అంతర్జాతీయ మార్కెట్లో కర్ణాటక ఎర్ర గులాబీలకు యమ క్రేజ్..
x

అంతర్జాతీయ మార్కెట్లో కర్ణాటక ఎర్ర గులాబీలకు యమ క్రేజ్..

వాలెంటైన్స్ డే సందర్భంగా ఊపందుకున్న విక్రయాలు..


వాలెంటైన్స్ డే(ప్రేమికుల దినోత్సవం)ను పురస్కరించుకుని కర్ణాటకలో గులాబీ పూలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఎర్ర గులాబీలలో ప్రసిద్ధి చెందిన ‘తాజ్ మహల్’ రకం అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. ఫలితంగా రైతులు, ఎగుమతిదారులు మంచి లాభాలు గడిస్తున్నారు.

ఆగ్నేయ కర్ణాటకలోని చిక్కబల్లాపూర్, దొడ్డబల్లాపూర్, కోలార్, రామనగర ప్రాంతాల్లో గులాబీ మొక్కలను ఎక్కువగా సాగుచేస్తారు. ఇక్కడే పూసే పూలకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.

బెంగళూరులోని హెబ్బల్ ప్రాంతంలో ఉన్న అంతర్జాతీయ పూల వేలం కేంద్రానికి రోజుకు సుమారు ఐదు లక్షల పూలు వస్తాయి. అయితే వాలెంటైన్స్ డే ముందు ఈ సంఖ్య రోజుకు 8 నుంచి 10 లక్షలకు పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. డిమాండ్‌తో పాటు ధర కూడా పెరగడంతో రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు.


క్రమేణా పెరుగుతోన్న పూల ఉత్పత్తి..

“వాలెంటైన్స్ డే మాకు చాలా కీలకం. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల సమయంలో కూడా పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. యూరప్ దేశాల్లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బెంగళూరు నుంచి ఎగుమతులు బాగా పెరిగాయి. గత ఐదేళ్లుగా పాలీహౌస్ సాగు పెరగడంతో నాణ్యమైన పూల ఉత్పత్తి కూడా పెరిగింది. ఏటా ఉత్పత్తి సుమారు 15 శాతం చొప్పున పెరుగుతోంది’’ అని అంతర్జాతీయ పూల వేలం కేంద్రం (IFAC) మేనేజింగ్ డైరెక్టర్ ఎం. విశ్వనాథ్ చెప్పారు.


డిజిటల్ విధానంలో వేలం ప్రక్రియ..

వేలం ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో కొనసాగుతోంది. రైతులు తెచ్చిన పూలను ఒక రోజు తర్వాత డచ్ రివర్స్ క్లాక్ పద్ధతిలో వేలం వేస్తారు. కేంద్రం రైతుల నుంచి 3.5 శాతం, కొనుగోలుదారుల నుంచి 1.5 శాతం కమీషన్ వసూలు చేస్తుంది. దేశీయంగా ఢిల్లీ, చెన్నై, విశాఖపట్నం, తిరువనంతపురం, చండీగఢ్ నగరాలకు సరఫరా చేస్తారు. దుబాయ్, సింగపూర్, మలేషియా, న్యూజిలాండ్, యూరప్ దేశాలకూ ఎగుమతులు జరుగుతున్నాయి.


ఒక్కో పువ్వు రూ. 50..

“బెంగళూరు పరిసర ప్రాంతాల్లో సాగుచేసే గులాబీలకు దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. మా కేంద్రంలో ఒకేసారి 10 లక్షల పూలను నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ సదుపాయం ఉంది. ‘తాజ్ మహల్’ రకం గులాబీలు 12, 14, 16 అంగుళాల సైజుల్లో ఎక్కువగా అమ్ముడవుతాయి. ఒక్క పువ్వు ధర రూ.50కుపైగా పలుకుతోంది’’ అని IFAC సూపర్‌వైజర్ బి.ఎల్. గగిత్ చెప్పారు.


పూలు బాగుంటేనే..

“పూలను కోల్డ్ స్టోరేజ్‌కు తరలించే ముందు ఫంగస్, పూలు పాడవ్వడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వాటిని పరిశీలిస్తాం. అలాంటివి కనిపిస్తే వాటిని తిరస్కరిస్తాం” అని నాణ్యత నియంత్రణ అధికారి తనుష చెప్పారు.


ఉద్యోగాన్నే వదిలేశా..

“వాలెంటైన్స్ డే సందర్భంగా గులాబీలకు అధిక డిమాండ్ ఉంటుంది. బెంగళూరు గులాబీలకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నా ఈ వ్యాపారంలో అవకాశాలు ఎక్కువ. ఈ రంగంలో కొనసాగేందుకు నేను లెక్చరర్ ఉద్యోగాన్నే వదిలేశాను” అని శివానీ ఫ్లోరిస్ట్ వ్యవస్థాపకురాలు రష్మి పేర్కొన్నారు.

మొత్తానికి వాలెంటైన్స్ డే సీజన్ .. కర్ణాటక గులాబీ రైతులకు ఆదాయ మార్గాన్ని చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బెంగళూరు గులాబీలకు ప్రత్యేక స్థానం ఉండడం గమనార్హం.

Read More
Next Story