
అమరావతిలో వ్యవసాయ కూలీల గురించి ఎందుకు ఆలోచించలేదు?
అమరావతిలో వ్యవసాయ కూలీల జీవనోపాదులపై అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి.
ఏపీ రాజధాని అమరావతిలో సుమారు 41 వేల కుటుంబాల్లో లక్ష మంది వ్యవసాయ కూలీలు జీవిస్తున్నారు. వీరికి ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో వ్యవసాయ పనులు లేకపోవడంతో జీవనోపాధి జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే వ్యవసాయ కూలీల్లో సుమారు 80,000 మందికి పైన విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. అక్కడ ఏదో ఒక కూలి పని చేసుకుని జీవిస్తున్నారు.
మొదటి విడతలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కలిపి సుమారు 55 వేల ఎకరాల వరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రెండవ విడతలో మరో 20 వేల ఎకరాల వరకు భూమిని స్వాధీనం చేసుకుంటోంది. పదేళ్లుగా వ్యవసాయ కూలీలకు అమరావతి ప్రాంతంలో పనులు లేవు. గతంలో కూరగాయలు, పూల తోటలు, పండ్ల తోటలు ఉండటం వల్ల నిత్యం వ్యవసాయ కూలీలకు ఏదో ఒక పని ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వారి చేజారి పోయింది. అందువల్ల వేరే పనుల వైపు వెళుతున్నారు. ప్రధానంగా నగరాల్లో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నట్లు స్థానికులు చెప్పారు. కూలీల స్థితిగతులపై కొన్ని సంస్థలు అధ్యయనాలు కూడా చేశాయి.
అమరావతి ప్రాంతం గుంటూరు జిల్లాలోని 29 గ్రామాలు, సుమారు 217 చదరపు కిలోమీటర్లు ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. ఇక్కడ వ్యవసాయ కూలీలు (ల్యాండ్‌లెస్ అగ్రికల్చరల్ లేబరర్స్) వారి జీవనోపాదులపై అమరావతి ప్రాజెక్టు ప్రభావం గురించి అధికారిక నివేదికలు, అధ్యయనాలు ఉన్నాయి. ఇది రాజధాని అభివృద్ధి కారణంగా భూమి మార్పు, ఉపాధి కోల్పోవడం వంటి సమస్యలతో ముడిపడి ఉంది.
అధికారికంగా వ్యవసాయ కూలీల సంఖ్య
అమరావతి ప్రాంతంలో 2011 సెన్సస్, ప్రాజెక్టు డేటా ఆధారంగా మొత్తం జనాభా సుమారు లక్షన్నర పైన ఉంటుంది. ఇందులో వ్యవసాయ కూలీలు (ల్యాండ్‌లెస్ లేబరర్స్) సంఖ్యను సీఆర్డీఏ వారు ఇలా అంచనా వేశారు.
21,000 ఫ్యామిలీస్ వరకు ప్రత్యక్షంగా వ్యవసాయ భూములపై ఆధారపడ్డాయి. కుటుంబంలో నలుగురు వంతున సగటున వ్యవసాయ కూలీలు ఉన్నారు. కానీ రాజధాని ప్రాజెక్టు కారణంగా వారంతా ఉపాధి కోల్పోయారు.
అమరావతిలో 41,000 ఫ్యామిలీస్ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నట్లు అమరావతి ప్రాజెక్టు రిపోర్టులో ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 12,000 మంది మాత్రమే భూయజమానులు. మిగిలినవారు కూలీలు, టెనెంట్ ఫార్మర్స్.
ఈ సంఖ్యలు 2015-2018 మధ్య ప్రాజెక్టు నివేదికల్లో ఉన్నాయి. అమరావతి అభివృద్ధి తర్వాత (2024-2025) కొందరు కూలీలు నిర్మాణం, సర్వీసెస్ వైపు మారారు. ప్రస్తుతం అమరావతిలో పనులు ఉన్నందున నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ల వద్ద కొందరు పనిచేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో పనిచేసే వారికి నిర్మాణ రంగంపై అవగాహన లేదు. దీంతో మట్టి పనుల్లోకి మాత్రమే కొందరిని కాంట్రాక్టర్లు తీసుకున్నారు.
