అనంతపురమే కాదు, ఆంధ్ర కూడా ఆయనకు రుణపడి ఉందేమో
x

అనంతపురమే కాదు, ఆంధ్ర కూడా ఆయనకు రుణపడి ఉందేమో

నేడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి


ఒక మనిషి తన మాతృభూమిని ప్రేమించడం సహజం. కానీ ఏడు సముద్రాల అవతల ఉన్న ఒక ఎడారి లాంటి కరువు నేలను ప్రేమించి, తన శ్వాస ఉన్నంత వరకు ఆ మట్టి మనుషుల కోసం బ్రతకడం, ఆ గడ్డ మీద ప్రాణాలు వదలడం, ఆ మట్టిలోనే కలిసిపోవడం ఒక అద్భుతం. రాళ్లు, రప్పలతో నిండిన అనంతపురం నేలపై నిస్వార్థమైన సేవా సామ్రాజ్యాన్ని నిర్మించి, లక్షలాది మంది నిరుపేదల గుండెల్లో దైవదూతగా కొలువుదీరిన మహనీయుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. నేడు ఆయన జయంతి. స్పెయిన్ దేశంలో పుట్టి, తెలుగు గడ్డపై మానవత్వపు విత్తనాలు నాటిన ఈ మహా మనిషి ప్రస్థానం.. సంపద ఉండి కూడా సేవకు దూరంగా ఉండే నేటి ధనికులకు ఒక పదునైన ప్రశ్న. అధికారం కన్నా ఆత్మీయత మిన్న అని, దానం కన్నా గౌరవప్రదమైన జీవనం గొప్పదని నిరూపించిన ఫెర్రర్ స్ఫూర్తిని స్మరించుకుంటూ.. ఆయన మనకు వదిలి వెళ్లిన మానవీయ వారసత్వంపై ప్రత్యేక కథనం మీ కోసం.


మహారాష్ట్రలో సమరం.. బహిష్కరణ నుండి పునరాగమనం వరకు

ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ప్రస్థానం 1952లో ముంబై (బాంబే) తీరంలో అడుగుపెట్టడంతో మొదలైంది. ఒక జెసూట్ మిషనరీగా వచ్చిన ఆయన, మహారాష్ట్రలోని మన్మాడ్ ప్రాంతంలో పేద రైతుల పక్షాన నిలిచి భూమి కోసం, సాగునీటి కోసం పోరాడారు. ఈ సామాజిక పోరాటాలు రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతో, అప్పటి ప్రభుత్వం ఆయనను దేశం విడిచి వెళ్లాలని బహిష్కరణ వేటు వేసింది. అయితే, నిస్వార్థమైన ఆయన సేవను గుర్తించిన వేలాది మంది రైతులు ఆయన కోసం రోడ్లపైకి వచ్చి పోరాడారు. చివరకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా జోక్యం చేసుకుని.. ఫెర్రర్ దేశం విడిచి వెళ్లవచ్చు, కానీ త్వరలోనే తిరిగి వస్తారు అని ప్రకటించారు. ఆ మాట ప్రకారమే కొద్ది నెలల విరామం తర్వాత ఆయన మళ్ళీ భారత గడ్డపై అడుగుపెట్టారు. ఆమె సూచిన మేరకు ఆంధ్ర గడ్డపై అడుగుపెట్టారు.

అనంతపురం అరంగేట్రం .. ఎడారిలో సేవా సోలార్
1969లో ఫాదర్ ఫెర్రర్ ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన, కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. అప్పట్లో అనంతపురం అంటే కేవలం రాళ్లు, రప్పలు, ఎండమావులు, ఆకలి కేకల నిలయం. జిల్లాలో నెలకొన్న భీభత్సమైన కరువు పరిస్థితులను చూసి చలించిపోయిన ఆయన, ఈ ప్రాంతమే తన శ్వాస కావాలని, ఇక్కడి మనుషుల కన్నీళ్లు తుడవడమే తన పరమార్థమని నిర్ణయించుకున్నారు. ఇక్కడి కరువును పారద్రోలి, పేదవాడి బతుకుల్లో వెలుగులు నింపే లక్ష్యంతో తన భార్య అన్నే ఫెర్రర్‌తో కలిసి రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) కు పునాది వేశారు. ఆనాటి నుండి అనంతపురం మట్టి ఆయనకు ప్రాణమైంది, ఆ ప్రజలే ఆయన కుటుంబమయ్యారు.

