అన్‌బ్రాండెడ్ ముడి పొగాకుపై ఎక్సైజ్ సుంకం సున్నా
x

అన్‌బ్రాండెడ్ ముడి పొగాకుపై ఎక్సైజ్ సుంకం సున్నా

ఏపీ పొగాకు రైతులకు ఊరట కలిగించిన కేంద్ర నిర్ణయం. స్వాగతం చేసిన సీఎం చంద్రబాబు.


కేంద్ర ప్రభుత్వం అన్‌బ్రాండెడ్ ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గించింది. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని పొగాకు రైతులు, వ్యాపారులకు గణనీయమైన ప్రయోజనాలు చేకూర్చనుంది. గతంలో అస్పష్టమైన నిబంధనల వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించి, పన్ను వ్యవస్థలో స్పష్టత, పారదర్శకత తీసుకురానున్న ఈ మార్పు రైతులకు మంచి ధరలు దక్కేలా చేస్తుంది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 1, 2026న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ మార్పులు అమలులోకి వచ్చాయి. హెచ్‌ఎస్ కోడ్ 2401 కింద వచ్చే అన్‌బ్రాండెడ్, రీటైల్ విక్రయాలకు ప్యాక్ చేయని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం సున్నా శాతంగా నిర్ణయించబడింది. రైతులు సంచులలో బల్క్‌గా విక్రయించే పొగాకు ఈ పరిధిలోకి వస్తుంది. అయితే బ్రాండెడ్ ప్యాకెట్లు, చిన్న ప్యాకెట్లలో రీటైల్ విక్రయాలకు ప్యాక్ చేసిన ఉత్పత్తులపై 18 శాతం ఎక్సైజ్ సుంకం కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా పన్ను ఎగవేతను అరికట్టి, వాణిజ్యాన్ని సుగమం చేయాలనేది కేంద్రం లక్ష్యం.


గతంలో అన్‌బ్రాండెడ్ బల్క్ పొగాకు క్రయవిక్రయాలలో స్పష్టమైన వర్గీకరణ లేకపోవడంతో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తేవి. రైతులు, వ్యాపారులు నష్టపోయేవారు. ఈ అస్పష్టతలను తొలగించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఇది పొగాకు రైతులకు మేలు చేసే కీలకమైన ముందడుగు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు మంచి ధరలు దక్కడంతోపాటు, ఎగుమతులు పెరిగి వ్యాపారులకు కూడా లాభదాయకమవుతుందని ఆయన వివరించారు. స్పష్టమైన మార్గదర్శకాలతో ఎక్సైజ్ డ్యూటీ ఎగవేత గణనీయంగా తగ్గుతుంది. తప్పుడు మార్గాల్లో పన్ను ప్రయోజనాలు పొందకుండా అడ్డుకునేలా ఈ విధానం రూపొందింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గెజిట్‌ను పరిగణనలోకి తీసుకుని, దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ మార్పులతో ముడి పొగాకు సరఫరా వ్యవస్థకు ఉపశమనం లభిస్తుందని, ప్రభుత్వ ఆదాయానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. పన్ను విధానంలో తలెత్తే వివాదాలు తగ్గి, ఆడిటింగ్, బిల్లింగ్ ప్రక్రియలు సుగమమవుతాయని అధికారులు తెలిపారు.

చిరువ్యాపారులు, రైతులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. గతంలో అధికారులు రైతులను కూడా ప్రశ్నించే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం బల్క్ పొగాకుపై ఎలాంటి పన్ను లేకపోవడంతో వారికి మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంది. అలాగే, బ్రాండెడ్ ఉత్పత్తులలో ముడి పొగాకు పేరుతో జరిగే దుర్వినియోగానికి కొత్త మార్గదర్శకాలు అడ్డుకట్ట వేస్తాయి.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ వివరాలు

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ఫిబ్రవరి 1, 2026న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. 04/2026 సెంట్రల్ ఎక్సైజ్ ప్రకారం డిసెంబర్ 31, 2025న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. 03/2025 సెంట్రల్ ఎక్సైజ్‌ను సవరించారు. సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ 1944 సెక్షన్ 5ఏ(1) కింద ఈ సవరణలు జరిగాయి.

నోటిఫికేషన్‌లోని కీలక ఎంట్రీలు

హెచ్‌ఎస్ కోడ్ 2401: అన్‌మాన్యుఫాక్చర్డ్ టొబాకో లేదా టొబాకో రెఫ్యూజ్, బ్రాండ్ పేరు లేకుండా, రీటైల్ విక్రయాలకు ప్యాక్ చేయకుండా ఉంటే సుంకం సున్నా (Nil).

అల్ అదర్ అన్‌మాన్యుఫాక్చర్డ్ టొబాకో లేదా టొబాకో రెఫ్యూజ్ (మిగిలినవి) సుంకం 18 శాతం.

ఈ సవరణలు ఫిబ్రవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నిర్ణయం ముడి పొగాకు వాణిజ్యాన్ని రీటైల్ మార్కెట్ నుంచి వేరు చేసి, పన్ను స్పష్టతను తీసుకువచ్చింది.

Read More
Next Story