ప్రశ్నించమంటారు! ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు? ఇదేం తీరు?
x
ప్రతీకాత్మక చిత్రం (ఏఐ సృష్టి)

ప్రశ్నించమంటారు! ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు? ఇదేం తీరు?

సోషల్ మీడియా అరెస్టులు: ప్రజాస్వామ్యమా? రాజ్యాంగ ఉల్లంఘననా?


ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం పౌరుడి ప్రాథమిక హక్కు. కానీ ప్రస్తుత రోజుల్లో ఆ హక్కుకు సంకెళ్లు పడుతున్నాయా? గతంలో సమాచార హక్కు చట్టం (RTI) వ్యవస్థలను ప్రశ్నించే ఆయుధంగా ఉండేది. కానీ కాలక్రమేణా దానికి ప్రాధాన్యత తగ్గింది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మెయిన్ స్ట్రీమ్ మీడియాపై ఆంక్షలు మొదలైన నేపథ్యంలో, సామాన్యుడి గొంతుకగా మారిన సోషల్ మీడియా పీక నొక్కే ప్రయత్నం జరుగుతోందా? అనే ప్రశ్నలు ఇప్పుడు సమాజంలో ఉద్భవిస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా నలుగురు యూట్యూబర్లను పోలీసులు అరెస్ట్ చేసిన విధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికలో పలువురు ప్రముఖులు తమ విశ్లేషణలను పంచుకున్నారు.
వ్యవస్థీకృత రాజకీయ ప్రతీకారం..
ఈ చర్చలో పాల్గొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్రజ్ఞులు, ప్రముఖ సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ ఇ. వెంకటేష్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కొద్దిమంది ప్రయోజనాల కోసం లేదా ఒక ప్రత్యేక వర్గం పరిధిలోనే ఉండేదన్నారు. కానీ సాంకేతిక విప్లవం వల్ల సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతం అధికారంలో ఎవరు ఉంటే వారు ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి, స్కోర్ సెటిల్ చేసుకోవడానికి దీన్ని వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "ఒక పక్క గొడ్డలి రాజ్యాంగం, ఇంకో పక్క రెడ్ బుక్ రాజ్యాంగం అంటుంటే.. అసలైన భారత రాజ్యాంగం ఏమైంది?" అని ఆయన ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్వతంత్రంగా, సద్విమర్శ చేసే జర్నలిస్టులను లేదా ప్రొఫెసర్లను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని స్పష్టం చేశారు.
యూట్యూబర్లు - జర్నలిజం మధ్య లక్ష్మణ రేఖ
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ జి. ఆంజనేయులు మాట్లాడుతూ.. నేడు స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టులమని చెప్పుకునే పరిస్థితి వచ్చిందన్నారు. నిజానికి సోషల్ మీడియాలో వంటలు, నగల వ్యాపారాలు, సామాజిక సమస్యలపై ఎన్నో విభాగాలు ఉన్నా.. కేవలం రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారుతున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల వల్లే ఈ సమస్య వస్తోందన్నారు. జర్నలిజంలో పనిచేసేటప్పుడు వృత్తిపరమైన నియమావళిని, బాధ్యతను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో ఐటీ యాక్ట్ ప్రకారం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని నేరుగా అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చినా, ఇక్కడ పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ టెర్రరైజ్ చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం తెచ్చిన ఐటీ చట్టాలపై ఎడిటర్స్ గిల్డ్ సైతం గతంలో అభ్యంతరాలు తెలిపిందని గుర్తుచేశారు.
అసలేం జరుగుతోంది గ్రౌండ్ లెవెల్‌లో?
విజయవాడ 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' స్పెషల్ కరస్పొండెంట్ జి.పి. వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయి పరిశీలనలను పంచుకుంటూ.. ఏపీలో గత ప్రభుత్వంలో చిన్నగా ప్రారంభమైన ఈ సోషల్ మీడియా కట్టడి ధోరణి, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పీక్ లెవెల్‌కు వెళ్లిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబంపై వచ్చిన అనుచిత పోస్టులపై స్పందించిన తర్వాత, సీఎం చంద్రబాబు నాయుడు, హోం శాఖ అలర్ట్ అయి కేసులు పెట్టడం వేగవంతం చేశారన్నారు. గత రెండేళ్లలో సుమారు 13,000 కేసులు నమోదు కాగా, 400 నుండి 500 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. 'రావణ్' అనే యూట్యూబర్‌ను ఒక కేసులో జడ్జి గారు రాత్రిపూట బెయిల్ ఇచ్చి పంపించినా, పోలీసులు వెంటనే మరో స్టేషన్‌లో కేసు పెట్టి వరుసగా వేధిస్తున్నారని, ఇది చట్ట నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాన మీడియా సంస్థలు 95% ఏదో ఒక రాజకీయ పార్టీకి కరపత్రాలుగా మారిపోయిన తరుణంలో, నిష్పక్షపాతంగా ప్రశ్నించడానికి సోషల్ మీడియా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వీకరించే సహనం పాలకులకు ఉండాలి. అదే సమయంలో చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేసే బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంటుంది. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, వల్గర్ లాంగ్వేజ్ వాడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు కానీ, ప్రతి విమర్శను నేరంగా చూస్తూ గొంతెత్తిన వారిపై వరుస కేసులు పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాయడమే. చట్టం అనేది సమాజ రక్షణ కోసం ఉండాలి కానీ పాలకుల రక్షణ కవచంగా మారకూడదు.
Read More
Next Story