కాకినాడ సహకార బ్యాంకును కొల్లగొట్టిన దొంగలెవరు?
x
AI image

కాకినాడ సహకార బ్యాంకును కొల్లగొట్టిన 'దొంగలెవరు'?

రూ.788 కోట్ల రైతుల సొమ్మును మేసేసినా దిక్కూ దివాణం లేదా? ఆడిట్ రిపోర్టు నిగ్గుతేల్చిన నిజాలెన్నో


(కృష్ణా కానూరి, విజయవాడ)
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) చరిత్రలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ అవినీతి కుంభకోణానికి కేంద్రంగా నిలిచింది. రూ.788 కోట్ల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఎ), అందులో 23 భారీ కుంభకోణాల ద్వారా స్వాహా అయిన రూ.188 కోట్లు, వసూలు కాని మరో రూ.600 కోట్ల బోగస్ రుణాలు - ఇవీ కాకినాడ డిసిసిబి ప్రస్తుత దుస్థితికి అద్దంపట్టే గణాంకాలు. రూ.4,250 కోట్ల అప్పుల కుప్పతో, ఏటా రూ.250 కోట్ల వడ్డీ భారాన్ని మోస్తున్న ఈ బ్యాంకు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. రైతుల కోసం ఏర్పాటైన ఈ వ్యవస్థ నేడు రాజకీయ నాయకులు, అక్రమార్కుల చేతుల్లో దోపిడీకి జాతీయ రహదారిగా మారింది. ఆడిట్ రిపోర్టులో వెలుగు చూసిన వివరాలు ఇలా ఉన్నాయి..

అసలేం జరిగిందీ?
కాకినాడ డిసిసిబి ఒకప్పుడు వ్యవసాయ రుణాల పంపిణీలో రాష్ట్రానికే తలమానికం. కానీ, నేడు అదే బ్యాంకు వ్యవస్థాగత వైఫల్యం, అవినీతి, అక్రమాల చిట్టాతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. డిసిసిబికి వున్న రూ.788 కోట్ల మొండి బకాయిల (ఎన్పీఎ) భారాన్ని పెంచిన వాటిలో కిర్లంపూడి తర్వాత, ఏలేశ్వరం సహకార సొసైటీకి సంబంధించిన కోట్ల రూపాయల అవినీతి ప్రధానమైనది.
అక్రమాలకు సొసైటీలే అడ్డా!
డిసిసిబి కింద ఉమ్మడి జిల్లాలో మొత్తం 298 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పిఎసిఎస్) వున్నాయి. కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి సొసైటీలో రూ.104 కోట్లు, ఏలేశ్వరం సొసైటీలో రూ.46 కోట్ల అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. జగ్గంపేట, గండేపల్లి సహా కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు సొసైటీల్లోనూ ఇలాంటి అవకతవకలు జరిగాయి. బ్యాంకు సొమ్మును దిగమింగే అక్రమార్కులకు సొసైటీలు వత్తాసు పలుకుతూ, అవినీతికి అడ్డాగా మారుతున్నాయి.
కిర్లంపూడి పిఎసిఎస్ లో భారీ అవకతవకలు
కిర్లంపూడి పిఎసిఎస్ లో జరిగిన ఆర్థిక అవకతవకలు ఉమ్మడి జిల్లా డిసిసిబికి చెందిన మొత్తం రూ.188 కోట్ల అవినీతి సొమ్ములో ప్రధాన వాటాను కలిగి వున్నాయి. ఈ సొసైటీలో జరిగిన అవినీతి మొత్తం రూ.104 కోట్లుగా అంచనా వేశారు. ఈ భారీ కుంభకోణం 2012 నుంచి 2022 మధ్యకాలంలో జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కోట్ల రూపాయల ఈ భారీ మొత్తం బినామీ రుణాల రూపంలో దారిమళ్లినట్లు స్పష్టం అవుతోంది. సరైన పత్రాలు (డాక్యుమెంట్లు) లేదా సెక్యూరిటీ (పూచీకత్తు) లేకుండా వ్యవసాయ రుణాలు మంజూరు చేశారు. అసలు తమకు రుణాలు ఇచ్చినట్లే కొందరు రైతులకు తెలియదు.