పేదల పక్షాన నిలిచిన నిశ్శబ్ద విప్లవం - RDT ఆవిర్భావం
1969లో అనంతపురం జిల్లాలో అడుగుపెట్టిన ఫాదర్ ఫెర్రర్, సమాజంలో అట్టడుగున ఉన్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల దయనీయ స్థితిని చూసి చలించిపోయారు. కేవలం తాత్కాలికంగా ఆహారం లేదా డబ్బు ఇవ్వడం వల్ల వారి జీవితాల్లో మార్పు రాదని ఆయన బలంగా నమ్మారు. అందుకే, తన భార్య అన్నే ఫెర్రర్‌తో కలిసి 'రల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) కు శ్రీకారం చుట్టారు. అణగారిన వర్గాల ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారిని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ఈ సంస్థ ప్రస్థానం మొదలైంది. ఇది కేవలం ఒక స్వచ్ఛంద సంస్థగా కాకుండా, కరువు నేలపై ఆకలికి వ్యతిరేకంగా సాగించిన ఒక నిశ్శబ్ద మానవీయ విప్లవంగా అవతరించింది.

దానం కాదు.. స్వయం సమృద్ధే లక్ష్యం
ఫెర్రర్ సేవా దృక్పథం చాలా విభిన్నమైనది. పేదరికం నుండి విముక్తి పొందాలంటే స్వయం సమృద్ధి (Self-reliance) ఒక్కటే మార్గమని ఆయన ఆశించారు. పేదవాడికి తలదాచుకోవడానికి ఒక పక్కా ఇల్లు, వారి పిల్లల భవిష్యత్తు కోసం నాణ్యమైన చదువు, అనారోగ్యం పాలైనప్పుడు అండగా నిలిచే మెరుగైన వైద్యం.. ఈ మూడు ఉంటేనే ఒక నిరుపేద కుటుంబం గౌరవంగా బ్రతకగలదని ఆయన విశ్వసించారు. ఈ ఉన్నతమైన ఆశయాలతోనే RDT తన సేవలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లింది. ఆనాటి ఫెర్రర్ సంకల్పమే నేడు అనంతపురం జిల్లాలో వేలాది కుటుంబాలను పేదరికం నుండి బయటపడేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపింది.

అక్షర రూపంలో ఉజ్వల భవిష్యత్తు - విద్యా సేవలు
RDT సేవలలో విద్య అత్యంత కీలకమైనది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలు, ముఖ్యంగా అణగారిన వర్గాల బిడ్డలు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది. వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, వసతి గృహాలను ఏర్పాటు చేసి ఉచితంగా భోజన సౌకర్యాలను కల్పిస్తోంది. కేవలం ప్రాథమిక విద్యకే పరిమితం కాకుండా, ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తూ, వారిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సాఫ్ట్‌వేర్ నిపుణులుగా తీర్చిదిద్దుతోంది. జ్ఞానమే పేదరికాన్ని పారద్రోలే అసలైన ఆయుధమని RDT బలంగా నమ్ముతోంది.

పేదవాడికి సంజీవని - వైద్య సేవలు
వైద్య రంగంలో RDT సృష్టించిన మార్పు అద్భుతం. అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి, కణేకల్ వంటి ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించి, కార్పొరేట్ స్థాయి చికిత్సను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది. గర్భిణీ స్త్రీలకు సురక్షితమైన ప్రసవాలు, హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులకు ప్రత్యేక విభాగాల ద్వారా చికిత్స, అత్యవసర సేవలలో ఈ ఆసుపత్రులు జిల్లాకే తలమానికంగా నిలుస్తున్నాయి. లాభాపేక్ష లేని సేవా దృక్పథంతో ఇక్కడ వైద్యులు అందిస్తున్న సేవలు వేలాది మందికి పునర్జన్మను ప్రసాదిస్తున్నాయి.

ఆత్మగౌరవ సౌధాలు - శాంతి భవనాలు
ఒక నిరుపేద కుటుంబానికి ఆత్మగౌరవాన్ని ఇచ్చేది సొంత ఇల్లు. అందుకే RDT శాంతి భవనాలు పేరుతో లక్షకు పైగా పక్కా ఇళ్లను నిర్మించింది. ఈ ఇళ్ల నిర్మాణంలో మరో విప్లవాత్మక నిర్ణయం ఏమిటంటే, వాటిని ఆ కుటుంబంలోని మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించడం. దీనివల్ల మహిళలకు సామాజిక భద్రతతో పాటు కుటుంబంలో గౌరవం లభిస్తోంది. కేవలం ఇళ్లు కట్టడమే కాకుండా, ఆ కాలనీలలో పరిశుభ్రమైన వాతావరణం, మరుగుదొడ్లు, మొక్కలు నాటడం ద్వారా ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని సంస్థ అలవాటు చేస్తోంది.

