మహారాష్ట్ర: స్థానిక సంస్థల నుంచి 2029 దిశగా బీజేపీ అడుగులు..
x

మహారాష్ట్ర: స్థానిక సంస్థల నుంచి 2029 దిశగా బీజేపీ అడుగులు..

మహారాష్ట్ర మున్సిపల్ పోల్స్ బీజేపీ విజయం, ఫడ్నవీస్ నాయకత్వాన్ని మరింత బలపరుస్తోంది. ఈ ఫలితాలు 2029 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయ సమీకరణలను ముందే సూచిస్తున్నాయి.


Click the Play button to hear this message in audio format

నాలుగేళ్ల తర్వాత నిర్వహించిన మహారాష్ట్ర(Maharashtra) పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేశాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా, అధికార భాగస్వాములైన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన(Shiv Sena), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(NCP)తో కలిసి ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ పరిణామాలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారాన్ని మరింత బలోపేతం చేశాయి. బీజేపీ భవిష్యత్ ప్రధానమంత్రి ఆశావహుల జాబితాలో ఫడ్నవీస్ పేరు చేరింది.

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు(Civic Polls) ఫలితాలు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి. నిధుల పంపిణీ, అభివృద్ధి పనులకు అనుమతులు, పరిపాలనా సహకారం.. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టానికి అనుగుణంగా జరిగిపోతుంటాయి. ఈ క్రమంలో మిగిలిన ఏకైక కీలక పరీక్ష .. జిల్లా పరిషత్‌, పంచాయతీ ఎన్నికలు. ఇవే 2029 లోక్‌సభ ఎన్నికల దిశను తిరిగి నిర్ణయిస్తాయి.


మున్సిపల్ తీర్పు ఏం చెబుతోంది?

మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపల్ కౌన్సిల్‌లు, మున్సిపల్ పంచాయతీల్లో వచ్చిన తీర్పు.. కేవలం ‘ఎన్ని సీట్లు ఎవరు గెలిచారు’ అన్న లెక్కకు మాత్రమే పరిమితం కాదు. బీజేపీ మొత్తం సీట్లలో సుమారు 50 శాతం దక్కించుకోగా, మిగిలినవి ఇతర పార్టీలు, స్వతంత్రులు పంచుకున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. మారుతున్న రాజకీయ వాతావరణంలో అధికారం పునాదిస్థాయి నుంచి ఎలా పునర్వ్యవస్థీకరించబడిందన్నదే ప్రధానం.

దాదాపు మూడు దశాబ్దాలుగా ఠాక్రేల ఆధిపత్యంలో ఉన్న ముంబై బృహన్ ముంబై(Mumbai) మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సహా అనేక ప్రధాన కార్పొరేషన్లు బీజేపీ చేతికి వచ్చాయి. ఇది సాంప్రదాయ ప్రత్యర్థుల మధ్య సాధారణ రాజకీయ పోటీ మాత్రమే కాదు. వనరులు, సంస్థాగత బలం, సమన్వయం, లక్ష్యం—అన్నింటిలోనూ అసమానత స్పష్టంగా కనిపించిన పోరు.

ఈ అసమతుల్యత ప్రభావాలు మున్సిపల్ హద్దులను దాటి రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బీజేపీ అధికార దాహం అన్ని స్థాయిల్లోనూ కనిపిస్తోంది. వ్యూహం, డబ్బు, యంత్రాంగం, కృషి—అవసరమైతే ఏ హద్దుకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పార్టీగా అది తనను తాను నిరూపించుకుంది.


రాజకీయ వ్యూహం..

2021కి వెళ్తే.. కోవిడ్ సెకండ్‌వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో బీజేపీ తన రాజకీయ ఎత్తుగడను అమలు చేసింది. ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని తనవైపు తిప్పుకుని శివసేనను చీల్చి, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కూల్చివేసింది. రెండు సంవత్సరాలకే ఎన్సీపీని కూడా రెండుగా విభజించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి డబ్బు, దర్యాప్తు సంస్థలు, పరిపాలనా బలం ఉన్నాయి. రాష్ట్రంలో ఏకతాటిపై ఉన్న ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం కష్టమని తెలుసుకున్న పార్టీ.. దాన్ని ముక్కలు చేయడం ద్వారా ఆధిపత్యాన్ని సాధించింది. దీని ఫలితంగా ప్రాంతీయ పార్టీలు విచ్ఛిన్నమయ్యాయి. కాంగ్రెస్ నాయకత్వం రాజీనామాలతో బలహీనమైంది. సమన్వయ వ్యూహం లేకపోవడం, వనరుల కొరత, పోరాట సామర్థ్యం తగ్గిపోవడం .. ఇవన్నీ మహారాష్ట్రలో రాజకీయ గందరగోళాన్ని సృష్టించాయి.

