
గ్రీన్ అమోనియా ఉత్పత్తి ఎలా జరుగుతుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యావరణహిత ఇంధన రంగంలో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది.
కాకినాడలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కె పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎమ్ గ్రీన్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టింది. దేశంలోనే మొట్టమొదటి మెగా గ్రీన్ అమోనియా ప్లాంట్‌గా ఇది రూపుదిద్దుకోనుంది.
గ్రీన్ అమోనియా ప్రాజెక్టు అంటే ఏమిటి?
గ్రీన్ అమోనియా అనేది పునరుత్పాదక ఇంధన వనరులు (సౌర, పవన శక్తి) ద్వారా ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్‌ను ఉపయోగించి తయారు చేసే పర్యావరణహిత అమోనియా. సాంప్రదాయ గ్రే లేదా బ్లూ అమోనియా ఉత్పత్తిలో బొగ్గు, చమురు, సహజ వాయువులు ఉపయోగించి కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా విడుదలవుతాయి. కానీ గ్రీన్ అమోనియాలో కార్బన్ ఉద్గారాలు పూర్తిగా శూన్యం. ఇది ఎరువులు, షిప్పింగ్ ఇంధనం, ఇంధన నిల్వ, రసాయన పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా డీకార్బనైజేషన్, నెట్-జీరో లక్ష్యాలకు ఇది కీలకమైన ఇంధనంగా మారుతోంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎమ్‌ఎమ్‌టీఏ) గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా కాంప్లెక్స్‌గా నిలవనుంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌సీఎల్) పాత గ్రే అమోనియా ప్లాంట్‌ను బ్రౌన్‌ఫీల్డ్ పద్ధతిలో గ్రీన్ ప్లాంట్‌గా మారుస్తున్నారు. కాకినాడ పోర్టు సమీపంలో ఉండటం వల్ల ఎగుమతులకు అనువుగా ఉంటుంది. జర్మనీకి చెందిన యూనిపర్ ఎస్‌ఈతో సంస్థ ఒప్పందం చేసుకుని, 2028 నుంచి ఏటా 1.25 లక్షల టన్నులు ఎగుమతి చేయనుంది.
ప్రాజెక్టుకు రూ. 13వేల కోట్ల పెట్టుబడి
ప్రాజెక్టు ఏర్పాటు కోసం 495 ఎకరాల భూమిని కేటాయించారు. సంస్థ మొత్తం రూ. 13 వేల కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా సుమారు 2,600 మంది యువతకు ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నిర్మాణ దశలో 8 వేల వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రూ. 2 వేల కోట్లతో 2 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్‌ను కూడా కాకినాడలో ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు దశలవారీగా ప్రాజెక్టు అమలు
2027 చివరి నాటికి 0.5 ఎమ్‌టీపీఏ, 2028 నాటికి 1 ఎమ్‌టీపీఏ, 2030 నాటికి 1.5 ఎమ్‌టీపీఏ ఉత్పత్తి సామర్థ్యం చేరుకోనుంది. మలేషియా పెట్రోనాస్, సింగపూర్ జీఐసీ, యూఏఈ ఏడీఐఏ వంటి అంతర్జాతీయ భాగస్వాములు ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ ఎగుమతి హబ్‌గా మారుస్తుంది. ఈ ప్రాజెక్టు దేశ ఆర్థిక వృద్ధి, పర్యావరణ సంరక్షణకు దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