గ్రామీణ ప్రతిభకు అంతర్జాతీయ వేదిక - క్రీడారంగం
క్రీడల ద్వారా కూడా సామాజిక మార్పు తీసుకురావచ్చని RDT నిరూపించింది. అనంతపురంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ విలేజ్ గ్రామీణ పిల్లలకు ఒక వరం. స్పెయిన్ క్రీడా దిగ్గజాల సహకారంతో టెన్నిస్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ వంటి క్రీడలలో పేద పిల్లలకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ అనంతపురం పేరును ప్రపంచ చిత్రపటంలో నిలుపుతున్నారు. ఆటలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణను పెంచుతాయని RDT నిరూపిస్తోంది.

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు - ప్రత్యేక సేవలు
సమాజంలో వివక్షకు గురయ్యే దివ్యాంగుల కోసం RDT చేస్తున్న సేవలు ఎంతో మానవీయమైనవి. అంధులు, మూగ , చెవుడు ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు నడుపుతూ వారికి జీవనోపాధిని చూపిస్తోంది. అలాగే, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి, అవయవాలను అమర్చుతోంది. దివ్యాంగులు ఎవరి మీద ఆధారపడకుండా, సమాజంలో గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతో వారికి వృత్తి విద్యా కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తూ అండగా నిలుస్తోంది.

మానవతా ధృవతార నిష్క్రమణ - కన్నీటి వీడ్కోలు:
అలా దశాబ్దాల పాటు అనంతపురం జిల్లాలోని నిరుపేదల కన్నీళ్లు తుడుస్తూ, ఆకలి లేని సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన మహా మనిషి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 2009, జూన్ 19న అనంతపురంలోనే కన్నుమూశారు. ఆయన మరణవార్త విన్న అనంతపురం జిల్లా శోకసంద్రంలో మునిగిపోయింది. వేలాది మంది ప్రజలు తమ ఇంట్లోని పెద్ద దిక్కును కోల్పోయినట్లుగా భావించి కన్నీటి వీడ్కోలు పలికారు. కేవలం ఒక వ్యక్తిగా వచ్చి, ఒక వ్యవస్థగా మారి, లక్షలాది మంది జీవితాలను మార్చిన ఆ మహనీయుడి భౌతిక కాయాన్ని అనంతపురం మట్టిలోనే సమాధి చేశారు. ఆయన మరణించినా, ఆయన చేసిన సేవలు ఈ నేల ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోతాయి.

వారసత్వంగా అందిన సేవ .. అన్నే , మోంచో ఫెర్రర్ కృషి
ఫెర్రర్ నిష్క్రమణ తర్వాత RDT అనే భారీ సేవా సామ్రాజ్యం ఆగిపోతుందేమో అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ, ఆయన భార్య అన్నే ఫెర్రర్, కుమారుడు మోంచో ఫెర్రర్ ఆ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అన్నే ఫెర్రర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సంస్థను ఒక తల్లిలా నడిపిస్తుంటే, మోంచో ఫెర్రర్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆధునిక సాంకేతికతతో సేవలను మరింత విస్తరిస్తున్నారు. ఫెర్రర్ లేని లోటు తెలియకుండా, ఆయన ఆశయాలను అదే నిబద్ధతతో, అదే వేగంతో వారు నేటికీ ముందుకు తీసుకెళ్తున్నారు. మూడు తరాలుగా ఒకే కుటుంబం ఒక మారుమూల ప్రాంతం కోసం అంకితమవ్వడం అనేది మానవ చరిత్రలోనే ఒక అరుదైన, అపురూపమైన ఘట్టం.

FCRA సంక్షోభం - నిలిచిపోయిన నిధుల ప్రవాహం
అలా ఎన్నో విశేషమైన సేవలు అందిస్తున్న RDT ఇటీవల విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) విషయంలో ఒక క్లిష్టమైన దశను ఎదుర్కొంది. 2021 డిసెంబర్ చివరలో, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక ఎన్జీవోల (NGOs) విదేశీ నిధుల లైసెన్సులను సమీక్షించిన క్రమంలో, RDT యొక్క లైసెన్స్‌ను పునరుద్ధరించడానికి నిరాకరించింది. నిధుల వినియోగంలో కొన్ని సాంకేతిక నిబంధనల ఉల్లంఘనలు , పారదర్శకతకు సంబంధించిన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనివల్ల ముఖ్యంగా స్పెయిన్ వంటి దేశాల నుంచి అందే నిధులు నిలిచిపోయి, అనంతపురంలో సాగుతున్న విద్యా, వైద్య , గృహనిర్మాణ వంటి అనేక సేవా కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలిగింది. వేలాది మంది లబ్ధిదారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఇది సంస్థకు పెద్ద సవాలుగా నిలిచింది.

