
పరకామణి చోరీ కేసులో పోలీసు అధికారులకు ఉచ్చు బిగిసినట్టేనా?
టీటీడీ చేపట్టిన మార్పులు ఏమిటీ, వాళ్లపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన హైకోర్టు
పరకామణి కేసులో ఏపీ హైకోర్టు ఇవాళ (జనవరి 6) సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఇదే సందర్భంలో కీలక వ్యాఖ్యలూ చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసు విచారణకు వచ్చిన సందర్భంలో హైకోర్టులో విచారణకు రాగా.. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సీఐడీ, ఏసీబీని న్యాయస్థానం ఆదేశించింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలివ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.
తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు విషయంలో సీఐడీ సమర్పించిన నివేదికపై హైకోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది. లెక్కింపునకు లుంగీలతో వచ్చే బదులుగా.. ప్రత్యామ్నాయ విధానాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది. కానుకల లెక్కింపునకు టేబుళ్ల ఏర్పాటుపై వివరాలు లేవని అడిగింది. ఈవో తో చర్చించి వివరాలు కోర్టు ముందు ఉంచుతామని టీటీడీ తరఫు న్యాయవాది తెలిపారు.
నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ నివేదికలో స్పష్టంగా ఉందని.. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చోరీ కేసు మినహా సీఐడీ, ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చని తేల్చిచెప్పింది.
ఈ కేసులో అప్పటి సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌తో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించిన ఎస్‌ఐ లక్ష్మీ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ముగ్గురు పోలీసు అధికారులను పోలీస్ శాఖ వీఆర్‌కు పంపించింది. అయితే ఈ కేసుతో ప్రమేయం ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో ఈ ముగ్గురిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించి కొన్ని పత్రాలను తారుమారు చేశారనే అభియోగాలను వన్‌టౌన్ సీఐ విజయ్‌కుమార్ ఎదుర్కొంటున్నారు.
తదుపరి విచారణను హైకోర్టు జనవరి 8కి వాయిదా వేసింది.
Next Story