పదేళ్ల క్రితం అమరావతి ప్రాంతంలో మల్లె తోటల్లో వ్యవసాయ కూలీలు
జీవనోపాదులపై అధ్యయనాలు
అమరావతి ప్రాజెక్టు కారణంగా వ్యవసాయ భూములు సుమారు 55 వేల ఎకరాలు మార్పు వల్ల కూలీల జీవనోపాదులు ప్రభావితమయ్యాయి. ఇది ఆర్థిక నష్టం, ఉపాధి మార్పు, సామాజిక అసమానతలు వంటి సమస్యలు సృష్టించింది. కొన్ని ముఖ్యమైన అధ్యయనాలు.
1.World Bank: అమరావతి సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (ASCCDP) పై రీసెటిల్‌మెంట్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ 2017 ద్వారా ప్రాజెక్టు అప్రైజల్ డాక్యుమెంట్ 2024 ప్రకారం వివరాలు.
21,374 ల్యాండ్‌లెస్ ఫ్యామిలీస్ ఉపాధి కోల్పోయాయి. పెన్షన్ నెలకు (రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు), స్కిల్ ట్రైనింగ్, ఉపాధి హామీ పథకం 365 రోజులు, ఇంట్రెస్ట్-ఫ్రీ లోన్స్ వంటి లైవ్లీహుడ్ రెస్టోరేషన్ మెజర్స్ సూచించారు. కానీ కొందరు బెనిఫిట్స్ యాక్సెస్ చేయలేకపోయారు. ఫలితంగా ఆర్థిక స్థితి దిగజారింది. ప్రాజెక్టు కారణంగా 15,000-20,000 కూలీలు నిర్మాణ పనుల్లో ఉపాధి పొందవచ్చు. కానీ OHS రిస్కులు, లేబర్ ఇన్‌ఫ్లక్స్ వల్ల సమస్యలు ఉన్నాయి.
2.Centre for Financial Accountability (CFA): "Case Study - Amaravati Sustainable Capital City Development" (2017), "Encroachment of Nature, People and Livelihoods" (2019) వివరాలు.
41,000 ఫ్యామిలీస్ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. ఇందులో 29,000 ల్యాండ్‌లెస్. 18,000 ఫ్యామిలీస్ లైవ్లీహుడ్ సపోర్ట్ లేకుండా మిగిలాయి. ప్రాజెక్టు కారణంగా ఆహార భద్రత తగ్గింది. ల్యాండ్ స్పెక్యులేషన్ పెరిగింది. కూలీలు ఆటో డ్రైవర్లు, నిర్మాణ కార్మికులుగా మారారు.
ఇతర అధ్యయనాలు
"Making of Amaravati - A Landscape of Speculation and Intimidation" (Academia.edu, 2016): ఫెర్టైల్ ల్యాండ్ లాస్ వల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి. కూలీలు ఇతర ఉపాధులు వెతకాల్సి వచ్చింది.
"Building Amaravati: Between Western Urban Dreams and Indian Realities" (థీసిస్, 2020): 33,000 ఎకరాలు మార్పు వల్ల కూలీలు షాప్‌కీపర్లు, హౌస్ మెయిడ్స్‌గా మారారు. స్కిల్ ట్రైనింగ్ అవసరం.
ఈ అధ్యయనాలు ప్రభుత్వ హామీలు (పెన్షన్, ట్రైనింగ్) అమలు లోపాలు, పారదర్శకత లేమి వంటి సమస్యలను హైలైట్ చేశాయి.
