
పీపీపీ@అమరావతి
స్వప్న నగరమా? ఆర్థిక భారమా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్ దిశగా అడుగులు వేస్తోంది. అమరావతిని ఇకపై పీపీపీ @అమరావతి అని పిలవొచ్చనే చర్చ మొదలైంది. అమరావతికి స్వయం ప్రతిపత్తి కల్పించడం కోసం ప్రత్యేక చట్టాలు రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ADB) ఆధ్వర్యంలో ఇన్నోవేటివ్ అర్బన్ గవర్నెన్స్ సదస్సులో (2025 జులై) ఈ అవసరాన్ని గుర్తించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎపిసిఆర్‌డిఎ చట్టాల్లో మార్పులు చేయనుంది. భూమి మానిటైజేషన్, ప్రైవేట్ పెట్టుబడులకు వీలుగా నిబంధనలు రూపొందిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు సమంజసమైనవి? రాష్ట్ర ఆర్థిక స్థితి, పర్యావరణ ప్రభావాలు, సామాజిక న్యాయం దృష్ట్యా మంచి చెడు విశ్లేషిస్తే... ఇది స్వప్న నగర నిర్మాణానికి మార్గమా లేక మరిన్ని సమస్యలకు ఆహ్వానమా అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
సస్టైనబుల్ క్యాపిటల్ గా అమరావతిని తీర్చిదిద్దాలని...
ప్రభుత్వం అమరావతిని 'ఇంక్లూసివ్ అండ్ సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ'గా తీర్చిదిద్దాలని భావిస్తోంది. దీనికోసం ప్రపంచ బ్యాంకు, ADB నుంచి మొత్తం 1.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.13,600 కోట్లు) ఫండింగ్ పొందింది. 2025 మార్చిలో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌గా 207 మిలియన్ డాలర్లు విడుదలయ్యాయి. డిసెంబర్ నాటికి మరో 200 మిలియన్ డాలర్లు రానున్నాయి. ఈ ఫండింగ్ ఫేజ్-1 డెవలప్‌మెంట్‌కు (2025-2029) ఉపయోగపడుతుంది. మొత్తం ఖర్చు 3.64 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అంతర్జాతీయ నగరాలు (సింగపూర్, బ్రెజిలియా మొదలైనవి) మోడల్‌లను పరిశీలించి, స్వయం ప్రతిపత్తి కల్పించే చట్టాలు రూపొందిస్తున్నారు. భూముల అమ్మకాల ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, PPP ట్రాన్సాక్షన్లు, డిజిటల్ సొల్యూషన్లు, క్లైమేట్ రెసిలియెన్స్ వంటి అంశాలపై దృష్టి సారించారు.
అభివృద్ధి వేగవంతం, ఆర్థిక స్థిరత్వం
ఈ ప్రత్యేక చట్టాలు సమంజసమైనవని చెప్పుకోవడానికి పలు కారణాలున్నాయి. ముందుగా అమరావతిని గ్రోత్ హబ్‌గా మార్చడం ద్వారా ఉద్యోగాల సృష్టి, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ బ్యాంకు, ADB పర్యవేక్షణతో ట్రాన్స్‌పరెన్సీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ హామీ అవుతాయి. PPP మోడల్ ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్‌లు పెరిగి, రాష్ట్ర ఆర్థిక భారం తగ్గుతుంది. భూమి మానిటైజేషన్ పాలసీ ద్వారా లాంగ్-టర్మ్ ఫైనాన్సింగ్ ప్లాన్ రూపొందిస్తుండటం వల్ల, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫ్లడ్ మేనేజ్‌మెంట్, జెండర్ రెస్పాన్సివ్ అప్రోచ్‌లు అమలవుతాయనేది ప్రభుత్వ వాదన. 74వ రాజ్యాంగ సవరణకు లోబడి స్వయం ప్రతిపత్తి కల్పించడం వల్ల, అమరావతి స్వతంత్ర మున్సిపల్ అథారిటీగా మారి ఢిల్లీ, ఛండీగఢ్ లాంటి నగరాల మాదిరిగా అభివృద్ధి చెందుతుందని పాలకులు చెబుతున్నారు. 2025 అక్టోబర్‌లో జరిగిన మూడో రివ్యూ మిషన్‌లో ప్రోగ్రెస్ సాటిస్‌ఫ్యాక్టరీగా ఉందని ప్రపంచ బ్యాంకు, ADB నిర్ధారించాయి. ఇది రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి, ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందనేది పాలకుల మాట.
