Tirumala || శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు..!
తిరుమల ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం;
By : Dinesh Gunakala
Update: 2025-04-06 08:44 GMT
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారంనాడు శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు.
శ్రీరామనవమి ఆస్థానం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగనుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు.