ఇంతకీ ఈ సారి ఏపీ ముఖ్యమంత్రి ఎవరు?

ఎవరికి వారు వచ్చే నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇటు వైఎస్‌ఆర్‌సీపీ, అటు టీడీపీ ప్రకటించాయి. ఇంతకీ ముఖ్యమంత్రి ఎవరు?

Update: 2024-05-26 01:57 GMT

వెనకటికి ఎవడో ఆలి లేదు.. సూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నాడంటా. అలా ఉంది ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీల పరిస్థితి. మా నాయకుడు వచ్చే నెల 9న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ వేదికగా ప్రకటించారు. అంతకు ముందు వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ఏకంగా ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసి జూన్‌ 9న ఉదయం 9:30 గంటలకు రెండో సారి సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వంటి టీడీపీ నేతలు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు జూన్‌ 9న అమరావతి వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు.

ఈ మధ్య ఈ నాయకులందరికీ పీఠాధిపతులు, జ్యోతిష్యుల పిచ్చి పట్టుకున్నట్టుంది. వాళ్లు పిచ్చి మాటలు మాట్లాడుతూ నాయకులను నమ్మించేందుకు చెబుతున్న మాటలు ఇరు పార్టీల వారినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. దేవుళ్లను పెద్దగా నమ్మని చంద్రబాబు నాయుడు ఎన్నికలు కాగానే రిలాక్స్‌ కావడం కోసం అంటూ తీర్థ యాత్రలు చేశారు. ఎన్నికలకు ముందు నుంచి విశాఖపట్నంలో ఉన్న శారద పీఠాధిపతి కాళ్లకు మొక్కుతూ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పీఠాధిపతి చెబుతున్నట్లు తన గెలుపు ఖాయమని, తానే ముఖ్యమంత్రిననే ధీమాలో ఉన్నారు. అటు చంద్రబాబుకు గానీ, ఇటు జగన్‌మోహన్‌రెడ్డికి గానీ తమ పార్టీ ఓడి పోయే అవకాశమే లేదనే నమ్మకం వారిలో ఉంది. ఓట్లు వేసింది ప్రజలు. వారి మనసుల్లో ఏముందో తెలుసుకోవాలంటే వారి జీవిత రహస్యాలను చదవాలి. అంతే కానీ ఇటు పీఠాధిపతులనో, అటు జ్యోతిష్యులనో నమ్ముకుంటే ఓట్లు రాలవు, పాలకులు కారు. నమ్మకాలు ఉండొచ్చు. అంత మాత్రాన నేనే తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఎలా ఇరుపార్టీలు ప్రకటిస్తాయి. ఎవరికి వారు ఇలా ప్రకటించుకుంటే సిగ్గుగా ఉండదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో గత వారం రోజులుగా ఉక్క పెట్టి ఊపిరి ఆడని పరిస్థితిని తీసుకొచ్చింది. వామ్మో ఇదేందిరా నాయనో.. ఇట్లాంటి వ్యవహారం ఇంత వరకు ఎప్పుడూ చూడలేదురా బాబో అంటూ గోదారోళ్లు సైతం తలలు పట్టుకుంటున్నారంటే నేతల్లో పిచ్చి ఎంత పీక్‌కు పోయిందో అర్థం చేసుకోవచ్చు.

అసలు వీరిద్దరి గెలుపునకు ప్రజలు కాదంట కారణం. జగన్‌కు ఐప్యాకోళ్లు.. చంద్రబాబుకు రాబిన్‌ శర్మలట. ఇదీ వాళ్ల వరుస. ఇలా అయితే ఈ ఎన్నికలు ఎందుకు.. ఓటర్లు ఓట్లేయడమెందుకు.. ఈ సర్వే సంస్థలు చెప్పినట్లు నడుచుకుంటే నాయకులిద్దరు ఆటోమేటిక్‌గా గెలిచి పోతారు కదా.. అని ఓటర్లు రచ్చ బండ చర్చలు, వేప చెట్ల కింద ముచ్చట్లు చేసుకోవడం విశేషం. ఓటర్లకున్న విచక్షణ నేతల్లో లేకపోవడం, ఎవరికి వారు తాము గెలుస్తామంటే తాము గెలుస్తామనుకోవడం ఏంటనేది రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోను ఎడతెగని చర్చగా ఉంది. ఈ మధ్య ఈవీఎంల్లో మతలబులున్నాయని దేశ వ్యాప్తంగా ఒక చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌కు ఓటేస్తే కమలం గుర్తు ఎదురుగా లైటెలుగుతుందని, బీఎస్పీకి ఓటేస్తే కమలం గుర్తు దగ్గరే లైటెలుగుతుందని ఒక చర్చ సాగుతోంది. రాష్ట్ర పార్టీల నాయకులు అలాంటి మతలబులు ఈ ఎన్నికల్లో చేశారా? లేకపోతే ఓటర్లకు తెలియకుండా ఎట్లా గెలుస్తారని చెప్పుకుంటారు? అనేది టాకాఫ్‌ది రాష్ట్రంగా మారింది.
Tags:    

Similar News