ప్రెస్ మీట్‌లో భోరున విలపించిన షర్మిల

భారతి సిమెంట్స్‌లో, సాక్షి మీడియాలో నలుగురు బిడ్డలకూ సమానవాటా ఇవ్వాలని రాజశేఖరరెడ్డి ఆదేశించారని, ఇది నిజమని తాను తన బిడ్డలమీద ప్రమాణం చేయగలనని షర్మిల అన్నారు.

Update: 2024-10-26 10:51 GMT

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి ఇవాళ మీడియా సమావేశంలో భోరున విలపించారు. జగన్‌తో ఆస్తి వివాదంపై మాట్లాడుతూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాసేపు మాటలురాక మౌనంగా ఉండిపోయి, తిరిగి తేరుకుని ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తనకు, తన పిల్లలకు అన్యాయం చేయటం పచ్చినిజం అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ విషయంలో తాను తన పిల్లలమీద ప్రమాణం చేస్తానని, జగన్, సుబ్బారెడ్డి ప్రమాణం చేయగలరా అని షర్మిల సవాల్ విసిరారు. సొంత కొడుకే కోర్టుకు లాగటంతో తన తల్లి ఇంట్లో కుమిలిపోతున్నారని షర్మిల తెలిపారు.

షర్మిల ఇవాళ మధ్యాహ్నం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను పెంచటంపై విమర్శలతో మీడియా సమావేశాన్ని మొదలుపెట్టారు. ఆస్తి వివాదం ప్రస్తావనకు వచ్చినప్పుడు జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ జైలులో ఉన్నప్పుడు అతను పాదయాత్ర చేయమంటే తాను 3,200 కి.మీ. పాదయాత్ర చేశానని చెప్పారు. తనకు జగన్ అన్న అంటే అంత ప్రాణమని, ఆయన వెళ్ళమంటే పాదయాత్రకే కాదు, సూర్యుడి దగ్గరకు వెళ్ళమన్నా వెళ్ళేదానినని అన్నారు. జగన్ జైలులో ఉండగా రెండు ఉపఎన్నికలలో పని చేశానని చెప్పారు. ఆ సమయంలో అన్ని పనులకూ తానే తిరిగానని అన్నారు. తాను ఆయనకోసం అంతగా చేస్తే, తనకు జగన్ చేసింది ఏముందని ప్రశ్నించారు. తనకు ఒక్క మేలు కూడా చేయలేదని చెప్పారు. తాను చేసిన తప్పేమిటో చెప్పాలని అడిగారు.

ప్రతి ఇంటిలోనూ ఉండే గొడవలేనని జగన్ సమర్థించుకుంటున్నారని, కన్నతల్లిపై కొడుకు కేసు వేయటం ఈ లోకంలో ఘర్ ఘర్ కీ కహానీయా అని షర్మిల ప్రశ్నించారు. జగన్ జైలులో ఉన్నప్పుడు అతని కోసం తాను, అమ్మ ఎంతో కష్టపడ్డామని చెప్పారు. తానే కాదు, తన తల్లి కూడా జగన్ జైలులో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిందని, కాళ్ళు నొప్పులు ఉన్నాకూడా పట్టించుకోలేదని అన్నారు. ఇంత చేస్తే, తల్లి విజయలక్ష్మిని కూడా కోర్టుకు లాగిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని షర్మిల విమర్శించారు.

భారతి సిమెంట్స్‌లోగానీ, సాక్షి మీడియాలోగానీ నలుగురు బిడ్డలకూ సమానవాటా ఇవ్వాలన్నది రాజశేఖరరెడ్డి ఆదేశించారని, ఇది నిజమని తాను తన బిడ్డలమీద ప్రమాణం చేసి చెబుతానని చెప్పారు. షర్మిలకు జరగాల్సిన వాటాల బదలాయింపు జరగలేదేమిటని రాజశేఖరరెడ్డి తన చివరి రోజుల్లో ఒకసారి అడిగినప్పుడు, నీ తర్వాత ఈ ప్రపంచంలో షర్మిల మేరుకోరే మొదటివాడిని తానేనని జగన్ చెప్పారని తెలిపారు. డోంట్ వర్రీ డాడ్ అని కూడా జగన్ అన్నారని, ఇది నిజమని కూడా తాను తన బిడ్డలమీద ప్రమాణం చేయగలనని షర్మిల చెప్పారు.

తమ బాబాయి, టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డిని కూడా షర్మిల విమర్శించారు. ఆస్తులు మొత్తం జగన్‌వి కాబట్టే అతను జైలుకు వెళ్ళాడని సుబ్బారెడ్డి అంటున్నారని, మరి భారతి పేరు మీద ఆస్తులు ఉంటే ఆమె జైలుకు ఎందుకు వెళ్ళలేదని అడిగారు.

ఐదేళ్ళుగా ఎంఓయూ తన దగ్గర ఉన్నా, ఏ మీడియా హౌస్‌కూ వెళ్ళలేదని, ఎన్ని కష్టాలు వచ్చినా వాడుకోలేదని, బయటపెట్టలేదని అన్నారు. వైఎస్ కుటుంబం గురించి చెడ్డగా చెప్పుకుంటారనే ఎంఓయూ గురించి బయటపెట్టలేదని చెప్పారు.

తనకు లాభం జరుగుతుందనుకుంటే జగన్ ఎవరినైనా అణచివేస్తాడని షర్మిల ఆరోపించారు. విజయమ్మను కోర్టుకు లాగటానికి కారణం ఎవరనేది వైకాపా శ్రేణులు ఆలోచించుకోవాలని అన్నారు. జగన్ లాంటి వ్యక్తి ఎలాంటి నాయకుడో, శాడిస్టో వైకాపా నేతలు, అభిమానులు అర్థం చేసుకోవాలని షర్మిల కోరారు.

Tags:    

Similar News