విద్యాకమిషన్ ఏర్పాటు సరే, విజిలెన్స్ కమిషన్ నివేదికలపై చర్యలేవి?

తెలంగాణలో పలు కమిషన్ల నివేదికలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం లేదు.తెలంగాణ విజిలెన్స్ క‌మిష‌న్, రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదికలు ఆచరణలో అమలు కావడం లేదు.

Update: 2024-09-04 13:31 GMT

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా విద్యా క‌మిష‌న్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పలు కమిషన్ల నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అమలు చేయాలని తెలంగాణ మేథావులు, ప్రజలు కోరుతున్నారు. విద్య‌కు సంబంధించిన వివిధ అంశాల‌పై విద్యా కమిషన్ చేసే సిఫార‌సులను అమలు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి సీఎం ఎ రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో సూచించారు.


ఉన్నత విద్యామండలి ఉన్నా...
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధి కోసం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ ను ఏర్పాటు చేసింది.స్టేట్ కౌన్సిల్ ఫ‌ర్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ ఏర్పాటు చేయాల‌ని జాతీయ విద్యా పాల‌సీ చెబుతోంది.జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా 1988వ సంవత్సరంలో ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో ఉన్నతవిద్యా కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.గ‌త ప‌ది సంవ‌త్స‌రాల్లో యూనివ‌ర్సిటీలకు వైస్ ఛాన్స‌ల‌ర్ల నియామ‌కం సజావుగా జరగలేదు.

యూనివర్శిటీలకు వీసీలు ఏరి?
తెలంగాణలోని యూనివర్శిటీలకు వీసీలను నియమించాలని హైకోర్టు ఆదేశించినా వారి నియామ‌కాలు చేయలేదు. ప్ర‌స్థుతం పలు యూనివ‌ర్సిటీల‌న్నీ వైస్ ఛాన్స‌ల‌ర్లు లేక ఇన్ చార్జీ వీసీలే పాల‌న సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న‌త విద్య అతి దీన‌స్థితిలో ఉంది.స్టేట్ కౌన్సిల్ ఫ‌ర్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ అందిస్తున్న స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను స‌చివాల‌యంలో ప‌ట్టించుకునే అధికారులే లేరు.

విద్యా కమిషన్ సూచనలు అమలు అయ్యేనా?
రాజ్యాంగ నిర్దేశ్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆర్థిక సంఘం చ‌ట్టం ద్వారా స్టేట్ కౌన్సిల్ ఫ‌ర్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ ఏర్పాటైంది. అలాగే ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఏర్పాటైన విజిలెన్స్ క‌మిష‌న్ సూచ‌న‌ల‌ను, స‌ల‌హాల‌ను స‌చివాల‌యంలో ఏ శాఖ సెక్రటరీ ప‌ట్టించుకోవ‌డం లేదు.ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక జి.ఓ. ద్వారా ఏర్పాటైన తెలంగాణ విద్యాకమిషన్ స‌ల‌హాలు, సూచ‌న‌ల‌కు స‌చివాల‌యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాటిస్తారా అనేది సందేహాస్పదంగా మారిందని యం పద్మనాభరెడ్డి చెప్పారు.

విజిలెన్స్ కమిషన్ నివేదికలు బుట్టదాఖలా
తెలంగాణ విజిలెన్స్ క‌మిష‌న్ నివేదికలు బుట్టదాఖలా అయ్యాయి. విజిలెన్స్ కమిషన్‌ను 2015మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాల‌న‌లో అవినీతిని అరిక‌ట్టడం,ప‌రిపాల‌న స‌రిగా జ‌రిగేట‌ట్లు చూడ‌డానికి ఈ కమిషన్ ఏర్పాటు చేశారు.విజిలెన్స్ క‌మిష‌నర్‌గా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారిని నియ‌మించారు.విజిలెన్స్ కమిషన్ ప్ర‌భుత్వ అధికారుల అవినీతి అక్రమాలపై నివేదికలు రూపొందించింది. పాల‌న‌లో అవినీతి, మిస్ కండ‌క్ట్ , నిబ‌ద్ధ‌త లేక‌పోవ‌డంపై విజిలెన్స్ కమిషన్ ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు ఇచ్చినా, వాటిని అమలు చేయడం లేదు.

అసెంబ్లీలో ప్రవేశపెట్టని కమిషన్ నివేదికలు
తెలంగాణ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన‌ సూచ‌న‌లు, స‌ల‌హాల‌పై ప్ర‌భుత్వం విభేదించిన‌ప్పుడు ఆ ద‌స్త్రంపై ముఖ్య‌మంత్రి ఆమోదం కావాలి.ఆ త‌రువాత ఎందుకు విభేదించారో తెలుపుతూ ఒక నోటు ద్వారా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. విజిలెన్స్ కమిషన్ ప్ర‌తి సంవ‌త్స‌రం మే నెల‌లో త‌మ నివేదిక‌లను రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కు సమర్పిస్తోంది. గవర్నర్ విజిలెన్స్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి చ‌ర్య‌లు తీసుకోవాలి.గ‌త తొమ్మిది సంవ‌త్స‌రాలుగా తెలంగాణ విజిలెన్స్ కమిషన్ తొమ్మిది రిపోర్టులు ఇచ్చినా వాటిపై చ‌ర్య‌లు తీసుకొని అసెంబ్లీలో ఉంచిన దాఖ‌లాలు లేవు.

ఆర్థిక సంఘం నివేదికలపై చర్యలేవి? 
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం రాజ్యాంగ అనుక‌ర‌ణ 243 - I ప్ర‌కారం ప్ర‌తి రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ నియ‌మిస్తారు.ఈ సంఘం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయితీల ఆర్థిక స్థితిగ‌తుల‌ను ప‌రిశీలించి రాష్ట్ర ప్ర‌భుత్వానికి వివిధ ప‌ద్దుల కింద వ‌చ్చే ఆదాయాన్ని శాస్త్రీయ‌బ‌ద్దంగా రాష్ట్రంలోని పంచాయితీల‌కు పంప‌కం చేయాలి. కాని ఈ నివేదిక‌ను గ‌వ‌ర్న‌రు అసెంబ్లీలో ఉంచేందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు.ఆర్థిక సంఘం నివేదిక అమలుకు నోచుకోలేదు.గ‌త 10 సంవ‌త్స‌రాల‌లో ఆర్థిక సంఘం సిఫార‌సుల‌పై గత కేసీఆర్ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. అదీకాక ఆర్థిక సంఘం నివేదిక‌లను శాస‌న‌స‌భ ముందు ఉంచ‌లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

తెలంగాణ విద్యాకమిషన్ సూచనలు పాటించాలి : యం పద్మనాభరెడ్డి
తెలంగాణ విద్యాకమిషన్ సూచనలను ప్రభుత్వం పాటించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం లేఖ రాశారు.తెలంగాణలోని విజిలెన్స్ కమిషన్ నివేదికలను రాష్ట్ర శాస‌న‌స‌భ ముందు ఉంచ‌డానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రిని ఫోరం ప‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ కోరింది.తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు చేయ‌టాన్ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ స్వాగ‌తించింది.


Tags:    

Similar News