
మండిపోతున్న ఆయిల్ రిఫైనరీలు
యుద్ధంతో రోజూ రూ.9వేల కోట్ల ఆయిల్ ఆవిరి!
42 రోజుల్లో పడిపోయిన ఆయిల్ ఉత్పత్తి విలువెంతో తెలుసా..
ఇరాన్-అమెరికా యుద్ధం ప్రపంచ ఆర్ధిక, ఇంధన ముఖచిత్రాన్ని అత్యంత క్లిష్టమైన దశలోకి నెట్టింది. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం ఇవాళ్టికి (ఏప్రిల్ 10) సరిగ్గా 42వ రోజుకు చేరుకుంది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించినా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, హర్మూజ్ జలసంధిపై భిన్నమైన వాదనలు ప్రపంచాన్ని ఆందోళనలోనే ఉంచాయి. ఈ నేపథ్యంలో యుద్ధ సమయంలో తమ దేశ చమురు ఉత్పత్తికి భారీగా నష్టం వాటిల్లిందని సౌదీ అరేబియా వెల్లడించింది. ఇరాన్ అనుకూల ముఠాల దాడులు తమపై కొనసాగుతున్నాయని కువైట్ ఆరోపించింది.
ఇంధన మార్కెట్ అతలాకుతలం...
ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్-అమెరికా యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా చమురు ఉత్పత్తి కేంద్రమైన పశ్చిమాసియాలో యుద్ధం జరగడం వల్ల సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది.
యుద్ధం మిగిల్చిన ఆర్థిక గాయం..
పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచ చమురు ఉత్పత్తిలో మునుపెన్నడూ లేని విధంగా భారీ కోత పడింది. ముఖ్యంగా సౌదీ అరేబియా వంటి అతిపెద్ద ఉత్పత్తిదారులపై దాడులు జరగడం ప్రపంచాన్ని ఆందోళనలో నెట్టింది. యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో రోజుకు దాదాపు 80 లక్షల నుండి 1 కోటి బ్యారళ్ల (8-10 Million bpd) ఉత్పత్తి నిలిచిపోయినట్లు అంచనా.
తన దేశ చమురు ఉత్పత్తి, ఎగుమతులకు జరిగిన నష్టాన్ని సౌదీ అరేబియా తొలిసారి వెల్లడించింది. చమురు ఉత్పత్తి, రవాణా, రిఫైనరీ కేంద్రాలు, పెట్రోకెమికల్, పవర్ ప్లాంట్‌లు దెబ్బతిన్నాయని పేర్కొంది. రియాద్‌తో పాటు ఎర్రసముద్రం తీరంలోని యాన్బు నగరంలో ఈ నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌లోని పంపింగ్ స్టేషన్ ధ్వంసమైందని, దాంతో రోజుకు ఏడు లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పడిపోయిందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ యుద్ధం కారణంగా మనిఫా, ఖురైస్‌లో రోజుకు ఆరు లక్షల బ్యారెళ్ల మేర ఉత్పత్తి తగ్గింది. అలాగే రాస్ తనురా, సమ్రెఫ్, సతోర్ప్ వంటి రిఫైనరీల పైనా దాడులు జరిగాయని చెప్పింది.
ఏయే దేశాల్లో ఎంతెంత ఆయిల్ ఉత్పత్తి తగ్గిందంటే..
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటికి ఆయిల్ ఉత్పత్తి బాగా తగ్గింది.
సౌదీ అరేబియాలో 35 - 40 లక్షల బ్యారల్స్, ఇరాన్ లో 25 - 30 లక్షల బ్యారల్స్, ఇరాక్ లో 15నుంచి 20 లక్షల బ్యారల్స్, కువైట్, యూఏఈలో 10 నుంచి 15 లక్షల బ్యారళ్ల ఆయిల్ ఉత్పత్తి నిలిచినట్టు సమాచారం. యుద్ధ భయంతో, రవాణా మార్గాలు మూసుకుపోవడంతో తగ్గుదల కనిపిస్తోంది.
రోజుకు రూ.9,127 కోట్ల నష్టం..