రుణాలు వసూలు చేసిన కొంత మొత్తం కూడా నగదు పుస్తకాల్లో నమోదు చేయకుండా పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. సుమారు 85 లక్షల రూపాయల నిధులు సైతం గల్లంతు అయినట్లు గుర్తించారు. రుణాలు తీసుకున్నట్టుగా రికార్డుల్లో చూపినవారిలో చాలామంది అసలు రైతులు కారు. కొన్ని రికార్డుల్లోని పేర్లతో వున్న రైతులే లేరని రికవరీకి ప్రయత్నించినప్పుడు వెల్లడైంది. దస్త్రాల నిర్వహణ, ఆడిట్‌లోనూ తేడాలు వున్నట్లు తనిఖీల్లో గుర్తించారు.
ఏలేశ్వరం సొసైటీలో రూ.46 కోట్లు హాంఫట్!
ఏలేశ్వరంలో కూడా కిర్లంపూడి మాదిరిగానే బోగస్ రుణాలు మంజూరు చేయడం, రికార్డుల్లో లేని వ్యక్తుల పేర్లపై నిధులు మంజూరు చేయడం వంటి అక్రమాలు భారీగా జరిగాయి. కాకినాడ డిసిసిబికి సంబంధించిన రూ.188 కోట్ల అవినీతి సొమ్ములో కిర్లంపూడి (రూ.104 కోట్లు) తర్వాత ఏలేశ్వరం సొసైటీలో జరిగిన అవకతవకలు అత్యంత భారీగా వున్నాయి. ఏలేశ్వరం సహకార సంఘానికి సంబంధించిన అవినీతి మొత్తం రూ.46 కోట్లుగా గుర్తించారు. ఈ సొసైటీలో కూడా కిర్లంపూడి మాదిరిగానే బోగస్ రుణాలు జారీ చేయడం, రికార్డుల్లో లేని వ్యక్తుల పేర్లపై రుణాలు మంజూరు చేయడం వంటి అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ కోట్ల అవినీతి డిసిసిబికి నిరర్థక ఆస్తిగా (ఎన్పీఎ) మారడంలో ప్రధాన పాత్ర పోషించింది.
ఇతర సొసైటీల్లోనూ నిధులు దుర్వినియోగం
కిర్లంపూడి, ఏలేశ్వరంతో పాటు కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, గండేపల్లి పిఎసిఎస్ లలో కూడా బోగస్ రుణాల జారీ, నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. కోనసీమ జిల్లాకు చెందిన డి.రావులపాలెం (అల్లవరం), లక్కవరం (మల్కిపురం) వంటి సొసైటీల్లో, తూర్పు గోదావరి జిల్లాలోని శ్రీరంగపట్నం (కోరుకొండ), వెదుళ్లపల్లి (సీతానగరం) సొసైటీల్లోనూ దొంగ రుణాలు, ఆర్థిక అవకతవకలు చాలావరకు వెలుగుచూశాయి. వీటిలో ప్రత్యేకంగా రాగోలపల్లి (తాళ్లపూడి) సొసైటీపై పలువురు రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు ఎటువంటి బకాయిలు లేనప్పటికీ, తమ పేరు మీద అధిక మొత్తంలో బాకీలు వున్నట్టుగా సొసైటీ రికార్డుల్లో చూపారని వారు గగ్గోలు పెట్టారు. ఈ సొసైటీలన్నిటిలోనూ రుణాలు కేవలం కాగితాల ఆధారంగానే జారీ చేయడం, అక్రమార్కులతో సొసైటీ అధికారులు కుమ్మక్కై నిధులను స్వాహా చేయడం గమనార్హం.

ఫలితంగా రికవరీకి వెళ్లినప్పుడు, రికార్డుల్లో వున్న పేర్లతో అసలు రైతులు లేకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. రైతుల ముసుగులో రుణం తీసుకున్నవారు రికార్డుల్లో మాత్రమే మిగిలిపోవడం, అధికారులు ఆశలు వదులుకోవడం - ఈ దుస్థితి వెనుక దాగి వున్న రాజకీయ అండదండలు, వ్యవస్థాగత లోపాలు ఏమిటి? డిసిసిబిని ఈ సంక్షోభం నుంచి ఒడ్డున పడేయడం సాధ్యమేనా?.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉద్యోగులు, పాలకవర్గం కుమ్మక్కు!
