రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్: రేపు బీఆర్ఎస్ నిరసనలు

ప్రపంచమంతా అబ్బురపడే విధంగా, చిదంబరం తెలంగాణ ఇస్తామని ప్రకటించిన డిసెంబర్ 9 తేదీన అద్భుతమైన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేయిస్తామని రేవంత్ చెప్పారు.

Update: 2024-09-16 12:24 GMT

అరికెపూడి గాంధి - పాడి కౌషిక్ రెడ్డి వివాదాన్ని ఇంకా మర్చిపోకముందే, తెలంగాణలో మరో వివాదానికి తెరలేచింది. హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున సచివాలయం ఆవరణలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ దివంగత నేత రాజీవ్ గాంధి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఆవిష్కరించారు. మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, రాజనర్సింహ, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విగ్రహావిష్కరణ సభలో రేవంత్ మాట్లాడుతూ, దేశంకోసం త్యాగాలు చేసిన కుటుంబం నెహ్రూ కుటుంబానిదని, తెలంగాణను దోచుకున్న ఒక కుటుంబం వారసత్వ రాజకీయాలు చేస్తోందంటూ నెహ్రూ కుటుంబాన్ని విమర్శించటం సిగ్గు చేటని అన్నారు. దేశానికి రాజీవ్ గాంధి కంప్యూటర్‌ను పరిచయం చేయటంవలనే ఒక వ్యక్తి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేశాడని, లేకపోతే గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవాడని పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ చురకలు వేశారు. తెలంగాణకు చెందిన పీవీని ఈ దేశానికి ప్రధానిని చేసింది సోనియాగాంధి అని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మీ ఫామ్ హౌస్‌లలో జిల్లేళ్ళు మొలిపించేలా చేయకపోతే తన పేరు రేవంత్ కాదంటూ కేసీఆర్ కుటుంబానికి సవాల్ విసిరారు. పది సంవత్సరాలు పాలనలో ఉండగా, హైదరాబాద్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు మీకు సమయం దొరకలేదా అని ప్రశ్నించారు. ప్రపంచమంతా అబ్బురపడే విధంగా, చిదంబరం తెలంగాణ ఇస్తామని ప్రకటించిన డిసెంబర్ 9 తేదీన అద్భుతమైన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేసేలా చూడాలని పీడబ్ల్యూడీ శాఖకు ఆదేశాలిచ్చానని చెప్పారు.

మరోవైపు, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో రాజకీయ దురుద్దేశ్యంతోనే రాజీవ్ విగ్రహాన్ని పెట్టి, తెలంగాణ తల్లిని రేవంత్ రెడ్డి అవమానపరిచారంటూ ఆరోపిస్తూ, రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో తెలంగాణతల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని తమ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి రాష్ట్రప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో పెట్టుకున్నవాళ్ళు ఎవరూ రాజకీయాలలో బతికి బట్టకట్టలేదన్న విషయం రేవంత్ గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రాగానే రాజీవ్ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు.

వాస్తవానికి గతనెలలో రాజీవ్ గాంధి జన్మదినం సందర్భంగా సోనియా, రాహుల్ చేతులమీదగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కొన్ని కారణాలవలన కార్యక్రమం వాయిదా పడింది. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్‌గా సచివాలం ప్రధానద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ఇటీవల భూమిపూజ చేశారు. డిసెంబర్ 9న ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. దేశానికి ప్రధానులుగా చేసిన ఇందిర, పీవీ విగ్రహాలు ఒకే వైపు వరసగా ఉండటంతో, రాజీవ్ విగ్రహాన్ని కూడా అటు అమరవీరుల చిహ్నం, సచివాలయం మధ్యలో ఏర్పాటు చేసినట్లు రేవంత్ వివరణ ఇచ్చారు.

Similar News