పరిష్కారం - పునరుద్ధరణ
ఈ సంక్షోభం ఎదురైన వెంటనే RDT యాజమాన్యం అప్రమత్తమైంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తమ రికార్డులను సరిచేసుకుని, లైసెన్స్ పునరుద్ధరణ కోసం అవసరమైన పూర్తి వివరణలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించింది. సంస్థ దశాబ్దాలుగా చేస్తున్న నిష్కళంకమైన సేవలను , పారదర్శకతను గుర్తించిన ప్రభుత్వం, RDT కి సంబంధంచిన FCRA లైసెన్స్‌ను పునరుద్ధరించింది. దీంతో విదేశీ నిధుల ప్రవాహం తిరిగి ప్రారంభమై, ఆగిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం ఎటువంటి అడ్డంకులు లేకుండా సంస్థ తన సేవా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తూ, ఫాదర్ ఫెర్రర్ ఆశయాల దిశగా అడుగులు వేస్తోంది.
సంపద ఉంది.. సంకల్పం ఎక్కడ?:

ఫాదర్ ఫెర్రర్ మాదిరిగా ఆంధ్రులు ఎందుకు సేవలు చేయలేకపోతున్నారు అనేది ఆంధ్రదేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు, విదేశాల్లో స్థిరపడిన కోటీశ్వరులకు కొదవలేదు. గల్ఫ్ దేశాల నుండి అమెరికా వరకు తెలుగు వారు ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగి, ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా చాటుతున్నారు. అయితే, సంపద పెరిగినంతగా సమాజానికి తిరిగి ఇచ్చే (Giving back to society) గుణం మనలో పెరగలేదా? అనే సందేహం కలుగుతుంది. ఒక విదేశీయుడు ఏడు సముద్రాలు దాటి వచ్చి ఇక్కడ సేవా పునాదులు వేస్తే, మనం మాత్రం మన ఊరికి, మన జిల్లాకు కనీసం ఒక చిన్న సహాయం చేయడానికి కూడా ఎన్నో లెక్కలు వేస్తున్నాం. ఫెర్రర్ వద్ద ఆనాడు కేవలం బలమైన సంకల్పం మాత్రమే ఉంది, కానీ నేడు మన వద్ద అపారమైన వనరులు ఉన్నా, వాటిని సామాజిక హితం కోసం ఖర్చు చేసే సంకల్పం కొరవడటం విచారకరం.

నిజమైన నివాళి - మార్పు మనతోనే మొదలవ్వాలి
ఫెర్రర్ కుటుంబం మనకు నేర్పుతున్న అతిపెద్ద గుణపాఠం అదే. నీవు ఎక్కడ పుట్టావన్నది కాదు, నీవు ఎక్కడ ఉపయోగపడ్డావన్నదే ముఖ్యం. కోట్ల రూపాయలు సంపాదించి విదేశాల్లో స్థిరపడిన మన వారు, తమ ఊరి కోసం కనీసం ఒక చిన్న ప్రాజెక్టును చేపట్టినా ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. నేడు సేవ అనేది చాలా వరకు ప్రచారం కోసం చేసే ఒక ఈవెంట్ లా మారిపోయింది. కానీ సేవ అంటే ఒక మనిషిని గౌరవంగా బ్రతికేలా చేసే బాధ్యత అని గుర్తించినప్పుడే మన సమాజం మారుతుంది. ఫెర్రర్ చూపిన ఆ నిస్వార్థ మార్గంలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. మన స్వార్థం నుంచి బయటపడి, సమాజం కోసం ఒక అడుగు ముందుకు వేసినప్పుడే తెలుగు గడ్డపై మరిన్ని సేవా వృక్షాలు మొలుస్తాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ నివాళులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫాదర్ ఫెర్రర్ సేవలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఒక విదేశీయుడై ఉండి కూడా అనంతపురం జిల్లాను తన నివాసంగా మార్చుకుని, అక్కడి పేదరిక నిర్మూలనకు ఆయన చేసిన కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాల్లో ఫెర్రర్ అందించిన విద్యా, వైద్య సేవలు లక్షలాది మంది జీవితాలను మార్చాయని కొనియాడారు. మానవత్వానికి నిలువెత్తు రూపం ఫాదర్ ఫెర్రర్ అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవమని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్ర విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఫాదర్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లాలో RDT (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) ద్వారా ఫెర్రర్ సాగించిన సేవా ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత క్రీడాకారుల కోసం ఆయన నిర్మించిన స్పోర్ట్స్ విలేజ్, దివ్యాంగుల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఒక మనిషి తలచుకుంటే సమాజంలో ఎంతటి మార్పు తీసుకురావచ్చో చెప్పడానికి ఫెర్రర్ జీవితమే ఒక నిదర్శనమని లోకేష్ తన సందేశంలో వెల్లడించారు.
Read More
Next Story