
జగన్ రాజధాని ‘మావిగన్’ ప్రతిపాదన రాజకీయ అర్థం ఏమిటి?
ఏపీ రాజధాని ‘పోర్ట్ సిటీ’ (Port City) అయితే, భవిష్యత్తులో ఇక్కడ పెరిగే రక్షణ మంత్రిత్వ శాఖ సంస్థలు వాటి కార్యకలాపాలు పెరుగుతాయి.
కొంచెం ఆలస్యమైనా చివరికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇటు తన పార్టీకి సుదీర్ఘ భవిష్యత్తు కోసం, సెంట్రల్ ఏపీలో- ‘మావిగన్’ మన రాజధాని అంటూ, సరికొత్త రాజకీయ క్షేత్రాన్ని- ‘మ్యాపింగ్’ చేశారు. అందుకు ‘టైమింగ్’ కూడా అది రాష్ట్ర చరిత్ర మూలాల్లోకి గాఢంగా చేరేట్టుగా కుదిరింది.
అయితే ఇది ఇప్పుడే ఎందుకు, అనేదానికి కొన్ని కారణాలు కన్పిస్తున్నాయి. అవి- జగన్ కొత్త పార్టీకి మొదటిసారి ప్రభుత్వ పాలన కావడం. విభజన తర్వాత, ఏ 'పిచ్' లో తన రాజకీయ క్రీడ ఉంటుంది అనేది ఈ పదేళ్లలో స్పష్టం కావడం, తన కొత్త పార్టీ 'పాలిటి'ని జాతీయ స్థాయిలో ఐదేళ్లలోనే ఒక 'బ్రాండ్' గా మార్చగలగడం. ఈ కారణాల వల్ల తన పార్టీ వైఖరిలో వచ్చిన మార్పు కాకుండా, ఈ కాలంలోనే దేశం లోపల, బయట కూడా జరిగిన మార్పులు అదనం. ఇక రాబోయే మూడేళ్లలో కేంద్రం రాష్ట్రాలలో చేయాల్సిన ‘కులగణన’ అయిపోతే, ఆ ‘డేటా’ను బట్టి వెంటనే నియోజకవర్గాల పునర్విభజనతో పెరిగే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య తేలుతుంది. అప్పుడు, ఇలా ఏర్పడే అదనపు నియోజకవర్గాలతో 2029 జనరల్ ఎన్నికలు వస్తాయి.
ముందుగా జగన్ ఈ ప్రకటన చేయడానికి ఎంచుకున్న పై నేపధ్యం చూసినప్పుడు, మన సమీప గతంలో జరిగిన రాష్ట్ర పరిణామాలు కొన్ని గుర్తు చేసుకోవలసి ఉంటుంది. రాష్ట్ర విభజన తప్పదు అనే దశలో దాన్ని వద్దు అనడానికి తగిన హేతువు ఇక్కడి నాయకులు మేధావులు నిర్ధారించ లేకపోయారు. విభజన తర్వాత, పదేళ్ళ ఉమ్మడి రాజధాని ‘ప్రొవిజన్’ మనం వొదులుకోవడం ఎందుకు అని ఆడగలేకపోయారు. విభజనకు ముందు తర్వాత భారత ప్రభుత్వం నియమించిన రెండు- శ్రీ కృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమీషన్ నివేదికల పట్ల కనీస స్పందనతో ఇక్కడి పౌర సమాజమైనా అఖిలపక్షమైనా చర్చించ లేదు, కీలకమైన ఈ అంశాల విషయంలో తమ వైఖరి కూడా వారు వ్యక్తం చేయలేదు. చరిత్రలో అది ‘రికార్డు’ అయ్యేట్టుగా ఒక ‘డాక్యుమెంట్’ను చెలామణిలో ఉంచలేకపోయారు.
