ఎపిలో విదేశీ జూనియర్ డాక్టర్లకు పీఆర్ ఇచ్చేదెప్పుడు?

ఎంబిబిఎస్ విదేశాల్లో పూర్తిచేసి స్వదేశంలో పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం నానా అవస్థలు పడుతున్ననేటి తరం జూనియర్ డాక్టర్ల ఆవేదన మిన్నంటుతోంది.

Update: 2024-08-22 13:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో విపరీతంగా ఉన్న ఫీజులు కట్టలేక విదేశాలకు వెళ్లి MBBS పూర్తి చేసిన వారి మొర ప్రభుత్వం ఆలకించడం లేదని యువ జూనియర్ డాక్టర్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. NMC నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఇంటెన్షిప్ (Internship) పూర్తి చేసిన జూనియర్ డాక్టర్లకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (PR ) ప్రభుత్వం జారీ చేయాల్సి ఉంది. అయితే ఎందుకో వీరి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. చదువు సరిగ్గా రాదని అనుకున్నారా? అంటే అదేమీ లేదనేది అధికారుల మాట. వారు సక్రమంగా ఎంబిబిఎస్ పూర్తి చేశారా? లేదా? అనేది పరీక్షించేందుకే Internship ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

మెడికల్ కౌన్సిల్ లో ఫ్రీ సీటు రాక.. ప్రయివేట్ కాలేజీల్లో డబ్బు పెట్టి చదివించే స్తోమత లేక.. డాక్టర్ కావాలనే బలమైన కోరికను చంపుకోలేక.. దేశం దాటి ఐదేళ్ల పాటు విదేశాల్లో అష్టకష్టాలు పడి వైద్య విద్యను పూర్తి చేసిన వారు ఆంధ్రప్రదేశ్ లో వేల సంఖ్యలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్, 1997లో నిర్దేశించిన విధంగా భారతదేశంలో MBBS కోర్సులో ప్రవేశానికి అర్హత ప్రమాణాలను పొందారు.

నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) నిర్వహించిన ఎగ్జామ్ లో ఉత్తీర్ణత కూడా సాధించారు. NMC నిబంధన ప్రకారం ఒక ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్ లో ఇంటెన్షిప్ కూడా పూర్తి చేశారు. ఫైనల్ ఇయర్ లో ఆఫ్ లైన్ క్లాసులకు హాజరై, ఎగ్జామ్ కూడా ఆఫ్ లైన్ లో రాసిన విద్యార్థులకు ఒక సంవత్సరం మాత్రమే ఇంటెన్షిప్ ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. ఆన్ లైన్ లో క్లాసులకు అటెండ్ అయిన వారికి మాత్రం రెండేళ్ల పాటు ఇంటెన్షిప్ ఉంటుందని 2024 జూన్9న విడుదల చేసిన నోటిఫికేషన్ లో NMC స్పష్టంగా తెలిపిందని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నరహరి తెలిపారు. NMC నోటిఫికేషన్ ప్రకారం ఒక సంవత్సరం పాటు సక్సెస్ ఫుల్ గా ఇంటెన్షిప్ పూర్తి చేసిన మా పిల్లల పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కు ఆన్ లైన్ లో అప్లై చేసి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ముందు (AP MC) సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు కూడా హజరై రెండు నెలలు పూర్తి అయినా ఇంకా పర్మినెంట్ సర్టిఫికెట్ జారీ చేయలేదన్నారు. పైగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ప్రక్రియను AP మెడికల్ కౌన్సిల్ నిలుపుదల చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ సర్టిఫికెట్ కోసం వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. మా పిల్లలతో పాటు విదేశాల్లో MBBS పూర్తి చేసిన వైద్య విద్యార్థులకు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు. NMC నిర్వహించిన ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించి ఇంటెన్షిప్ కూడా పూర్తి చేసుకున్న వేలాది మంది విద్యార్థులు ఇప్పటికే పీజీ ఎంట్రన్స్ కోసం ప్రైయివేట్ కోచింగ్ సెంటర్లలో ఫీజులు చెల్లించి జాయిన్ అయ్యారు. పీజీ విద్య కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఏపీ ప్రభుత్వం సర్టిఫికెట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సబబు కాదనేది తల్లిదండ్రుల వాదన. NMC నిబంధనల ప్రకారం మాకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు కోరుకుంటున్నారు.

విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు రెండు సంవత్సరాలు ఇంటెన్షిప్ చేయాలని ఇతర రాష్ట్రాలలో లేని నిబంధనను ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పెట్టడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఇప్పటికే ఏడాది పాటు ఇంటెన్షిప్ పూర్తి చేసిన విద్యార్థులకు మరో ఏడాది పాటు ఇంటెన్షిప్ చేయాలని కండిషన్ పెట్టడం వల్ల పీజీ ఎంట్రెన్స్ కోసం చెల్లించిన ఫీజులు నష్టపోవడం పాటు ఆర్ధికంగా భవిష్యత్తులో మా పిల్లల కెరియర్ కు కూడా ఇబ్బంది కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News