ఆర్థిక రిస్క్‌లు, సామాజిక అసమానతలు
ఈ ప్రయత్నాలు పూర్తిగా సమంజసమైనవి కావని విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయి ఉంది. అమరావతి ఫేజ్-1కు 3.64 బిలియన్ డాలర్ల ఖర్చు మరిన్ని అప్పులకు దారి తీస్తుంది. భూమి మానిటైజేషన్ అంటే వ్యవసాయ భూముల అమ్మకాలు. ఇది రైతుల జీవనోపాధిని ప్రభావితం చేసి, పర్యావరణ సమస్యలు (ఫ్లడ్ రిస్క్ పెరగడం) తెచ్చిపెడుతుంది. ప్రపంచ బ్యాంకు, ADB పర్యవేక్షణ తప్పనిసరి చేయడం వల్ల రాష్ట్ర స్వతంత్రత కోల్పోవడం, విదేశీ సంస్థల నియంత్రణ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విపక్షాలు ఇది రాజకీయ మోటివ్‌తో చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. మునుపటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వదిలేసి, TDP నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని పునరుద్ధరిస్తోంది. సామాజికంగా ఇది ధనిక వర్గాలకు మాత్రమే లాభం చేకూర్చి, గ్రామీణ ప్రజలను అన్యాయం చేస్తుందనే వాదన ఉంది. మూడు వర్క్‌షాపులు నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పినా రైతులు, స్థానికుల పాల్గొనడం సరిపోలేదని విమర్శలు.
నోటిఫై చేయడానికే కేంద్రం వెనకాడుతోంది: ఇఏఎస్ శర్మ
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్నది కూటమి ప్రభుత్వాలే. ఏపీ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని గుర్తించాలని చాలా మంది కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. నేను కూడా లేఖ రాశాను అయినా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందించ లేదు. ఇందులో ఉన్న రాజకీయాలు ఏమిటో అర్థం కావడం లేదని రిటైర్డ్ ఐఏస్ అధికారి, యాక్టివిస్ట్ ఇఏస్ శర్మ అన్నారు. అమరావతి ప్రాంతానికి ప్రత్యేక చట్టాలు తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారని ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధి ప్రశ్నించగా ప్రత్యేక చట్టాలంటూ ఏముంటాయి. స్థానిక సంస్థల చట్టం ఎలాగూ ఉంది. అమరావతికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలంటే కార్పొరేషన్ హోదా ఇవ్వాలి. అయితే ఆ హోదాతో పాటు మరికొన్ని వెసులు బాట్లు కల్పిస్తారేమో అని అన్నారు.
అమరావతి ఒక నగరంగా రూపుదిద్దుకోవాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందాలి. పేదలు లేని నగరంగా తయారు చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతం నగర నిర్మాణంలో 23 వేల మంది కూలీలు, వీరితో పాటు కిందిస్థాయి ఇంజనీర్లు పాల్గొంటున్నారు. ఏ నగరంలోనై పెట్టుబడి దారులు ఉన్నారంటే ఆప్రాంతంలో ఇంటి పనులు చేసే కూలీలు కావాలి. ఇంతెందుకు వందల మంది ఐఏస్, ఐపీఎస్, హై కోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్జీవోలు, ఇతర గ్రూప్స్ అధికారులు ఉంటారు. వారి ఇళ్లలో పనిచేసేందుకు కూలీలు కావాలి. ఇప్పుడు ఎవరైతే రాజధాని నిర్మాణ పనులకు ఒడిషా, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి వచ్చారో ఆ కూలీలు వెనక్కి వెళ్లే అవకాశం లేదు. వారు అక్కడే ఏదో విధంగా జాగా చూసుకుని నివాసం ఉంటారు. విశాఖపట్నం ప్రస్తుతం స్లమ్ లు ఎక్కువ ఉన్న ఏరియాగా మారిపోయింది. అమరావతి కూడా రానున్న రోజుల్లో ఇలాగే ఉంటుందని అన్నారు.
పెట్టుబడి దారీ సమాజం ఉన్న చోట పేదరికం లేకుండా ఉంటుందనుకోవడం పొరపాటేనన్నారు. అమరావతిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లకు కొందరికి ధరకు ఇండ్ల స్థలాలు ఇచ్చారు. వారికి ఎందుకు ఇవ్వాలి? పేదలకు ఇచ్చారంటే అర్థం ఉంది. ప్రస్తుతం రిటైర్డ్ అయిన వారంతా ఎక్కువ మంది హైదరాబాద్ లో ఉంటున్నారు. వారికి అమరావతిలో కూడా ఇళ్ల స్థలాలు ఇస్తూ పేదలకు సమానావకాశాలు అంటూనే ఈ పనులు ఏమిటని ప్రశ్నించారు ఇఏఎస్ శర్మ.
సవాళ్లు...
ఏకి అమరావతి ప్రత్యేక చట్టాలు అభివృద్ధి వేగాన్ని పెంచినా ఆర్థిక స్థిరత్వం, సామాజిక న్యాయం దృష్ట్యా మరిన్ని సవాళ్లు తెచ్చిపెట్టవచ్చు. ప్రభుత్వం ట్రాన్స్‌పరెన్ట్‌గా ముందుకు సాగితే మాత్రమే ఇది స్వప్న నగరంగా మారుతుంది. లేకపోతే మరో ఆర్థిక బోగస్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోతుంది. వచ్చే నెలల్లో చట్టాలు ఖరారు కావడంతో దీని ప్రభావం రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