విభజన జరిగిన ఏడాదికే ఇక్కడ నుంచి రాష్ట్ర పరిపాలన మొదలయితే, ఎందుకు? అని అడగలేదు సరికదా; చిన్నది కొత్తది అయిన ఏపీలో మన పరిపాలనా ప్రాధాన్యతలను స్పష్టం చేస్తూ సరైన రీతిలో ప్రభుత్వంపై ఎవరూ ఒత్తిడి పెంచలేకపోయారు. చివరికి ‘అమరావతి’ రాజధాని అంటూ రాష్ట్రానికి అదొక తలకు మించిన ఆర్ధిక భారం అవుతున్నప్పుడు కూడా మౌనంగానే ఉన్నారు. మధ్యలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు మాత్రమే; విభజన తర్వాత ఏపీలో జరిగిన పరిపాలనా సంస్కరణలు. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం మనం గుర్తించాలి. ఎప్పుడు కూడా ‘డైనమిక్’ అంటే, అక్కడ మార్పుకు సదా అవకాశం ఉంటుంది. అదే ‘స్టాటిక్’ అయితే, ఇక దాన్ని కదల్చడానికి ఉండదు.
ఉదా: కుప్పం పంచాయతీ స్థాయిని పెంచుతూ 2021లో గత ప్రభుత్వం దాన్ని రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ కూడా చేసింది. అందువల్లనే 2026లో ఈ ప్రభుత్వం దాని వార్డుల సంఖ్యను పెంచింది. పరిపాలనలో ‘డైనమిక్’ అనేది ఇలా ఉంటుంది. అదే కుప్పంలో భారీ మున్సిపాల్టీ ఆఫీస్ కడితే, అది ‘స్టాటిక్’ అవుతుంది, అది ఈ రెండింటికీ ఉండే తేడా. ఎప్పుడు కూడా పరిపాలన వేరు, అందుకోసం భవనాలు కట్టడం వేరు. ‘పరిపాలన’తో ఉన్నచోటు నుంచి కదలకుండా రాష్ట్రం అంచుల్లోని- ‘మార్జిన్స్’ను మనం తాకవచ్చు. కాగా ఇటువంటి వర్తమాన నేపధ్యంలో మచిలీపట్టణం-విజయవాడ-గుంటూరు (‘మావిగన్’) నగరాల పరిధిలో ‘రాజధాని’ అనేది వైసీపీ చేస్తున్న క్రొత్త ప్రతిపాదన.
చరిత్రలో నదులు, సముద్ర తీరాలలో ' ట్రేడింగ్ ' జరగడం నిజమే, కానీ అది మనం అమరావతి విషయంలో వింటున్న ఆరోపణలోని 'ఇన్సైడ్ ట్రేడింగ్' వంటిది కాదు. హైదరాబాద్-విజయవాడ హైవే పై ఇబ్రహీంపట్నం వద్ద 2015లో ముఖ్యమంత్రి గోదావరి నీరు బిందెతో కృష్ణలో పోస్తూ, దానికి ‘పవిత్ర సంగమం’ అని పేరు పెట్టిన చోటును స్థానికులు ఇప్పటికీ- ‘ఫెర్రీ’ అంటారు అని ఎందరికి తెలుసు? ఒకప్పుడు గోల్కొండ సుల్తానుల ఆర్ధికతకు బందరు పోర్టు కీలకంగా ఉండేది. బందరు ఓడరేవు నుంచి విదేశాలకు ఎగుమతులు కోసం వచ్చే సరుకు ముందుగా ఈ ‘పెర్రీ’ వద్దకు వస్తే, అక్కడ నుంచి దాన్ని ఈ ‘ఫెర్రీ’ నుంచి కృష్ణానదీ మార్గంలో తూర్పుకు వెళ్ళే పడవల ద్వారా అది బందరు పోర్టుకు చేరి; అక్కడ నుంచి ఓడలు ద్వారా ఆగ్నేయ ఆసియా, యూరప్ వంటి విదేశాలకు ఎగుమతి అయ్యేవి.
