cooperative sector
x
సహకార వ్యవస్థలో దొంగలు పడ్డారన్న అర్థం వచ్చేలా ఉన్న ప్రతీకాత్మక చిత్రం

అక్రమార్కులతో 'సహకార' శాఖ సారథే సర్దుబాటు?

అసహనంతో రగిలిపోతున్న సొంత పార్టీ నేతలు! అసెంబ్లీ సమావేశాల్లో మంటలు తప్పవా?


(భీమారావు కె)

విశ్వసనీయత లేని సహకార వ్యవస్థ, పునాది లేని భవనం లాంటిది. అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు" - అన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలు నేడు ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ దుస్థితికి నిలువుటద్దం పడుతున్నాయి.
రూ.1600 కోట్ల దోపిడీపై విచారణ ఏమైంది?
రూ.6000 కోట్ల సహకార కుంభకోణంపై ఎందుకు మౌనం? రైతు పేరు చెప్పుకుని వేల కోట్లు దోచుకున్న అక్రమార్కులు బయట తిరుగుతుంటే, ప్రభుత్వానికి చేతులు ఎందుకు కట్టుకుపోయాయి? “వ్యవస్థకు పట్టిన చెదలు వదిలిస్తాం.. దోచుకున్న రూ. 1600 కోట్లు వసూలు చేస్తాం.. అక్రమార్కులను వదిలే ప్రసక్తే లేదు" అని రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన సింహగర్జనలు నేడు ఉత్త మాటలుగానే మిగిలిపోతున్నాయా? శాసనసభలో ఎమ్మెల్యేలే నిలదీస్తున్నా, క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించకపోవడం వెనుక అసలు నిజం ఏమిటి? 13 జిల్లాల్లో సొంత పార్టీ (టిడిపి) నేతలు అక్రమార్కుల పేర్లు చెబుతూ నిప్పులు చెరుగుతున్నా, మంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారు? పునాదులు కదులుతున్నా మంత్రి గారి మౌనం వెనుక మర్మమేమిటి? ఇది విచారణల వైఫల్యమా, లేక రిజిష్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (ఆర్.సి.ఎస్), ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్)లోని 'పెద్ద తలకాయల'తో మంత్రి సర్దుబాటు చేసుకున్న లసర్దుబాట్ల ఫలితమా అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని కలచివేస్తున్నాయి.

విచారణల ప్రహసనం!

రైతన్నకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన 'సహకార' హస్తం, నేడు అక్రమార్కుల పాలిట 'కామధేనువు'గా మారింది. 2019-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌ సహకార శాఖలో జరిగిన రూ. 6,000 కోట్ల భారీ దోపిడీపై ప్రభుత్వం సభాసంఘాన్ని (House Committee) నియమించి ఏడాది గడుస్తున్నా, పరిస్థితి 'దోషుల పాలిట రక్షణ కవచం'గా మారింది తప్ప, బాధితులకు న్యాయం జరిగిన దాఖలాలు లేవు. కమిటీలు మారుతున్నాయి, చైర్మన్లు మారుతున్నారు, కానీ రైతు రక్తాన్ని తాగిన అక్రమార్కుల నుంచి ఒక్క రూపాయి కూడా కక్కించలేకపోయారు.

