
పౌల్ట్రీ రైతులకు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుండే ఏఐ ఇమేజ్
పౌల్ట్రీ రైతుల ఇంట ఇక కాసుల పంట!
ఏపీలో రోజుకు 45 లక్షల గుడ్ల డిమాండ్… రైతుల చేతికి కాంట్రాక్టులు
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా కాంట్రాక్టులను కోళ్ల రైతులకే ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రోజుకు 43–46 లక్షల గుడ్ల అవసరం ఉండే ఈ వ్యవస్థ రైతులకు ఎంత మేలు చేస్తుంది?
ఆంధ్రాలో పౌల్ట్రీ రైతులకు ఇది నిజంగా శుభవార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టే జరిగితే పౌల్ట్రీ రైతుల పంట పండినట్టే. సర్కారీ స్కూల్లు, అంగన్‌వాడీ సెంటర్లకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టులను కోళ్ల రైతులకే ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వ్యవసాయ శాఖ పని తీరును చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం సమీక్షించారు. ఈ సందర్భంలో ఆయన ఈ మాట చెప్పారు. పౌల్ట్రీ రంగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలో వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న పౌల్ట్రీ రంగానికి ఇది పెద్ద ఊరటగా మారుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
రైతులకు జరిగే మేలు ఏమిటీ?
ఈ నిర్ణయం వల్ల కోళ్ల రైతులకు ప్రధానంగా స్థిరమైన మార్కెట్ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా అంటే రోజూ భారీగా కొనుగోలు జరిగే వ్యవస్థ. మార్కెట్‌లో ధరలు పడిపోయిన సందర్భాల్లో కూడా రైతులకు ఆదాయం నిలకడగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటివరకు పెద్ద కాంట్రాక్టర్లు, సరఫరా ఏజెన్సీలు ఈ ఒప్పందాలను దక్కించుకునే పరిస్థితి ఉంది. రైతులకే నేరుగా ఇస్తే మధ్యవర్తుల ఆధిపత్యం తగ్గుతుందని రైతు సంఘాలు భావిస్తున్నాయి.
ఏపీలో ఎన్ని పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయంటే..
రాష్ట్రంలో ఈ రంగం ఎంత పెద్దదో చూస్తే నిర్ణయం ప్రాధాన్యం మరింత స్పష్టమవుతుంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,900–2,000 వరకు వాణిజ్య పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. వీటిలో పెద్ద స్థాయి ఫారాలతో పాటు జిల్లాలలోని చిన్న, మధ్యతరహా ఫారాలూ ఉన్నాయి. ఒక్కో ఫారానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక కుటుంబాలు ఆధారపడతాయని అనుకుంటే రాష్ట్రంలో కనీసం 20,000 నుంచి 30,000 రైతు కుటుంబాలు నేరుగా పౌల్ట్రీ రంగంపై ఆధారపడి ఉన్నట్లు ఒక ప్రాక్టికల్ అంచనా.
రోజుకు ఎన్ని గుడ్లు కావాలి?
ఈ నేపథ్యంలో గుడ్ల సరఫరా అవసరం ఎంత అన్నది కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో PM POSHAN (మధ్యాహ్న భోజన పథకం) కింద రోజూ భోజనం చేస్తున్న విద్యార్థుల సంఖ్య సుమారు 29.5 లక్షలు. ఒక రోజు అందరికీ గుడ్డు ఇస్తే స్కూళ్లకు రోజుకు దాదాపు 29.5 లక్షల గుడ్లు అవసరం అవుతాయి.
అంగన్‌వాడీల్లో కూడా ప్రీ-స్కూల్ పిల్లలకు గుడ్లు అందిస్తారు. Poshan Tracker డేటా ప్రకారం రాష్ట్రంలో మొత్తం beneficiaries సుమారు 30.7 లక్షలు. ఇందులో ప్రధానంగా 3–6 ఏళ్ల పిల్లలు సుమారు 14–16 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. అంటే అంగన్‌వాడీలకు “ప్రతిరోజూ గుడ్డు” స్కీం కింద రోజుకు మరో 14–16 లక్షల గుడ్లు అవసరం అవుతాయి.
ఈ రెండు కలిపితే, (స్కూలు + అంగన్‌వాడీలకు) రోజులో మొత్తం 43–46 లక్షల గుడ్లు అవసరం అవుతాయి. వారానికి స్కూలు పిల్లలకు 5 రోజులు గుడ్లు ఇస్తే సుమారు 1.47 కోట్ల గుడ్లు అవసరం అవుతాయి. అంగన్‌వాడీల్లో కూడా అదే స్థాయిలో కొనసాగితే మొత్తం వారానికి 2 కోట్లకు పైగా గుడ్లు అవసరం అయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తి ఎంత?
ఇక రాష్ట్రంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే పౌల్ట్రీ రంగంలో ముందున్న రాష్ట్రాల్లో ఒకటి. కేంద్ర ప్రభుత్వ BAHS-2024 డేటా ప్రకారం భారత్ మొత్తం గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా సుమారు 17.85 శాతం. దీని ఆధారంగా రాష్ట్రంలో ఏడాదికి సుమారు 25.5 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. అంటే రోజుకు సుమారు 7 కోట్ల గుడ్ల ఉత్పత్తి అవుతున్నట్టు అంచనా.
ప్రభుత్వ స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల అవసరం రాష్ట్ర ఉత్పత్తిలో దాదాపు 6 శాతం వరకు ఉంటుంది. ఈ స్థాయిలో స్థిరమైన ప్రభుత్వ కొనుగోలు రావడం వల్ల కోళ్ల రైతులకు మార్కెట్ భరోసా పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
రైతుల స్పందన ఏమిటంటే..
ఈ నిర్ణయంపై స్పందించిన ఏపీ కోళ్ల రైతు సంఘం నాయకుడు ఆకురాతి దొరయ్య మాట్లాడుతూ, “కాంట్రాక్టులు నిజంగా రైతులకే దక్కితే చిన్న, మధ్యస్థ కోళ్ల రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుంది. ఇది రంగానికి భరోసా కలిగించే నిర్ణయం” అన్నారు. అలాగే ఏపీ రైతు సంఘం నాయకుడు కేవీవీ ప్రసాద్ కూడా, “ప్రభుత్వ సరఫరా వ్యవస్థలో పారదర్శకత ఉంటే రైతులకు స్థిర ఆదాయం వస్తుంది. కానీ చెల్లింపులు సకాలంలో జరగడం కీలకం” అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం నిజంగా రైతులకు మేలు చేయాలంటే అమలు కీలకం. చిన్న రైతులకు నిజంగా కాంట్రాక్టులు దక్కాలా? ధరలు న్యాయంగా ఉంటాయా? చెల్లింపులు సకాలంలో జరుగుతాయా? అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. గతంలో ప్రభుత్వ సరఫరాల్లో ఆలస్య చెల్లింపులు, తక్కువ రేట్లపై విమర్శలు వచ్చిన సందర్భాలున్నాయి.
మొత్తానికి సీఎం చంద్రబాబు ప్రకటించిన ఈ విధానం పౌల్ట్రీ రంగానికి ఒక “ప్రో-ఫార్మర్” సంకేతంగా కనిపిస్తోంది. కాంట్రాక్టులు నిజంగా రైతుల చేతికి చేరి, పారదర్శకంగా అమలైతే, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల రైతులకు ఇది “సర్కారు భరోసా మార్కెట్”గా మారి, నిజంగానే “పంట పండినట్టే” అవుతుందన్న ఆశలు పెరుగుతున్నాయి.
Next Story

