
ఆంధ్రాను వణికిస్తున్న 'బర్డ్ ఫ్లూ'
వేలల్లో చచ్చిపోతున్న కోళ్లు, పడిపోతున్న మాంసం, కోడిగుడ్ల ధరలు
ఆంధ్రప్రదేశ్ ను బర్డ్ ఫ్లూ మరోసారి వణికిస్తోంది. పౌల్ట్రీ రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుట్టిన ఈ కల్లోలం ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది.
గత ఏడాది వచ్చిన సంక్షోభం నుంచి పౌల్ట్రీ రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఆంధ్రా పౌల్ట్రీ రైతాంగం మళ్లీ సంక్షోభంలో చిక్కింది.
కేవలం పది రోజుల వ్యవధిలోనే సీన్ పూర్తిగా మారిపోయింది. జనవరి మొదట్లో లాభాల బాటలో ఉన్న రైతు, నేడు తన కోళ్లను కాపాడుకోవడమా లేక వచ్చిన కాడికి అమ్ముకుని బయటపడడమా తెలియని సందిగ్ధంలో ఉన్నాడు.
రైతు గుండెలో 'వైరస్' వణుకు
అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మొదలైన కోళ్ల మరణాలు పౌల్ట్రీ రైతులలో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక పక్క వైరస్ సోకిన కోళ్లను అధికారులు 'కల్లింగ్' (శాస్త్రీయంగా చంపడం) చేస్తుంటే, ఆ దృశ్యాలు చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. భోపాల్ లోని హై సెక్యూరిటీ ల్యాబ్ కు శాంపులు పంపిస్తే బర్డ్స్ అని తేలింది అని పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ స్పష్టం చేశారు. బర్డ్స్ లో నివారణకు తొమ్మిది రాపిడ్ రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దింపినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శశాంత్ కుమార్ చెప్పారు.
పెట్టుబడి మట్టిపాలు: ఒక్కో బ్రాయిలర్ కోడిని పెంచడానికి దాణా, మందులు, విద్యుత్ కలిపి దాదాపు ₹100 నుండి ₹120 వరకు ఖర్చవుతుంది. ఇప్పుడు మార్కెట్‌లో ధర అంతకంటే తక్కువకు పడిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు అని చిత్తూరు జిల్లాకు చెందిన పౌల్ట్రీ రైతు కాశినాయన వాపోయారు.
రుణాల భారం: రాష్ట్రంలో 80% మంది రైతులు బ్యాంక్ రుణాలు లేదా ప్రైవేట్ అప్పులు తెచ్చి ఫారాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో బర్డ్ ఫ్లూ రావడం వారిని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. నాటు కోళ్లతో మొదలైన ఈ వైరస్ తమ ప్రాణాలను తోడేస్తోందని, ఇప్పటికే సుమారు 2 వేల కోళ్లను కిల్లింగ్ చేయాల్సి వచ్చిందని మరో రైతు మునెయ్య వాపోయారు. ఒక్కో కోడి చనిపోవడం అంటే వేలల్లో నష్టపోవడమేనని ఆయన వివరించారు.
మీడియాలో వస్తున్న వార్తలు, ఫోటోలతో వినియోగదారులు చికెన్ అంటేనే భయపడుతున్నారు. దీని ప్రభావం నేరుగా ధరలపై పడింది. ఫిబ్రవరి 2న లైవ్ కోడి (కిలో)₹170 - ₹180 మధ్య పలకితే ఇప్పుడది ₹110, ₹130 మధ్య ఉందని, సుమారు 35% ధరలు తగ్గాయని రైతులు వాపోతున్నారు. ఇదే తరహాలో కోడి గుడ్ల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. జనవరి 15,16 తేదీలలో ఒక్కో గుడ్డు 8,9 రూపాయలు అమ్మితే ఇప్పుడవి 5 రూపాయలుగా ఉన్నాయి.
మాంసం ధరలతో పోలిస్తే గుడ్ల ధరలు కొంత నిలకడగా ఉన్నప్పటికీ, ఎగుమతులు తగ్గడంతో నిల్వలు పెరిగిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక బోర్డర్లలో తనిఖీలు పెరగడం వల్ల ఎగుమతులు మందగించాయి.
చికెన్ తినడం మానేసిన వారు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారు. మటన్ & చేపలకు డిమాండ్: చికెన్ మానేసిన వారు మటన్ వైపు చూడటంతో, మటన్ ధర కిలోకు ₹100 వరకు పెరిగి కొన్ని చోట్ల ₹1000 దాటిపోయింది. చేపలు, రొయ్యలకు కూడా ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
ప్రభుత్వ భరోసా - క్షేత్రస్థాయి వాస్తవాలుప్రభుత్వం చనిపోయిన ప్రతి కోడికి ₹140 నుండి ₹160 వరకు పరిహారం ఇస్తామని చెబుతున్నా, ఆ ప్రక్రియలో ఉన్న జాప్యం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని పశుసంవర్థక శాఖ అధికారులు ప్రకటించారు. డాక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నట్టు పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
బయో-సెక్యూరిటీ:
వైరస్ వ్యాప్తి చెందకుండా ఫారాల వద్ద బ్లీచింగ్ చల్లడం, బయటి వ్యక్తులను రానీయకపోవడం వంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. "చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ రాదు. వైరస్ 70°C వద్ద చనిపోతుంది. కాబట్టి బాగా ఉడికించిన మాంసం సురక్షితం" అని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, జనం మాత్రం 'రిస్క్ ఎందుకు' అన్న ధోరణిలోనే ఉన్నారు.
బర్డ్ ఫ్లూ అనేది కేవలం ఒక వ్యాధి మాత్రమే కాదు, వేలాది కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసే ఆర్థిక సంక్షోభం. ప్రభుత్వం కేవలం పరిహారం ఇవ్వడమే కాకుండా, వినియోగదారుల్లో నమ్మకాన్ని కలిగించేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు (చికెన్ ఫెస్టివల్స్ వంటివి) నిర్వహిస్తేనే ఈ రంగం మళ్ళీ పుంజుకుంటుంది.
"మేము పెంచిన కోడి మాకు లాభం ఇవ్వకపోయినా పర్వాలేదు.. కానీ మా బతుకులను రోడ్డున పడేయకూడదు." అని రైత సంఘం నాయకుడు పి.జమలయ్య అన్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, నష్టపోయే రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2 వేల వరకు కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటిలో సుమారు 8 కోట్ల వరకు కోళ్లు ఉన్నాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మొదలైన బర్డ్ ఫ్లూ అంతటితో ఆగితే పరవాలేదని, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే చాలా పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోవాల్సి వస్తుందని పౌల్ట్రీ రైతు సంఘం నేత దొరయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story

