షాకింగ్ ట్విస్ట్: లడ్డుపై చంద్రబాబును తప్పుబట్టిన సుప్రీమ్ కోర్ట్!

రిజెక్ట్ అయిన నెయ్యి శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపారని, దాని ఆధారంగా ముఖ్యమంత్రి మీడియాముందు వ్యాఖ్యలు చేశారని సుప్రీమ్ కోర్ట్ పేర్కొంది.

Update: 2024-09-30 09:35 GMT

తిరుమల లడ్డు వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డుల తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అస్పష్టమైన వాస్తవాల ఆధారంగా బహిరంగ ప్రకటనలు చేశారని, అది తప్పని సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యానించింది.

లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా అని కోర్టు అడిగింది. ప్రాధమిక సాక్ష్యాల ప్రకారం, కల్తీ జరిగిందని ల్యాబ్‌లో నిర్ధారించబడిన నెయ్యిని లడ్డుల తయారీలో వాడిలేదని, అది రిజెక్ట్ కాబడిన నెయ్యి అని తేలినట్లు కోర్ట్ వ్యాఖ్యానించింది.

ముఖ్యమంత్రి సెప్టెంబర్ 18న లడ్డులో కల్తీ జరిగిందని ప్రకటన చేశారని, ఎఫ్ఐఆర్ 25న నమోదయిందని, ఆ మరుసటిరోజు సిట్ ఏర్పాటు చేశారని పేర్కొంది. ఈ ఆరోపణపై దర్యాప్తు పూర్తికాకముందే, దీనిపై బహిరంగ ప్రకటనలు చేయాల్సిన అవసరం ఏముంది అడిగింది. అంత ఉన్నతస్థాయి పదవిలో ఉన్న వ్యక్తి, కోట్లమంది భక్తుల మనోభావలకు సంబంధించిన విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనుచితమని గర్హించింది. లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఏ నివేదికా నిరూపించలేదని వ్యాఖ్యానించింది.

" ప్రపంచ వ్యాపింతంగా ఉన్న కోట్లాది మంది భక్తి విశ్వాసాలకు సంబంధించిన పిటిషన్ కోర్టు ముందుకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యితో తిరుమల లడ్డు ప్రసాదాన్ని తయారుచేశారని బహిరంగంగా చెప్పారు. అయితే కల్తీ చేసిన నెయ్యిని లడ్డుల తయారీ లో వాడలేదని తిరుమలి తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి స్పష్టం చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కల్తీ మీద ఒక స్వతంత్ర సంస్థచేత దర్యాప్తు జరిపించాలని, ఆలయాల దర్మకర్తల మండలికి ప్రసాదాల తయారీలో ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లుకోరుతున్నాయి," అని కోర్టు పేర్కొంది.

తిరుమల లడ్డు కల్తీపై సుబ్రమణ్యస్వామి, వైసీపీ నేతలతో సహా దాఖలైన పలు పిటిషన్‌లు ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, టీటీడీ తరపున సిద్దార్థ్ లూత్రా హాజరయ్యారు. రిజెక్ట్ అయిన నెయ్యి శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపారని, దాని ఆధారంగా ముఖ్యమంత్రి మీడియాముందు వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందేమో కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ఇక ముందుకు వెళ్ళగూడదని, దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థకు అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. దేవుళ్ళను రాజకీయాలకు దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది. మరోవైపు, ఏపీ ప్రభుత్వం తరపున వాదిస్తున్న ముకుల్ రోహత్గి తన వాదనలో… ఈ పిటిషన్‌లు అన్నీ కేవలం ప్రభుత్వంపై బురద జల్లటంకోసమేనని ఆరోపించారు. కేసును గురువారానికి వాయిదా వేశారు. మొత్తంమీద ఈ పరిణామం ప్రతిపక్ష వైసీపీకి ఊరట కలిగించేదిగా చెప్పుకోవచ్చు.

మరొక పిటిషనర్ డా. సుబ్రమణియన్ స్వామి తరుఫున కోర్టుకు హాజరయిన అడ్వకేట్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి జె శ్యామలరావు చెప్పినవిషయాలకు పొంతన లేదని, ఇలాంటి ప్రకటన వల్ల సమాజంలో సామరస్యం దెబ్బతింటుందని అన్నారు. " ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో లడ్డు ప్రసాదం తయారుచేసిందుకు వాడిన ఘీ కల్తీఅయిందని నిర్ధారణగా చెప్పారు.తర్వాత టిటిిడి ఈ వొ మాట్లాడుతూ కల్తీ అయిన నెయ్యిని గుర్తించి వెనక్కుపంపించడం జరిగిందని అన్నారు. బాధ్యతాయుతమయిన పదవుల్లో ఉన్నవాళ్లు సరైన సమాచారం సేకరించకుండా ప్రకటనలు చేయడం వల్ల సామరస్యం దెబ్బతింటుంది," అని అన్నారు.

ఎలాంటి నిర్ధారణ లేకుండా ముఖ్యమంత్రి ఎలా నెయ్యి కల్తీఅయిందని చెబుతారని చెబుతూ ఆలయ వ్యవహారంలోకి రాజకీయలు రాకుండా అపాలని రాజశేఖర్ రావు కోర్టును కోరారు.

Tags:    

Similar News