రైతుకు ఒక న్యాయం.. నేతకు మరో న్యాయమా? రైతు తీసుకున్న పంట రుణం ఒక్కరోజు ఆలస్యమైతే 13 శాతం వడ్డీతో ముక్కుపిండి వసూలు చేసే వ్యవస్థ, వేల కోట్లు కొల్లగొట్టిన వారి ముందు మోకరిల్లుతోంది. డీసీసీబీలు, పీఏసీఎస్ లను సొంత బీరువాల్లా మార్చుకున్న నేతలు, బినామీ పేర్లతో నిధులు స్వాహా చేసినా ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
ఆర్భాటం ఎక్కువ.. ఆచరణ శూన్యం
2025 మార్చి 20న కొణతాల రామకృష్ణ చైర్మన్‌గా ఏర్పాటైన సభాసంఘం ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలి. ఆ తర్వాత ఎన్. అమరనాథ్ రెడ్డి నేతృత్వంలో మరో కమిటీ వచ్చింది. కానీ, క్షేత్రస్థాయిలో అక్రమార్కులపై చర్యలు ఎక్కడ? ఇది రాజకీయ విమర్శలకే పరిమితమైందా, లేక లోపాయికారీ ఒప్పందాలతో అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారా?
అంచెలంచెలుగా దోపిడీ.. అక్రమాల నిదర్శనాలివే!
కార్యదర్శి నివేదిక ఇస్తే సూపర్వైజర్లు, వారిపైన మేనేజర్లు, ఆపై ఆడిట్ విభాగం.. ఇన్ని అంచెల నిఘా వ్యవస్థ వున్నా రూ. 6,000 కోట్లు ఎలా పక్కదారి పట్టాయి? దీనివెనుక లోతైన వ్యవస్థాగత కుట్ర దాగి వుంది. ప్రకాశం జిల్లా కారుమంచి సొసైటీలో ఏడేళ్లుగా ఆడిట్ ఊసే లేకపోవడం, 230 మందికి రుణాలిస్తే కేవలం 70 మంది మాత్రమే అసలు వ్యక్తులు కావటం అక్రమాలకు పరాకాష్ట. మిగిలినవన్నీ బోగస్ అకౌంట్లే! పైగా సొసైటీల్లో ఉద్యోగాలను రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు అమ్ముకున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. గరుగుబిల్లిలో రైతుకు ఒక రసీదు, బ్యాంకుకు మరో రసీదు ఇచ్చి రూ. 85 లక్షలు స్వాహా చేయగా, చనిపోయిన వారి పేరిట కూడా రుణాలు రెన్యువల్ చేశారు. ఏటా ఆదాయం రూ.3 లక్షలు లేని తక్కెళ్లపాడు సొసైటీలో సీఈవోకు ఏకంగా రూ.7.2 లక్షల జీతం కట్టబెట్టారు. గోదావరి జిల్లా కిర్లంపూడిలో రూ.104 కోట్లు, ఏలేశ్వరంలో రూ.62 కోట్ల నిధులు దారిమళ్లాయి. ఇవన్నీ ఆడిటర్లు, అధికారులు కుమ్మక్కై చేసిన 'సహకార' దోపిడీ కాదా? ఈ గణాంకాలు మంత్రికి కనిపించడం లేదా?
మంత్రి వెనక్కి తగ్గారా?
విజయవాడలో ఆప్కాబ్ వ్యవస్థాపక దినోత్సవం నుంచి శ్రీకాకుళం సదస్సు వరకు.. మంత్రి పదేపదే 'జవాబుదారీతనం' గురించి మాట్లాడుతున్నారు. కానీ, ప్రాక్టికల్‌గా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు.
పెద్దల అండ: గత ప్రభుత్వ హయాంలో వేల కోట్లు దోపిడీ చేసిన నేతలు, అధికారులపై చర్యలు తీసుకోవడంలో మంత్రి వెనకడుగు వెనుక మర్మమేమిటి? సహకార శాఖలోని ఉన్నతాధికారులు మంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారా? లేక వారితో 'సర్దుబాటు' జరిగిపోయిందా?
కనుమరుగైన రికవరీ: రూ.1600 కోట్ల బకాయిలు, రూ.6000 కోట్ల అవినీతి అని గణాంకాలు చెబుతున్న మంత్రి, ఇప్పటివరకు ఒక్క రూపాయిని కూడా ఎందుకు రికవరీ చేయలేకపోయారు? విచారణ కమిటీలను కేవలం కాలయాపన కోసమే వాడుకుంటున్నారా?

సొంత పార్టీ నేతల నిరసన - నిమ్మకు నీరెత్తిన తీరు!