ఈ పరిస్థితుల్లో పూర్తి శక్తితో స్థానిక ఎన్నికల్లోకి దిగిన బీజేపీ ముందు మిగిలిన పార్టీలు అప్పటికే విడిపోయి కనిపించకుండా పోయాయి.

ఈ మొత్తం ఎన్నికల యంత్రాంగాన్ని ఫడ్నవీస్ చాలా సూక్ష్మంగా పర్యవేక్షించారు. తన పార్టీలోని ఇతర నాయకులను కూడా పక్కకు నెట్టినట్టే పరిస్థితి కనిపించింది.


నగరాల్లో బీజేపీ నీడ..

బీజేపీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఇక చిన్నపాటి పౌర రాజకీయాలు కావు. ముంబై కేంద్రంగా నిర్వహించే ఒక పెద్ద రాజకీయ రిహార్సల్‌లా మారాయి. స్థానిక స్థాయి పార్టీ కార్యకర్తలకు గతంలో ఉన్న స్వేచ్ఛ, ప్రోత్సాహం పూర్తిగా తగ్గిపోయింది. ఫడ్నవీస్, ఆయన బృందం ప్రతి మున్సిపల్ సంస్థ పనితీరును నేరుగా పర్యవేక్షిస్తున్నారు. కారణం ఈ సంస్థలే కాంట్రాక్టులు, భూ వినియోగ మార్పులు, నిర్మాణ అనుమతులు, ఎన్ఓసీలు నియంత్రిస్తాయి. ఇవే ఓటర్‌కు, రాష్ట్రానికి మధ్య కీలకమైన ఇంటర్‌ఫేస్. ఈ విజయాల ద్వారా బీజేపీ–ఫడ్నవీస్ ఒక సమాంతర రాజకీయ–ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నారు.


ఒక సంస్థగా ఎన్నికలు..

ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య పోటీ కాదు. సంస్థాగత సామర్థ్యాల మధ్య పోటీ. ఒక పార్టీ శాశ్వత సంస్థగా పనిచేస్తే, మిగిలినవి తాత్కాలిక కూటముల్లా కనిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన ఎన్నికల పోటీ ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇది స్పష్టంగా ఫడ్నవీస్ ప్రాజెక్ట్. మహారాష్ట్రలో ఆయనే అసలు బాస్ అన్న సంకేతాన్ని మోదీ–షాలకు కూడా ఇచ్చే స్థాయికి ఆయన ఎదిగారు. మోదీ షాలకు ఒకే ఒక ఖజానా ఉంటే.. ఫడ్నవీస్ మాత్రం గత దశాబ్దకాలంగా ముంబైలో, రాష్ట్రవ్యాప్తంగా, తన స్వంత యుద్ధనిధిని నిశ్శబ్దంగా నిర్మించుకున్నాడు.


ప్రతిపక్షాల స్థితి..

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కొద్ది కార్పొరేషన్లు గెలుచుకున్నా.. ముంబై వంటి కీలక ప్రాంతాల్లో ఘోరంగా విఫలమైంది. గత దశాబ్దంలో బీజేపీ, శివసేన కారణంగా తన ప్రధాన నాయకత్వాన్ని కోల్పోవడమే దీనికి కారణం.

అయినప్పటికీ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఒక బలమైన మహా వికాస్ అఘాడి ఫ్రేమ్‌వర్క్‌ను తిరిగి నిర్మించగలిగితే పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది.

థాక్రేలు కొంతమేర నిలబడినా, ఎన్సీపీకి మాత్రం భారీ ఎదురుదెబ్బ తగిలింది. శరద్ పవార్ లేకుండా ఆ పార్టీకి దిశ లేదన్న విషయం స్పష్టమైంది. AIMIM అనూహ్యంగా దాదాపు వంద సీట్లు గెలుచుకోవడం.. ముస్లిం–దళిత ఓట్ల చీలికను బట్టబయలు చేసింది.


ఇక ముందేంటి?

మున్సిపల్ తీర్పు ఒక కీలక ప్రశ్నను లేవనెత్తుతోంది. స్పష్టమైన వ్యూహం, ప్రత్యామ్నాయ రాజకీయ దృక్పథం లేకుండా ప్రతిపక్ష MVA కూటమి నిలదొక్కుకోగలదా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.

Read More
Next Story