సోషల్ మీడియా మ్యాజిక్: అంట్లు తోమే అమ్మాయికి 5.8 మిలియన్ ఫాలోయర్స్!

గత దశాబ్దకాలంగా సోషల్ మీడియా… మధ్యతరగతి, విద్యావంతులతోపాటు అట్టడుగు స్థాయివారి జీవితాలనుకూడా మార్చివేస్తూ ‘ఇన్‌క్లూసివ్ డెవలెప్‌మెంట్’కు నిదర్శనంగా నిలుస్తోంది.

Update: 2024-09-28 11:19 GMT

సాఫ్ట్‌వేర్ రంగం రెండు దశాబ్దాలనుంచి మధ్యతరగతి కుటుంబాలలో అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కుటుంబాలు మధ్యతరగతి నుంచి ఒక మెట్టుపైకి… ఎగువ మధ్యతరగతికి దూసుకెళ్ళిపోయాయి. పిల్లలకు ఇంజనీరింగ్ డిగ్రీ, కాస్త తెలివితేటలు ఉంటే చాలు… వారు ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు సంపాదించి తమ కుటుంబాల స్థితిగతులను ఒక్కసారిగా మార్చేస్తున్నారు. ఉన్న ఊరు తప్ప మరో ప్రపంచం తెలియని చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు హనుమకొండనుంచి హైదరాబాద్‌కో, బందరు నుంచి విజయవాడకో వెళ్ళివస్తున్నట్లు ఏడాదికి ఒకసారి అమెరికా, జర్మనీ వంటి దేశాలకు వెళ్ళివస్తున్నారు. అదంతా సాఫ్ట్‌వేర్ మహిమ. సరే, సాఫ్ట్‌వేర్ రంగం మధ్యతరగతివారి జీవితాలను అలా మార్చేస్తే, గత దశాబ్దకాలంగా సోషల్ మీడియా… మధ్యతరగతివారితోపాటు అట్టడుగు స్థాయివారి జీవితాలను కూడా మార్చివేస్తూ ‘ఇన్‌క్లూసివ్ డెవలెప్‌మెంట్’ (అసమానతలు లేని అభివృద్ధి)కు నిజమైన నిదర్శనంగా నిలుస్తోంది.

సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది అట్టడుగు స్థాయినుంచి అందలాలకు ఎదిగిపోతున్నారు. వారి జీవితాలు ఒక్కసారిగా టర్న్ ఎరౌండ్ అయిపోతున్నాయి. కష్టాలన్నీ తొలగిపోయి సౌకర్యాలు, విలాసాలు అనుభవించగలిగే స్థాయికి చేరుతున్నారు. యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అద్భుతమైన వినోదాన్ని అందిస్తూ అంచెలంచెలుగా ఎదిగిపోతున్నారు.

టిక్ టాక్ అనే యాప్ ఇప్పుడు ఇండియాలో నిషేధానికి గురయ్యి ఉందిగానీ, అది యాక్టివ్‌గా ఉన్నప్పుడు చాలామంది సామాన్యులు తమ ప్రతిభను ఈ ప్రపంచానికి చాటిచెప్పేందుకు చాలా ఉపయోగపడింది… కొత్త కొత్త కళాకారులను ఈ ప్రపంచానికి అందించింది… సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెర్‌లను చేసింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కూడా అలాగే ఇన్‌ఫ్లూయెన్సర్‌లను చేస్తోంది. అలా అయినవారిలో ఒకరు ముంబాయికి చెందిన మరాఠీ అమ్మాయి వర్షా సోలంకి.

అన్ని సౌకర్యాలూ ఉన్న చాలామంది చేయలేని పనిని వర్ష ఏ అండా లేకుండానే సాధించి చరిత్ర సృష్టించింది. ఇళ్ళల్లో అంట్లు తోముకునే ఈమె ఇప్పుడు మరాఠీలో అతి పెద్ద సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమెకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 5.8 మిలియన్ ఫాలోయర్‌లు ఉన్నారు. విశేషమేమిటంటే మాధురి దీక్షిత్ కూడా ఈమెను ఫాలో అవుతున్నారు. ఇంతకూ ఈమె ట్యాలెంట్ ఏమిటంటే డాన్స్.

చిన్నతనంనుంచి వర్ష కటిక దారిద్ర్యంలో పెరిగింది. అయినా చిన్నప్పటినుంచి ఆమెకు డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. తాగుబోతు తండ్రి కుటుంబాన్ని పట్టించుకోకపోవటంతో తల్లి కుటుంబభారాన్ని మోయాల్సివచ్చింది. ఆమె ఇళ్ళల్లో పని చేస్తూ ఇద్దరు కూతుళ్ళను పోషిస్తూ ఉండేది. ఇద్దరు కూతుళ్ళలో వర్ష పెద్దది కావటంతో కొద్దిగా పెరిగిన తర్వాత తన తల్లి బాధ్యతలను భుజానికి ఎత్తుకోవలసి వచ్చింది. దానితో డాన్స్ విషయం పక్కకు వెళ్ళిపోయింది. తల్లితోపాటు వర్ష ఇంటింటికీ వెళ్ళి అంట్లు తోమటం వంటి పనులు చేస్తుండేది. అలా కాలం గడిచి, పెరిగి పెద్దదయిన వర్షకు పెళ్ళి అవటం, తల్లికావటం కూడా జరిగిపోయింది. అయినా మనసులో ఓ మూల డాన్స్ అంటే ఇష్టం అలాగే ఉండిపోయింది.