గుంటూరు నుంచి చిత్తూరు వరకు, ప్రకాశం నుంచి విశాఖ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులే ‘సహకార’ అవినీతి, అక్రమాలపై రోడ్డెక్కుతున్నారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన పీఏసీఎస్ అక్రమాలను సాక్ష్యాలతో సహా బయటపెడుతున్నారు.
నిర్లక్ష్యపు నీడ: "మా ప్రభుత్వం వచ్చినా అక్రమార్కులపై ఈగ వాలడం లేదు" అని తమ్ముళ్లు వాపోతున్నా, అచ్చెన్నాయుడు మాత్రం సమీక్ష సమావేశాలతోనే సరిపెడుతున్నారు.
వాట్సాప్ బ్యాంకింగ్‌తో సరి..: టెక్నాలజీ (వాట్సాప్ బ్యాంకింగ్)ని ప్రవేశపెట్టడం మంచిదే. కానీ వ్యవస్థను కుళ్ళిపోయేలా చేసిన 'చెదలు' వదిలించకుండా కేవలం కొత్త మెరుగులు దిద్దడం వల్ల రైతుకు వచ్చే ప్రయోజనం ఏమిటి? 13 జిల్లాల నేతల కంఠశోష మంత్రికి వినబడటం లేదా?

వ్యవస్థను గాడిలో పెట్టే చిత్తశుద్ధి ఉందా?

భూసార పరీక్షలు లేవు, విత్తనాలు లేవు అని గత ప్రభుత్వాన్ని విమర్శించిన మంత్రి, మరి తన హయాంలో ఆరు వేల కోట్ల దోపిడీకి గురైన రైతుకు ఇచ్చే భరోసా ఏది?
పెద్ద తలకాయల ప్రమేయం: ఆర్.సి.ఎస్ కార్యాలయంలో, ఆప్కాబ్ మేనేజ్‌మెంట్‌లో తిష్టవేసిన పాత అధికారుల సిండికేట్‌ను మంత్రి ఎందుకు మార్చలేకపోతున్నారు? అవినీతి మూలాలు అక్కడే వున్నాయని తెలిసినా, వారిపై చర్యలు తీసుకోకుండా 'ప్రక్షాళన' సాధ్యమా?
ఆరోపణల్లో నిజమెంత?: అక్రమార్కులతో మంత్రి సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణ, అభిప్రాయం ప్రజల్లో బలపడకముందే, మంత్రి గారు చేతల్లో తన నిజాయితీని నిరూపించుకోవాలి. లేదంటే, ఈ 'సహకార' సదస్సులు కేవలం ఫొటోలకు, ప్రసంగాలకే పరిమితమైన తంతుగా మిగిలిపోతాయి.
ఇకనైనా మేల్కొంటారా?
సహకార రంగం బాగుపడాలి అంటే కేవలం విచారణ కమిటీలు వేస్తే సరిపోదు. రైతుల పేర్లతో దోచుకున్న సొమ్మును కక్కించాలి. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, సొంత పార్టీ నేతలు అడుగుతున్న న్యాయాన్ని మంత్రి అందించాలి. విచారణ కమిటీలు విందులు, వినోదాలకే పరిమితం కాకుండా, అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తుచేసి, రైతులకు న్యాయం చేయాలి. కాలయాపన చేస్తూ విచారణను అటకెక్కిస్తే, అది అక్రమార్కులకు 'ఉపకారం' చేసినట్లే అవుతుంది. మంత్రి అచ్చెన్నాయుడు ఇకనైనా వొట్టొట్టి గర్జనలు ఆపి, రైతుల పేర్లతో కోట్లు కొల్లగొట్టిన గజదొంగలను జైలుకు పంపేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతన్నకు ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. లేదంటే, సభాసంఘాలు కూడా అక్రమార్కులకు రక్షణ కవచాలుగా మారుతున్నాయని సమాజం నమ్మాల్సి వస్తుంది.
ప్రశ్న మంత్రి గారిదే.. సమాధానం కూడా వారి నుంచే రావాల్సి వుంది!
“13 జిల్లాల రైతు గోడు – ఇది దోపిడీ కాదు, మా జీవితాలే తాకట్టు!”
ఈ రూ.6 వేల కోట్ల సహకార కుంభకోణం గణాంకాలకే పరిమితం కాదు. ఇది 13 జిల్లాల్లో లక్షలాది రైతు కుటుంబాల జీవితాలను ఛిద్రం చేసిన నేరం. శ్రీకాకుళం జిల్లాలో పీఏసీఎస్ రుణం పేరుతో బినామీ ఖాతాల్లో నిధులు మాయమవ్వడంతో, నిజమైన రైతులు వడ్డీభారం మోయలేక భూములు అమ్ముకున్నారని రైతు సంఘ నాయకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో “మా పేరుతో రుణం తీసుకుని మేమే ఎగవేతదారులమని ముద్ర వేశారు” అంటూ కారుమంచి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తూర్పు గోదావరిలో కిర్లంపూడి, ఏలేశ్వరం పరిసరాల్లో వందల కోట్లు దోచుకున్నా ఒక్క అధికారి జైలుకు వెళ్లకపోవడాన్ని రైతు నేతలు “ఇది పాలనా వైఫల్యం కాదు, వ్యవస్థాగత నేరం”గా అభివర్ణిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పీఏసీఎస్ అక్రమాలపై ఫిర్యాదు చేసిన రైతులనే బెదిరిస్తున్న పరిస్థితి ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అనంతపురం, కడప జిల్లాల్లో రుణాలు రాక ఆత్మహత్యల దాకా వెళ్లిన ఘటనలను ప్రస్తావిస్తూ, “సహకార బ్యాంకు రైతుకు తల్లి కావాలి.. కసాయిగా మారకూడదు” అని రైతు నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో చనిపోయిన వారి పేర్లపై కూడా రుణాలు రీన్యువల్ చేయడాన్ని చూసి “ఇది దోపిడీ కాదు, మృతులకూ శాంతి లేకుండా చేసిన పాపం” అని రైతులు మండిపడుతున్నారు. 13 జిల్లాల రైతుల కంఠశోష ఒక్కటే – “మాకు కమిటీల రిపోర్టులు వద్దు.. మా పేర్లతో దోచుకున్న డబ్బు తిరిగి ఇవ్వండి. దోషులను శిక్షించండి.” ఈ ఆక్రందనలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇకనైనా సహకార శాఖ మంత్రిపైనే ఉంది.