రాజకీయ నాయకుల దన్ను చూసుకొని సొసైటీ ఉద్యోగులు, పాలకవర్గాలు కుమ్మక్కయి రుణాల మంజూరులో భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరైన పత్రాలు లేకుండా రుణాలు పొందడం వెనుక కొందరు స్థానిక నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు వున్నారనే ఆరోపణలున్నాయి. దస్త్రాల నిర్వహణ, ఆడిట్‌లోనూ తేడాలు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.
తనిఖీ నివేదిక..
ప్రత్తిపాడు బ్రాంచ్‌ సూపర్‌వైజర్‌ కొండబాబు తనిఖీల్లో రూ.85 కోట్ల బినామీ రుణాలు, రూ.85 లక్షల నగదు మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ప్రత్యేక నివేదికను కాకినాడ డిసిసిబి సీఈవోకు సమర్పించారు. సీఈవో విన్నపం మేరకు, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈ వ్యవహారంపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవకతవకలు జరిగిన కాలంలో సీఈవోగా వ్యవహరించిన కట్టా రాజబాబు (ఇటీవల మరణించారు)తో పాటు, ఆ సమయంలో పనిచేసిన మరికొందరు ఉద్యోగులు సైతం పదవీ విరమణ పొందారు. అయితే, కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులకు నగదు, రుణాల మంజూరు వ్యవహారాల్లో అనుమానాలు రావడంతోనే ఈ వ్యవహారం రచ్చకెక్కినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణం డిసిసిబి ఆర్థిక మూలాలను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా, సాధారణ రైతులకు అందాల్సిన ప్రయోజనాలు దక్కకుండా చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ, రికవరీ చర్యలు వేగవంతం కావాల్సిన అవసరం ఎంతైనా వుంది.
బోగస్ డాక్యుమెంట్లు..
వసూలు కాని మరో రూ.600 కోట్ల రుణాలు బోగస్ డాక్యుమెంట్లు లేదా దొంగ రుణాల కింద జారీ చేసినట్టు తేలింది. రికవరీకి వెళ్లినా, ఆ పేరుతో వున్న రైతులు లేరని అధికారులు గుర్తించారు. రూ.788 కోట్ల మొండి బకాయిలు ఎప్పటికీ తిరిగిరావనే ఆలోచనతో అధికారులు ఆశలు వదులుకున్నారు. రూ.188 కోట్ల అవినీతికి పాల్పడిన వారి నుంచి ఆస్తుల రికవరీకి ప్రయత్నిస్తుంటే, చాలామంది అక్రమార్కులు న్యాయస్థానాలను ఆశ్రయించి, ‘స్టే’లు తీసుకురావడంతో రికవరీ ప్రయత్నాలు నిలిచిపోయాయి.
రాజకీయ నాయకుల పాత్ర
డిసిసిబి చైర్మన్ పదవి అంటే వందల కోట్ల దోపిడీకి జాతీయ రహదారిగా మారిందనే విమర్శ రాజకీయ వర్గాల్లో బలంగా నాటుకుంది. కొందరు రాజకీయ నేతలు, అక్రమార్కులు తమ పలుకుబడితో డిసిసిబి రుణాలను బోగస్ వ్యక్తులకు ఇప్పించి, వాటిని స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. గతంలో ఈ పదవిని అధిష్టించిన పలువురు చైర్మన్‌లు వందల కోట్ల కుంభకోణాల్లో ఇరుక్కున్నారనే ముద్ర పడింది.