ఈ 21వ శతాబ్ధిలో మారుతున్న ‘జియో-పాలిటిక్స్’ కారణంగా అప్పటికే మన దేశం ‘ఆసియాన్’ వంటి వాణిజ్య ఒప్పందాలు కూడా ఆగ్నేయ ఆసియా దేశాలతో చేసుకుని ఉండడంతో, ఈ ప్రాంతం భౌగోళికంగా కీలకం అవుతుందని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2014 జూన్ నాటికి బందరు సమీపంలో ‘సెంట్రల్ మెరైన్ పోలీస్ అకాడమీ’ ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం స్థలం కోసం రాష్ట్రాన్ని కోరింది. కృష్ణా కలక్టర్ పెదపట్నం వద్ద స్థలం కూడా ఎంపిక చేశారు. అయితే అప్పటికే అప్పటికే యూపీఏ ప్రభుత్వం స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం, మనం రాష్ట్ర విభజన గందరగోళాల మధ్య ఉండడంతో బిజెపి ప్రభుత్వం దీన్ని వేరే చోటికి తరలించారు. ఇప్పుడైనా ఏపీ రాజధాని ‘పోర్ట్ సిటీ’ కనుక అయితే, భవిష్యత్తులో ఇక్కడ పెరిగే రక్షణ మంత్రిత్వ శాఖ సంస్థలు వాటి కార్యకలాపాలు పెరుగుతాయి. నాగాయలంక వద్ద గుల్లలమోదలో క్షిపణి ప్రయోగ కేంద్రం సిద్దం అవుతున్నది. మచిలీపట్టణంలోని ‘భారత్ ఎలక్ట్రానిక్స్’ ఇప్పటికే నిమ్మకూరు వద్ద రెండవ యూనిట్ ను పెట్టింది. వీటి అన్నిటికంటే ముందు విశాఖలోని ‘ఈస్ట్రన్ నేవల్ కమాండ్’ విభాగం ఒకటి ఏపీ రాజధానిలో ‘కంటోన్మెంట్’ పాత్ర తీసుకుంటుంది.
ఈ మూడు పట్టణాలు జాతీయ ఉద్యమ కాలంలో భారత చరిత్రలోని ప్రతి కీలక ఘట్టంలోనూ క్రియాశీలంగా ఉండడం మనం చూస్తాము. అంతేనా, ఆంధ్రుల ‘పొలిటికల్ పాలసీ’ ఈ ప్రాంతంలో రూపుదిద్దుకుంది. బాపట్ల టౌన్ హల్లో 1913 జూన్ 26న చేసిన తీర్మానంలో మా భాష ప్రాతిపదికన మెడ్రాస్ నుంచి మా ఆంధ్రులను వేరు చేయండి, అనే డిమాండ్ తర్వాత కదా మనకు ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఇన్నాళ్ళకు అరవై ఏళ్ల తర్వాత మళ్ళీ నైజాం మనతో లేని ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పడితే, దాని రాజధాని- ‘క్వాంటమ్ వ్యాలీ’ల మధ్య అంటుంటే, అది ఈ ప్రాంతాల పౌరుల ‘హెరిటేజ్’కు అందనంత ఎత్తులో దుర్భేధ్యమైన “ఫైర్ వాల్” మధ్య కొందరికే పరిమితమై అదొక ‘గేటెడ్ కమ్యూనిటీ’ మాదిరిగా ఉంటుందా అనే సందేహం సహజంగా వస్తుంది. ఎందుకోగాని, ఇటువంటి అనుమానాలను నివృత్తి చేస్తూ దాన్ని ‘అడ్రెస్’ చేసేవారు ప్రభుత్వంలోనూ, ‘కూటమి’లోనూ ఎవరూ కనిపించడం లేదు.
ఒకప్పటి లబ్ధ ప్రతిష్ట కుటుంబాలు మారుతున్న రాజకీయాల్లో ఇమడలేక క్రమంగా ఇక్కడ అవి కనుమరుగు అయ్యాయి. పేర్లు చెప్పడానికి ఆ జాబితా చాలా పెద్దది. వారి వారసులలో కొందరు ప్రముఖులు ఉన్నప్పటికీ, వారు తమ స్వంత ప్రాంతాలు విడిచి హైదరాబాద్ వంటి నగరాలకు ఏనాడో చేరారు. కానీ, చరిత్ర తన ‘జాగ్రఫీ’ని వెతుక్కుంటుంది అంటారు. ఇప్పుడీ ‘మావిగన్’ ప్రతిపాదనతో, ఒకప్పుడు ప్రజాజీవితంలో ఉన్న ప్రముఖ రాజకీయ, సామాజిక, కుటుంబాలు నివసించిన ప్రాంతాలు ఇకముందు రాజధాని పరిధిలోకి వస్తే, ఏపీలో గత చారిత్రిక వైభవం పునఃప్రారంభం అవుతుంది. అదే ‘మావిగన్’ కనుక రాజధాని అయితే, ఒకప్పుడు ఇక్కడి నుంచి జరిగిన ‘బ్రెయిన్ డ్రెయిన్’ తిరిగి ‘రివర్స్ మైగ్రేషన్’ గా మారి అది జన్మభూమికి చేరడం సుళువు అవుతుంది.
