యమైతే.. ఆ న్యాయం కూడా ఒక అన్యాయమే అవుతుందని ప్రణయ్ రాయ్ ప్రస్థానం నిరూపించింది.