రైతులపై తీవ్ర ప్రభావం
కోట్ల రూపాయల దుర్వినియోగం కారణంగా రైతులకు అందాల్సిన ప్రయోజనాలు పూర్తిగా నిలిచిపోయాయి. రూ.788 కోట్ల ఎన్పీఎ భారం వల్ల డిసిసిబి నాబార్డ్ ప్రమాణాలను కోల్పోయి, తక్కువ వడ్డీకి లభించే రీ-ఫైనాన్స్‌ను పొందలేకపోతోంది. దీంతో బ్యాంకుకు నిధుల కొరత ఏర్పడి, రైతులకు సమయానికి పంట రుణాలు అందడం లేదు. డిసిసిబి ఆర్థికంగా బలహీనపడటం వల్ల రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లభించే కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. దీంతో అన్నదాతలు అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడాల్సిన దయనీయ స్థితికి చేరుకున్నారు. పాడి పరిశ్రమ, ఇతర అనుబంధ రంగాల కోసం ఇచ్చే దీర్ఘకాలిక రుణాలను (Long Term Loans) అందించలేని స్థితికి బ్యాంకు చేరుకుంది.
ఇకనైనా ఒడ్డునపడేనా?
డిసిసిబి కార్యకలాపాలు ఇప్పటికీ చాలావరకు పాత పద్ధతిలో, పుస్తకాల పైనే సాగుతున్నాయి. దీంతో బోగస్ రుణాలు, నిధుల దుర్వినియోగం పెరిగిపోయింది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసిసిబి పరిధిలోని 298 సొసైటీల రికార్డులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేశారు. ఒక్కో సొసైటీకి రూ.1.75 లక్షల చొప్పున మొత్తం రూ.5.21 కోట్లతో ఈ ఆధునికీకరణ జరిగింది. ప్రతి లావాదేవీ కంప్యూటరీకరణ జరిగేలా చేయడం ద్వారా అక్రమాలకు తావులేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అధికారుల ‘వివరణ’ ఎక్కడ?!
788 కోట్ల రూపాయల డిసిసిబి అవకతవకలపై రాష్ట్రవ్యాప్తంగా పత్రికలు వరుస కథనాలు ప్రచురించినా ఆప్కాబ్, డిసిసిబి, లేదా స్థానిక పాలకవర్గాల బాధ్యులు ఎవ్వరూ ఇప్పటివరకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. అవకతవకలపై ఆరోపణలు, ఆడిట్ అభ్యంతరాలు, ఆర్టీఐ సమాధానాలు బయటకొచ్చినా, బాధ్యత కలిగిన సంస్థల నుంచి ఒక్క అధికారిక సమాధానం కూడా వెలువడలేదు. దానికి బదులుగా, ‘ఇకపై తప్పులు జరగకుండా డిజిటలైజేషన్ చేపట్టాం’ అనే ఒకే లైన్ ప్రకటనతో విషయం ముగిసినట్టు ప్రవర్తించారు. ఇకపోతే, డిజిటలైజేషన్ కోసం రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రస్తావిస్తూ, అన్ని సమస్యలకు అది పరిష్కారం అన్నట్టుగా చూపారు.
కానీ అసలు ప్రశ్న?
పాత తప్పులకు ఎవరు బాధ్యత వహించారు? ఆ అవకతవకలు ఎక్కడ, ఎలా జరిగాయి? నిధులు ఎలా మాయమయ్యాయి? - వీటికి మాత్రం మౌనమే సమాధానంగా కొనసాగుతోంది.
కాకినాడ డిసిసిబి సంక్షోభం కేవలం ఆర్థిక సమస్య కాదు. ఇది వ్యవస్థాగత అవినీతి, రాజకీయ జోక్యం, అధికారుల నిర్లక్ష్యం కలగలిసిన ఒక విషాద గాథ. రైతుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన సహకార వ్యవస్థను కొందరు వ్యక్తులు తమ స్వార్థానికి వినియోగించుకున్నారు. నూతన పాలకమండలి, పూర్తిస్థాయి డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకతను పెంచడం ఒక్కటే ఇప్పుడు మిగిలిన ఆశ. లేదంటే, రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ రుణాలు ఇచ్చే పేరున్న కాకినాడ డిసిసిబి... అప్పుల కుప్పగా మిగిలిపోయి, కోలుకోలేని విధంగా నష్టాల్లో కూరుకుపోవడం ఖాయం.
(రచయిత- ఇండిపెండెంట్ జర్నలిస్టు, సహకార రంగ నిపుణుడు)
Read More
Next Story