హైదరాబాద్‌లో 50 ఏళ్లుగా ఎగురుతున్న పతంగ్ ..ఐదోసారి అసద్ ఎన్నిక

హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఐదోసారి ఘన విజయం సాధించారు. ఎందుకలా జరుగుతున్నది

Update: 2024-06-05 03:27 GMT

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఐదోసారి విజయం సాధించారు. ఒవైసీకి 6,61,981 ఓట్లు రాగా, తన సమీప బీజేపీ అభ్యర్థి మాధవి లతకు 3,23,894 ఓట్లు వచ్చాయి.

- ఒవైసీ 2004 పార్లమెంట్ ఎన్నికల నుంచి వరుసగా గెలుపొందారు.తన తండ్రి అయిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఆరుసార్లు విజయం సాధించి హైదరాబాద్ పార్లమెంట్ ను మజ్లిస్ కంచుకోటగా మార్చారు.

- అనంతరం 2004వ సంవత్సరంలో మొట్టమొదటిసారి అసదుద్దీన్ ఒవైసీ ఎంపీ బరిలో దిగారు. అప్పటి బీజేపీ అభ్యర్థి జి సుభాష్ చందర్జీపై లక్షకు పైగా ఓట్లతో అసదుద్దీన్ మొదటిసారి ఎంపీ అయ్యారు.
- 2009 లోక్ సభ ఎన్నికల్లో రెండో సారి ఒవైసీ పోటీ చేసి తన సమీప టీడీపీ ప్రత్యర్థి జహీద్ అలీఖాన్ పై 1,13,865 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.2014, 2019 సంవత్సరాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ అసద్ ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి చెందిన జే భగవంతరావుపై 2.82 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.మళ్లీ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఐదోసారి అసద్ అత్యధిక మెజారిటీతో విజయదుందుభి మోగించారు

యాభై ఏళ్లుగా హైదరాబాద్ లో పతంగ్ పాగా
హైదరాబాద్ లోక్‌సభ స్థానం సాంప్రదాయకంగా మజ్లిస్ పార్టీకి బలమైన కోటగా మారింది. గత యాభై ఏళ్లుగా తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో 1984 నుంచి మజ్లిస్ గట్టి పట్టును కొనసాగించింది.

ఆరుసార్లు సాలార్ విజయం
హైదరాబాద్ కార్పొరేటర్ అయిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 1984వ సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి హైదరాబాద్ ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టారు. సాలార్ గా పేరొందిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 1989 పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై 1,33,078 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం 1991,1996,,1998,1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులైన బద్దం బాల్ రెడ్డి, ఎం వెంకయ్యనాయుడును ఓడించి ఎంపీ అయ్యారు. తండ్రీ సాలార్, కుమారుడు అసదుద్దీన్ ఒవైసీలు ఓటమి ఏరగని వీరులుగా చరిత్ర సృష్టించారు.

ఒవైసీకి పెరిగిన మెజారిటీ
వరుసగా ఐదవ సారి ఈ సీటును గెలుచుకున్న అసదుద్దీన్ ఒవైసీ తన బీజేపీ ప్రత్యర్థి మాధవి లత కొంపెల్లిపై 3.38 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ సారి అసదుద్దీన్ తన మెజారిటీని పెంచుకుంటూ పోయారు. 2004లో అసద్ 1,00,145 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 2009లో 1,13,865 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలా ప్రతీ ఎన్నికల్లో తన ఓట్ల ఆధిక్యతను పెంచుకుంటూ ప్రస్థుతం 3.38 లక్షల మెజారిటీ సాధించారు.

తొలిరౌండులో మాధవీలత ఆధిక్యం
తొలి రౌండ్లలో ఒవైసీకి మాధవీ లత కొంపెల్లి గట్టి పోటీ ఇచ్చారు.బీజేపీ అభ్యర్థి మధ్యాహ్న సమయానికి రెండో రౌండ్ కౌంటింగ్ వరకు ఆధిక్యాన్ని నెలకొల్పారు.బీజేపీ అభ్యర్థి మాధవీలత ముమ్మర ప్రచారం సాగించినా,ఆమె 3,23,894 ఓట్లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్‌ నుంచి మహమ్మద్‌ వలీవుల్లా సమీర్‌ 62,962, బీఆర్‌ఎస్‌ నుంచి శ్రీనివాస్‌ యాదవ్‌ గడ్డం 18,641 ఓట్లు సాధించారు.

ఫాసిస్ట్ శక్తులపై పోరాటం సాగిస్తాం : అసదుద్దీన్ ఒవైసీ

ఫాసిస్ట్ శక్తులపై ఎంఐఎం పోరాటం కొనసాగిస్తుందని ఆలిండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో తనను గెలిపించినందుకు ఓటర్లకు అసద్ ధన్యవాదాలు తెలిపారు. ఔరంగాబాద్ ఎంపీ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి ఓడిపోయినా, అక్టోబర్‌లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.రైతులు, దళిత సంఘాలు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని అన్నారు.బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావుపై తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు.


Tags:    

Similar News