అమరావతి వ్యవసాయ కూలీలు, రైతుల అభిప్రాయాలు
అమరావతి రాజధాని అభివృద్ధి ప్రక్రియలో వ్యవసాయ కూలీలు (ల్యాండ్‌లెస్ లేబరర్స్, స్మాల్ స్కేల్ రైతులు) ప్రభావితమవుతున్నారు. భూమి మార్పు వల్ల ఉపాధి కోల్పోవడం, పరిహారాల ఆలస్యం, అభివృద్ధి లోపాలు వంటి సమస్యలపై వారి అభిప్రాయాలు మీడియా నివేదికలు, సోషల్ మీడియా పోస్టులలో కనిపిస్తున్నాయి.
M. శేషగిరి రావు, క్యాపిటల్ రీజియన్ ఫార్మర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, చిన్న రైతు, కూలీల ప్రతినిధి.
"సీఆర్డీఏ వారు రైతులను అభివృద్ధిలో భాగస్వాములు చేశారు. కానీ మేము ఎలాంటి భాగస్వాములం? ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తున్నారు. ఇప్పటికే డజను కేసులు ఉన్నాయి." భూమి పూలింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న రైతులు, కూలీల భవిష్యత్తుకు ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయా అని సందేహం వ్యక్తం చేశారు. ఉపాధి, భూమి విలువలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఆకుల జయ సత్య, అమరావతి మహిళా JAC నాయకురాలు, వ్యవసాయ కూలీల ప్రతినిధి.
మహిళలు, కూలీలు డెరోగేటరీ రిమార్క్స్ (మహిళలను అవమానించడం) పై పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. "మహిళలు, చిన్న రైతులతో మాట్లాడే విధానం అసలు బాలేదు. CRDA అధికారులు మమ్మల్ని అవమానిస్తున్నారు." భూమి మార్పు వల్ల ఉపాధి కోల్పోవడం, పరిహారాల ఆలస్యం పై మండి పడ్డారు. ఆమె దళిత, మహిళా కూలీల సమస్యలు హైలైట్ చేశారు.
వేమూరి బాబు, అమరావతి దళిత JAC నాయకుడు, వ్యవసాయ కూలీల ప్రతినిధి.
దళిత కూలీలు, రైతుల భూమి పూలింగ్ పై అసమానతలు వ్యక్తం చేశారు. "అమరావతిలో దళితులు 32 శాతం మంది ఉన్నారు. ప్రచారం కమ్మ క్యాపిటల్ అని జరుగుతోంది. మా ఉపాధి కోల్పోతున్నాం. పరిహారాలు సరిగా రావట్లేదు." ఆర్థిక నష్టం, సామాజిక అసమానతలు పై ఆందోళన వ్యక్తం చేశారు.
పువ్వాడ సుధాకర్, అనిల్, కిరణ్, ఐకాస నేతలు, చిన్న రైతులు, కూలీల ప్రతినిధులు.
"సమాచార లోపంతో సమస్యలు ఏర్పడ్డాయి. వైఎస్సార్సీపీ నాయకులు సున్నితమైన అంశాలను భూతద్దంలో చూపిస్తున్నారు. గ్రామ కంఠం సమస్య, గజిట్ నోటిఫికేషన్ ఆలస్యం పై మండిపడ్డారు." భూమి ఇచ్చిన చిన్న కూలీలు, రైతులు అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
"అమరావతిలో 10 ఎకరాలు ఉన్నవాడే బాగుపడతాడు. 2 ఎకరాలు ఉన్నవాడు ఇక్కడ దేనికి పనికిరారు. మరో 2 సంవత్సరాలు ఆగండి, ఎంత మంది రైతుల కష్టాలు బయటకు వస్తాయో తెలుస్తాయి." చిన్న కూలీలు, రైతులు భూమి మార్పు వల్ల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జొన్నలగడ్డ కిరణ్, ఫార్మర్స్ లీడర్, వ్యవసాయ కూలీల ప్రతినిధి.
అమరావతి పై తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలని, రైతులు, కూలీలు అభివృద్ధి కోసం త్యాగాలు చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. "తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలి, అమరావతి అభివృద్ధి అడ్డుకోవద్దు." కూలీల ఉపాధి, భూమి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జంగా శివశంకర రెడ్డి, వ్యవసాయ కూలీ
"చిన్న రైతులు (2-3 ఎకరాలు) చాలా కష్టాలు పడుతున్నారు. రెండేళ్ల తర్వాత చూడండి, ఎంత మంది రైతులు బాధలు బయటకు వస్తాయో. భూమి పూలింగ్ వల్ల ప్రజలు జీవితాలు కోల్పోతున్నారు. పేదవారు బతకలేకపోతున్నారు." కూలీలుగా మాకు ఇక్కడ పనులు లేవు. హైదరాబాద్ వెళ్లి తన బంధువుల సాయంతో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని కూలి పనులు చేసుకునేందుకు నిర్ణయించుకున్నాను.
వై. శేషమ్మ, బేతపూడి.
నా వయసు 50ఏళ్లు. భర్త చనిపోయాడు. "నేను ఇది 30 సంవత్సరాలుగా మల్లెపూలు కోసే పని చేసే దానిని. నేను బేతపూడిలో పని చేస్తాను. కానీ ఆ భూమి ఇప్పుడు పోయింది. అప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలో తెలియదు." ఏదో ఒక పని చేసుకోవడం తప్పదు కదా అంటూ నిట్టూర్చింది.
నిడమర్రు మల్లెతోటల్లో సుమారు 20 నుంచి 25 మంది మహిళలు నిత్యం కూలి పనులు చేసుకునే వారు. అది వారి ప్రధాన జీవనోపాధి. సంవత్సరానికి 365 రోజులు ఉపాధిని అందిస్తుందని చెప్పారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పొలాల్లో వేర్వేరు రకాల మల్లెపూలు వరుసగా పూస్తాయి. ప్రతి కిలో పూలకు రూ.40 నుంచి రూ.50 వస్తాయి. దీనితో వారు రోజుకు రూ.300 నుంచి రూ.400 సంపాదించు కుంటారు. ఈ పూలు రైతులు సమీపంలోని గోడౌన్‌కు తీసుకువెళ్లి, తూకం వేసి 30 కిలోలు, 50 కిలోల బ్యాగుల్లో ప్యాక్ చేసి, విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తారు.
19 ఏళ్ల పి కల్యాణి, 12వ తరగతి తర్వాత చదువు మానేసి చాలా కాలం మల్లెపూలు కోసే పని చేసింది. ఆమె, తన చెల్లెలు భూమి లేని ఒంటరి తల్లికి పిల్లలు కావడంతో వ్యవసాయ కూలీలుగా మారారు. గ్రామానికి సమీపంలో వచ్చే భారీ సంస్థ ఆమె చదువు కొనసాగించడానికి సహాయపడుతుందా అని అడిగితే "ఇవి పెద్ద కాలేజీలు, చాలా డబ్బు అవసరం," అని చెబుతూ విజయవాడ లేదా గుంటూరు శివార్లకు వలస వెళతామని చెప్పింది.
బాపూజీనగర్ కు చెందిన కల్యాణి రత్నమ్మ, బేతపూడి జయమ్మ మాట్లాడుతూ "మాకు తెలిసింది పూలు కోసే పని మాత్రమే. మమ్మల్ని మేము పోషించుకోవడానికి ఇది చేయాలి" అని చెప్పారు. అయితే పదేళ్లుగా ఆ పనిలేదు. స్థానికంగా ఏదో ఒక పని ప్రస్తుతం చేస్తున్నాము. "రైతులకు ఏదో ఒకటి వస్తుంది. మేము మాత్రమే జీవనం కోసం ఏమీ లేకుండా మిగిలిపోయాము." అని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతిలోని వ్యవసాయ కూలీలంతా ఎక్కువ మంది ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారు. చాలా మంది రైతుల భూములను కౌలుకు తీసుకుని పొలం పనితో పాటు తమ బంధువులు, ఇతరులను కూలీలుగా తీసుకుని పనులు చేసుకుని జీవించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు చేజారి పోయాయి. సుమారు లక్ష ఎకరాల్లో పండే పంటలు ఆగిపోయాయి.