శాసనసభలోనే పేలిన ‘సహకార’ బాంబు

అవినీతిపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యేలు
2019–24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగిన భారీ అవినీతి శాసనసభ వేదికగా అధికార పార్టీ ఎమ్మెల్యేలనే కలచివేసింది. ఏపీసీఓబీ, డీసీసీబీలు, పీఏసీఎస్‌ల్లో వేల కోట్ల అక్రమాలపై ఇప్పటివరకు విచారణలు మొదలుకాకపోవడంపై ఎమ్మెల్యేలు కూన రవికుమార్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యార్లగడ్డ వెంకట్రావు, బుర్ల రమణజనేయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “దోషులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇది సాధారణ అవినీతి కాదు… ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్” అని ధూళిపాళ్ల నరేంద్రకుమార్ శాసనసభలోనే స్పష్టంగా చెప్పారు. పీఏసీఎస్ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో కాకుండా, ప్రైవేట్ భవనాల్లో నడవడం, సెక్రటరీలు ఏళ్ల తరబడి అదే చోట పాతుకుపోవడం, ఎన్నికలు జరగకపోవడం—ఇవన్నీ అక్రమాలకు దారి తీసిన మూలకారణాలుగా ఎమ్మెల్యేల స్పష్టం చేశారు. “ఇంత పెద్ద దోపిడీ జరిగితే ఇప్పటివరకు ఒక్కరి మీదైనా కఠిన చర్య ఎందుకు లేదు?” అని సభలో ప్రశ్నలు గుప్పించారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు కోర్టు స్టేలు, న్యాయ అడ్డంకులు అడ్డొస్తున్నాయని సమాధానం ఇచ్చినా, సభ్యులు హౌస్ కమిటీ వేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఉపస్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఇలా నిలదీస్తుంటే, సహకార వ్యవస్థలో అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతోంది. ఇది ప్రతిపక్ష ఆరోపణ కాదు, శాసనసభలో నమోదైన ప్రజా ఆవేదన. ఇకనైనా ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా, సభలో చేసిన హామీలకు కార్యరూపం దాల్చితేనే రైతాంగానికి న్యాయం జరుగుతుంది.
(వ్యాస రచయిత- జర్నలిస్టు, సహకార రంగ నిపుణులు. వ్యాసంలోని అభిప్రాయాలన్నీ రచయితవే.)
గమనిక- సహకార రంగంలోని పోకడలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్న సదుద్దేశంతోనే ది ఫెడరల్ ఈ వ్యాసాన్ని ప్రచురణకు స్వీకరించింది.)
Read More
Next Story