కృష్ణా మండలంలో ‘ఎలీట్’ అంటే, అది గోదావరి వ్యాలీ మాదిరిగా బ్రాహ్మణ వైదిక సమాజానికి పరిమితం కాదు. ఇది భూమి ప్రధాన మానవ సంబంధాల నెలవు. ఏడేళ్ళ బాల్య వితంతువుతో వివాహానికి స్వచ్చందంగా ముందుకొచ్చిన యువకుడికి 1925 నాటికే కులాంతర వివాహం చేసిన ప్రాంతమిది. ఆ యువకుడు కొండపల్లి సీతారామయ్య (రెడ్డి) ఆమె కోటేశ్వరమ్మ (కమ్మ). అంతేనా, ఇక్కడ నుంచి ఇద్దరు యువకులు కాలేజి చదువులు తరవాత బెజవాడలో రైలు ఎక్కి ఒకరు విశాఖ వెళ్ళి ‘విరసం’ వ్యవస్థాపకులలో ఒకరైన చలసాని ప్రసాద్ అయ్యారు. తిరుపతి వెళ్ళిన త్రిపురనేని మధుసూధనరావు మార్క్సిస్టు మేధావి అయ్యారు. ఇక గుంటూరు ప్రాభవం అంటే అది డా. యలవర్తి నాయుడమ్మ వంటివారి వైజ్ఞానిక ఆవిష్కరణలతో దేశానికి ఆధునిక ‘లెదర్ టెక్నాలజీ’ని అందించింది. ఒకప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పత్రికల రాజధాని విజయవాడ. అటువంటిది, 2010 నాటికి ఒక్క విశాలాంధ్ర తప్ప ఒక్క దినపత్రిక ప్రధాన కార్యాలయం ఇక్కడ మిగలలేదు. ఈ ప్రాంతాన్ని విడిచి అన్నీ హైదరాబాద్ చేరాయి.
చంద్రబాబు ఇప్పుడు ‘అమరావతి’ పేరుతో రాజధానిని ఒక ప్రాంతానికి పరిమితం చేస్తున్నట్టుగా, కృష్ణా మండలంలో అప్పటి తరాలు తమకు తాము మేకుకొట్టుకుని ఒకచోట ఉండిపోలేదు. మనుష్యులు ‘డైనమిక్’గా వ్యాపించడం అంటే అది. కానీ ఇక్కడ సమస్య ఏమంటే, సెంట్రల్ ఏపీలో తమ స్వయంకృషితో పెనువృక్షాలుగా ఎదిగినవారికి కూడా, 80’ల తర్వాతే టిడిపి కోసం కమ్మ ‘ఎలీట్’ అనే అక్కరలేని- ‘ట్రీ గార్డ్’ను వారికి తగిలించారు. అయితే, ఈ ‘మావిగన్’ ప్రతిపాదన వల్ల మారే ఏపీ రాజధాని పర్యావరణం తిరిగి ఒకప్పటి ప్రగతిశీల ప్రజాస్వామిక వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఒక్కో ప్రాంతానికి ఒక- ‘సైక్’ ఉంటుంది, అని నమ్మేవారు ఎవరైనా దీన్ని అంగీకరిస్తారు. ప్రపంచీకరణ తర్వాత, అన్ని చోట్ల మార్పు వచ్చినట్టే ఇక్కడ కూడా వచ్చినప్పటికీ, రేపు ఈ మూడు పట్టణాలకు ప్రజాస్వామిక రాజధాని ‘క్లస్టర్’గా కొత్త పాత్ర పోషించాల్సిన ఆధిక్యత కనుక ఇస్తే, అందుకు తగిన రీతిగా ఇది అనతి కాలంలోనే రూపాంతరం చెందుతుంది. అదే కనుక జరిగితే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతంలో- ‘తరలి రాదా తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం..’ అన్నట్టుగా ‘మావిగన్’ అవుతుంది అనడంలో సందేహం లేదు.