దీన్ని రూపాయల్లోకి మారిస్తే ప్రస్తుత ధరల అంచనా (ఏప్రిల్ 10) ప్రకారం ఒక బ్యారెల్ ముడి చమురు ధర సుమారు 98.42 డాలర్లు. (బ్రెండ్ క్రూడ్ ధరల ఆధారంగా). డాలర్ విలువ ఇప్పుడు మనదేశంలో సుమారు ₹ 92.74. అంటే ఒక బ్యారెల్ ధర సుమారుగా ₹ 9,127 (సుమారుగా).
యుద్ధం వల్ల రోజుకు 80 లక్షల నుండి 1 కోటి బ్యారళ్ల ఉత్పత్తి నిలిచిపోతే- ప్రతిరోజూ ప్రపంచ మార్కెట్ నుండి సుమారు 7,300 కోట్ల నుండి 9,100 కోట్ల రూపాయల విలువైన చమురు కనుమరుగవుతోంది.
42 రోజుల యుద్ధంలో మొత్తం నష్టం ఎంతంటే...
యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుండి నేటి వరకు (42 రోజులు) జరిగిన సగటు నష్టాన్ని లెక్కిస్తే.. రోజుకు సగటున ₹ 8,200 కోట్లు (80 లక్షల బ్యారళ్లకు) తక్కువలో తక్కువ వేసుకున్నా ₹ 3,44,400 కోట్లు నష్టం వాటిల్లినట్టు.
ప్రపంచంపై దీని ప్రభావం...
ఇది కేవలం ఉత్పత్తి కోల్పోయిన ఫలితంగా వచ్చన నష్టమే. కానీ దీనివల్ల కలిగే ఇతర నష్టాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పెరిగి, ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతాయి. ఇండియా లాంటి దేశం తన అవసరాలకు 80% పైగా చమురును దిగుమతి చేసుకుంటుంది. ధరలు ఇలాగే పెరిగితే దేశ విదేశీ మారక నిల్వలు హరించుకుపోయి, రూపాయి విలువ మరింత పడిపోతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, పప్పులు, ఉప్పులు, కూరగాయల ధరలు రెట్టింపు అవుతాయి.
హర్ముజ్ జలసంధి దిగ్బంధం: మరో పెద్ద దెబ్బ
ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గం ద్వారా జరిగే చమురు రవాణాలో 20% (రోజుకు సుమారు 2 కోట్ల బ్యారళ్లు) ఒక్క హర్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో, ఉత్పత్తి ఉన్నప్పటికీ ఇతర దేశాలకు చమురును చేరవేయడం అసాధ్యంగా మారింది.
ప్రపంచానికి జరిగే నష్టం ఏమిటి?
చమురు ఉత్పత్తి తగ్గడం వల్ల కేవలం పెట్రోల్ ధరలే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు (పాలు, కూరగాయలు, మందులు) విపరీతంగా పెరుగుతాయి.
పారిశ్రామిక మాంద్యం...
ప్లాస్టిక్, ఫెర్టిలైజర్స్, ఫార్మా రంగాలు ముడి చమురుపై ఆధారపడి ఉంటాయి. చమురు లేకపోతే ఈ పరిశ్రమల ఉత్పత్తి ఆగిపోతుంది. చమురు కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి రావడంతో భారత్ వంటి దేశాల రూపాయి విలువ భారీగా పడిపోతుంది.
విమానయాన, రవాణా రంగాల సంక్షోభంలో పడతాయి. విమాన ఇంధనం (ATF) ధరలు పెరిగి, అనేక విమానయాన సంస్థలు దివాలా తీసే పరిస్థితి వస్తుంది.
ప్రస్తుతం రోజుకు కోటి బ్యారళ్ల చమురు కొరతను భర్తీ చేయడం ఏ ఒక్క దేశం వల్లా సాధ్యం కాదు. అమెరికా తన వ్యూహాత్మక నిల్వలను (Strategic Reserves) విడుదల చేసినప్పటికీ, అది కొన్ని వారాల కంటే ఎక్కువ కాలం సరిపోదు. "ఒకవేళ పాకిస్థాన్‌లో జరిగే చర్చలు విఫలమై, యుద్ధం కొనసాగితే.. బ్యారెల్ ముడి చమురు ధర 200 నుండి 250 డాలర్లకు చేరే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచ దేశాలను కోలుకోలేని ఆర్థిక మాంద్యంలోకి నెట్టేస్తుంది" అని ప్రముఖ ఆర్ధిక విశ్లేషకుడు ఏ.శ్రీరాం అభిప్రాయపడ్డారు.
Next Story

