
ఇరిగేషన్ డ్రైనేజీలో కొట్టుకుపోయిన ఉభయ గోదావరి రైతుల ఆశలు!
ఇరిగేషన్ డ్రైనేజీ లోపాలు రైతులను నిలువునా ముంచినట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అంగీకరించారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరిగేషన్ డ్రైనేజ్ వ్యవస్థల లోపాలు రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి. సరైన డ్రైనేజీ లేకపోవడంతో పంటలు మునిగిపోతున్నాయి. కొబ్బరి తోటలు ఎండిపోతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యపై తీవ్ర చర్చ జరిగింది. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రైతుల ఆవేదనను వెల్లడిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సుమారు 6,000 ఎకరాల్లో పంటలు మునిగిపోయి. లక్ష కొబ్బరి చెట్లు నీట మునిగి చచ్చిపోయాయి. దీనికి సమాధానంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గత ప్రభుత్వ లోపాలను ఎత్తిచూఇపుతూ, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమస్యలు రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం హామీలు ఇస్తున్నప్పటికీ, శాశ్వత పరిష్కారాలు ఎప్పుడు అమలవుతాయోనని రైతులు ఎదురు చూస్తున్నారు.
రాజోలు జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ ఆవేదన
రాజోలు నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. జనసేన పార్టీ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అసెంబ్లీలో ప్రశ్నిస్తూ ‘‘గత, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సుమారు 6,000 ఎకరాల్లో పంటలు మునిగిపోయి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు’’ అని వెల్లడించారు. ప్రభావిత రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా సముద్ర మట్టం పెరుగుదల, భూమి కుంగిపోవడం, డ్రైనేజ్ నీటిలో ఉప్పు శాతం పెరగడం వంటి కారణాలతో లక్ష ఎకరాలకు పైగా కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. వేలాది కొబ్బరి చెట్లు ఎండిపోయి పాడైపోయాయని, టెక్నికల్ కమిటీ నివేదికల ఆధారంగా ఈ సమస్యను ప్రకృతి విపత్తుగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. లైడార్ సర్వే కూడా జరుగుతోందని తెలిపారు.
ప్రస్తుతం ఈ సమస్యతో కరవాక, గొల్లపాలెం, కేశనపల్లి, కె.తూర్పుపాలెం, కె.పడమటి పాలెం, శంకరగుప్తం, చింతలమూరు, గోగన్నమఠం, కాట్రేనిపాడులంక, జి.పల్లిపాలెం, గూడపల్లి, జి.గుబ్బలపాలెం, అడవిపాలెంతో కలిపి మొత్తం 13 గ్రామాల ప్రజలు సతమతమవుతున్నారు.
కొద్దిరోజుల్లోనే పొరుగునున్న బట్టేలంక, మోరిపోడు, కేశవదాసుపాలెం(మెండుపాలెం) గ్రామాలకు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయని ఆ గ్రామాల ప్రజలు చెప్తున్నారు.
అసెంబ్లీలో ఇరిగేషన్ డ్రైనేజీపై మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఇరిగేషన్ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది: మంత్రి అచ్చెన్నాయుడు
మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించారు. ‘‘గత ప్రభుత్వంలో ఐదేళ్లుగా డ్రైనేజీ అభివృద్ధికి ఒక్క పైసా కూడా నిధులు కేటాయించకపోవడం వల్ల పరిస్థితి మరింత విషమించింది’’ అని ఆయన ఎత్తిచూపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రాజెక్ట్ రూపంలో తీసుకుని సర్వే చేయడానికి రూ.17 కోట్లు విడుదల చేశామని తెలిపారు. సర్వే పూర్తి చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
కొబ్బరి తోటల నష్టంపై మంత్రి మరిన్ని వివరాలు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, నిపుణుల బృందంతో పరిశీలించారని తెలిపారు. మల్కీపురం, మామిడికుదురు మండలాల పరిధిలోని కేసనపల్లి, శంకరగుప్తం తదితర గ్రామాల్లో పెద్దఎత్తున కొబ్బరి చెట్లు ఎండిపోయినట్లు నివేదికలు అందాయని పేర్కొన్నారు. దాదాపు ఒక లక్ష కొబ్బరి చెట్లు పాడైపోయిన నేపథ్యంలో ప్రతి చెట్టుకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.10 కోట్లు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు సమర్పించిందని వివరించారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించారని చెప్పారు.
గత వరదల్లో కోనసీమలో ఇరిగేషన్ డ్రైనేజీ పొంగి నీట మునిగిన కొబ్బరి తోటలు
దీర్ఘకాలిక పరిష్కారాలపై మంత్రి స్పష్టత
‘‘శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ’’ పనులకు రూ.20.77 కోట్లు మంజూరు చేసి, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. అదనంగా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా R&R (Replanting & Rejuvenation) పథకం కింద హెక్టారుకు రూ.32,500లు అందించే ప్రతిపాదనలు తయారుచేస్తున్నామని చెప్పారు. విబి-జి-రామ్-జి (ఉపాధి హామీ పథకం) ద్వారా కొబ్బరి తోటల్లో పాత మొక్కలు తొలగించి కొత్తవి నాటటం కోసం ఎకరాకు గరిష్టంగా రూ.99,181 వరకు ఆర్థిక సాయం అందించే ప్రణాళిక సిద్ధమైందని వెల్లడించారు. ఈ లెక్కన లక్ష ఎకరాలకు రూ.9,91,81,00,000లు ఆర్థిక సాయం అందించనున్నారు. "రైతులకు ఏ పథకం ద్వారా అధిక ప్రయోజనం కలుగుతుందో దానిని అమలు చేస్తాము" అని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
యెనుమల నాగు, కేశనపల్లి పంచాయతీ సర్పంచ్.
ఆరు ఎకరాల కొబ్బరి తోట పూర్తిగా పాడైంది. "నేను 2.5 ఎకరాల్లో కొబ్బరి నర్సరీ పెంచుతున్నాను, కానీ మొక్కలు చిన్నగా మిగిలిపోయాయి. ఉపరితల నీరు కొబ్బరి చెట్లను చంపుతోంది. భూగర్భ జలాలు తాగడానికి పనికిరావు. కొన్ని సంవత్సరాల్లో మా గ్రామం ఖాళీ అవుతుంది. మేము వెళ్లిపోవాల్సి రావచ్చు." అని నాగు ఆవేదన వ్యక్తం చేశారు.
డి. శ్రీనివాస్, గొల్లపాలెం పంచాయతీ రైతు.
2.5 ఎకరాల కొబ్బరితోటలో చెట్లనీన నిలువునా ఎండిపోయాయి. 40 ఏళ్లకు పైబడిన కొబ్బరితోట. "రెండు ఎకరాల్లోని అన్ని చెట్లు పాడైపోయాయి. మిగిలిన 70 చెట్లు కూడా ఎండుముఖం పట్టాయి. అవి బతకవు." అని శ్రీనివాస్ తెలిపారు.
ఈ సమస్యలు గోదావరి డెల్టా ప్రాంత రైతుల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నాయి. ప్రకృతి విపత్తులు, మానవ తప్పిదాలు కలిసి రైతులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వం హామీలు ఇస్తున్నప్పటికీ, వీటిని త్వరగా అమలు చేయకపోతే రైతుల ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉంది. డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించడం ద్వారా మాత్రమే ఈ ప్రాంత రైతులకు న్యాయం జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

