తెలంగాణలోని మారుమూల గ్రామంలో పెళ్ళి చేసుకున్న సిద్దార్థ్, అదితి!
వధువు అదితిరావు హైదరి తల్లి తరపువారు వనపర్తి రాజకుటుంబంవారు కావటంతో ఈ పెళ్ళిని ఇక్కడ నిర్వహించినట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా ప్రేమబంధంలో ఉన్న హీరో సిద్దార్థ, హీరోయిన్ అదితి రావు హైదరిల ఇవాళ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్ళి తెలంగాణలోని ఒక మారుమూల గ్రామమైన వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని 400 ఏళ్ళనాటి రంగనాయకస్వామి ఆలయంలో జరగటం విశేషం. వధువు అదితిరావు హైదరి తల్లి తరపువారు వనపర్తి రాజకుటుంబంవారు కావటంతో ఈ పెళ్ళిని ఇక్కడ నిర్వహించినట్లు తెలుస్తోంది. హైదరికి తాత(తల్లి తండ్రి) వనపర్తి రాజకుటుంబానికి చెందిన రాజా జే రామేశ్వరరావుకాగా, హైదరి ముత్తాత మహమ్మద్ సలే అక్బర్ హైదరి నిజాం సంస్థానంలో ప్రధానమంత్రిగా ఉండేవారు.
సిద్దార్థ్, అదితిల వివాహం పూర్తిగా దక్షిణ భారతదేశపు హిందూ సంప్రదాయంలో జరిగింది. “నువ్వే నా సూర్యుడు, నువ్వే నా చంద్రుడు… నా తారాలోకం - మిస్టర్ అండ్ మిస్సెస్ సిద్ధు” అనే అందమైన క్యాప్షన్‌తో అదితి తన పెళ్ళి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇద్దరూ పూర్తి సంప్రదాయ దుస్తులలో ఉన్నారు. కొత్త దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సిద్దార్థ్ అధికారికంగా ఇది రెండవ వివాహం. మొదటి భార్య వివరాలు బయటకు తెలియవు. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత శృతిహాసన్, సమంతలతో ప్రేమకలాపాలు నడిపినట్లు వార్తలు వచ్చాయి. మహా సముద్రం అనే సినిమా షూటింగ్‌లో అదితితో సిద్దార్థకు పరిచయం ఏర్పడింది. తన తల్లి హైదరాబాద్‌లో నడిపే స్కూల్ అంటే తనకు ఎంతో ఇష్టమని, సిద్దార్థ అక్కడ తనకు ప్రపోజ్ చేయటంతో కాదనలేకపోయానని అదితి ఆ మధ్య చెప్పారు. సిద్దార్థ్ తమిళనాడుకు చెందినవారు.