సోషల్ మీడియాతో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోవటంతో యాప్‌ల రూపంలో అనేక అవకాశాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి… జియోవారి నెట్ కలిసివచ్చింది. వర్ష తనలో ఉన్న డాన్స్ వ్యామోహాన్ని తీర్చుకోవటంకోసం వీడియోలు అప్‌లోడ్ చేయటం మొదలుపెట్టింది. చిన్న చిన్న డాన్స్, కామెడీ వీడియోలతో ఆమె ప్రస్థానం మొదలయింది. అది అలా అలా సాగుతూ మిలియన్ల ఫాలోయర్స్ స్థాయికి తీసుకొచ్చింది. అయితే ఇదంతా అంత తేలిగ్గా ఏమీ అయిపోలేదు. మొదట్లో ఆమె వీడియోలపై చాలా ట్రోల్స్ జరిగాయి. అయితే వాటిని పట్టించుకోకుండా వర్ష ముందుకు సాగిపోయింది. మెల్లగా ఆమె వీడియోలు వైరల్ కావటం మొదలయింది. ఆ వీడియోలు చూసి కలర్స్ శాటిలైట్ ఛానెల్ వారు ఆమెను డాన్స్ దీవానే అనే రియాలిటీ షో నాలుగో సీజన్‌లో పాల్గొనమని ఆహ్వానించారు. అక్కడ ఆమె ప్రతిభను చూసి జడ్జిలు మాధురి దీక్షిత్, సునీల్ షెట్టి, ప్రేక్షకులు కూడా మెచ్చుకున్నారు. తాను కూడా వర్షను ఇన్‌స్టాలో ఫాలో అవుతానని మాధురి చెప్పారు. వర్ష ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని సునీల్ షెట్టి అన్నారు. ఇప్పుడు ఆమె ఒక విజయగాధగా నిలిచిపోయారు.

పశ్చిమగోదావరిజిల్లాలోనూ ఇదేరకం విజయగాధ




పశ్చిమ గోదావరిజిల్లా కొయ్యలగూడెం సమీపంలోని రాజవరం అనే ఒక కుగ్రామంలో ఉండే సత్యవతి-అబ్బులు అనే వ్యవసాయ కూలి జంటది కూడా ఇలాంటి విజయగాధే. అబ్బులు పొలాల్లో పనిచేసుకునే ఒక రోజువారీ కూలి. ఏడో తరగతిదాకా చదువుకున్నాడు. అతనికి 2016లో సత్యవతితో వివాహమయింది. ఇద్దరు పిల్లలు. అతను నాలుగేళ్ళ క్రితం యూట్యూబ్‌ ఛానల్ మొదలుపెట్టాడు. మొదట తన భార్యతో వంటలు చేయిస్తూ దానిని షూట్ చేసి ఆ వీడియోలను అప్‌లోడ్ చేసేవాడు. తర్వాత ‘సత్యవతి ఏ విలేజ్ వుమన్’ అనే ఛానల్ మొదలుపెట్టాడు. దానిలో కేవలం వాళ్ళ దైనందిన జీవితం గురించి మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఆ రోజు ఏం కూర వండుకున్నారు, సంతకు వెళ్ళి ఏం కొన్నారు, టౌన్‌కు వెళ్ళి ఏం సినిమా చూశారు, ఏ హోటల్‌లో తిన్నారు అనేది చూపిస్తూ వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తారు. ఆ కుగ్రామంలో ఆ చిన్న కుటుంబం ఎలా జీవిస్తుందని చూడాలనో, ఏమో అబ్బులు రూపొందించే వీడియోలకు విపరీతమైన వ్యూయర్‌షిప్ ఉంటుంది. మిలియన్ పైగా వ్యూస్ వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి. యూట్యూబ్‌పై వచ్చిన ఆదాయంతో ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇప్పుడు కుటుంబమంతా హాయిగా మంచి సౌకర్యవంతమైన ఇంట్లో ఉంటున్నారు. మనుషులు కూడా నునుపు తేలారు. ఇప్పుడు వారి సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య లక్షా ముప్ఫైఆరు వేలు.

కష్టపడేతత్వం, ప్రతిభ, తపన ఉంటే ఈ డిజిటల్ యుగంలో అతి కొద్దికాలంలోనే అద్భుతాలు సృష్టించవచ్చని వర్ష, అబ్బులు వంటివారు నిరూపిస్తున్నారు.

Tags:    

Similar News