
అందని వైద్యం.. అల్లాడుతున్న మూగజీవం
పశు వైద్య రంగం-తీవ్ర సంక్షోభం, ఏపీలో మిన్నంటిన మూగ జీవాల వేదన
రాష్ట్రంలో పాడి పరిశ్రమ రైతుకు వెన్నెముక వంటిది. కానీ నేడది కునారిల్లుతోంది. ఒకవైపు అంతుచిక్కని వ్యాధులు, మరోవైపు మందులు లేని ఆసుపత్రులు, ఇంకోవైపు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు.. వెరసి రాష్ట్రంలో పశువైద్య వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వం చెబుతున్న "పశువుల హాస్టల్స్" వంటి మాటలు కోటలు దాటుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం మూగజీవాలకు కనీస ప్రథమ చికిత్స కూడా అందక మృత్యువాత పడుతున్నాయి.
7 ఏళ్లుగా నిర్లక్ష్యం నీడన..నిమ్మకు నీరెత్తిన పాలన
రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య వ్యవస్థను సిబ్బంది కొరత వేధిస్తోంది. జాతీయ వెటర్నరీ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రతి 5 వేల పశువులకు ఒక పశువైద్యుడు ఉండాలి. ఆ లెక్కన రాష్ట్రంలో 3,300 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 1,600 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇందులో కూడా 400 మంది పాలనాపరమైన విధుల్లో ఉండటంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది.
గత ఐదేళ్లలో ఒక్క కొత్త పశువైద్యుడిని కూడా నియమించకపోవడం గమనార్హం. దాదాపు 300కు పైగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
........................
ఏపీలో మొత్తం పశువులకు సంబంధించిన ఆస్పత్రులు-3,472
వెటర్నరీ ఆస్పత్రులు- 337
పశువైద్య డిస్పెన్సరీ- 1,577
గ్రామీణ పశువైద్య శాలలు- 1558
మొబైల్ వెటర్నరీ క్లీనిక్ లు- 340
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు- 15
రాష్ట్రంలో పశుసంపద- 3 కోట్ల 40 లక్షలు
ఆవులు- 46 లక్షలు
గేదెలు-62 లక్షల 20 వేలు
గొర్రెలు- కోటీ 76 లక్షలు
మేకలు-55 లక్షలు
.......................
ఉదాహరణకు శ్రీసత్యసాయి జిల్లాలో 34, నెల్లూరులో 30, పార్వతీపురం మన్యంలో 21 ఖాళీలు ఉన్నాయి. ఒక్కో వైద్యుడు ఐదు ఆసుపత్రులకు ఇన్ఛార్జిగా వ్యవహరించాల్సిన దుస్థితి నెలకొంది. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో ఒకే వైద్యుడు ఐదు ఆసుపత్రులను పర్యవేక్షిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
శిక్షణ లేని సిబ్బంది.. అరకొర సేవలు
గత ప్రభుత్వం పశువైద్యుల నియామకాలను పక్కన పెట్టి, గ్రామ సచివాలయాల్లో 9 వేల మంది పశు సంవర్ధక సహాయకులను నియమిస్తామని గొప్పలు చెప్పింది. కానీ భర్తీ అయిన 6 వేల మందిలో 60 శాతం మందికి కనీసం సూదిమందు అంటే ఇంజెక్షన్ లు వేయడం కూడా రాదంటే ఆశ్చర్యం కలగక మానదు. సరైన శిక్షణ లేకపోవడంతో వారు రైతులకు ఏ రకమైన సాయం అందించలేకపోతున్నారు.
మందులు లేవు.. నిధులూ లేవు
వైద్యశాలలకు వెళ్తే "మందులు లేవు.. బయట కొనుక్కోండి" అని వైద్యులు చిట్టీలు రాసిస్తున్నారు. 2022-24 కాలంలో గత ప్రభుత్వం మందుల సరఫరా సంస్థలకు సుమారు రూ. 60 కోట్ల బకాయిలు పెట్టడంతో సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొంత మేర చెల్లించినా, ఇంకా రూ. 80 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఐదేళ్లుగా సర్జికల్ ఎక్విప్మెంట్ టెండర్లు లేవు. కొనుగోలు లేవు. గత ఏడాది కాలంగా ఒక్క సూదిమందు కూడా కొనుగోలు చేయలేదంటే పశువుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది.
రైతుపై ఆర్థిక భారం - నాణ్యత లేని మందులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేకపోవడంతో రైతులు ప్రైవేటు వెటర్నరీ షాపులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ మందుల ధరలు సామాన్య రైతుకు భారంగా మారుతున్నాయి. మరోవైపు, ఈ ప్రైవేటు షాపుల్లో విక్రయించే మందుల నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఔషధ నియంత్రణ అధికారులు శాంపిల్స్ సేకరించి పరీక్షించిన దాఖలాలు ఇటీవల ఎక్కడా లేవు. నాణ్యత లేని మందుల వల్ల రైతులు డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, పశువుల ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం
మందుల కొరతపై ఉన్నతాధికారుల వివరణలు విడ్డూరంగా ఉన్నాయి. పశుసంపద ఎక్కువగా ఉన్న చోట మందులు అయిపోతే, తక్కువ ఉన్న చోట నుండి సర్దుబాటు చేసుకోవాలని చెప్పడం బాధ్యతారాహిత్యమే. పశువుల సంఖ్యను బట్టి కాకుండా, అన్ని ప్రాంతాలకు సమానంగా మందులు పంపిణీ చేశామనడం అధికారుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.
పశువులే జీవనాధారంగా బతుకుతున్న చిన్న, సన్నకారు రైతులు నేడు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి:
ఖాళీగా ఉన్న 300కు పైగా పశువైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
పెండింగ్‌లో ఉన్న మందుల బిల్లులను విడుదల చేసి, ఆసుపత్రులకు మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్స్ సరఫరా చేయాలి.
వైద్యసిబ్బందికి తక్షణమే వృత్తిపరమైన శిక్షణ అందించాలి.
ప్రైవేటు మందుల షాపులపై తనిఖీలు నిర్వహించి నాణ్యమైన మందులు అందేలా చూడాలి.
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మానేసి, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే రాష్ట్రంలో పాడి పరిశ్రమ కోలుకోలేని దెబ్బతింటుంది.
(రచయిత: ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
Next Story

