రేవంత్ కూడా కేసీఆర్ లెక్క కౌబాయ్ టోపీ పెట్టిండు!

సీఎమ్‌గా చివరి రోజుల్లో కేసీఆర్ బయటకు వెళితే టోపీ పెట్టుకునేవారు. చివరకు యాదాద్రి గుడికి, కలెక్టరాఫీసు ప్రారంభోత్సవానికి కూడా టోపీతోనే వెళ్ళారు.

Update: 2024-10-21 08:08 GMT

కేసీఆర్ ముఖ్యమంత్రిగా చివరి రోజుల్లో ఎక్కువగా ఇలాంటి కౌబాయ్ టోపీతోనే కనిపించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతకు ముందు ఆయన కేవలం ఫార్మ్ హౌస్‌కు మీడియాను తీసుకెళ్ళినప్పుడు మాత్రమే కౌబాయ్ టోపీ పెట్టేవారు. సీఎమ్‌గా చివరి రోజుల్లో మాత్రం ప్రతి కార్యక్రమంలో టోపీ పెట్టుకునే ఉండేవారు. బయటకు వెళితే టోపీ పెట్టుకునేవారు. చివరకు యాదాద్రి గుడికి, కలెక్టరాఫీసు ప్రారంభోత్సవానికి కూడా టోపీతోనే వెళ్ళారు. కలెక్టరాఫీస్ ఛాంబర్ లోపల కూడా దానిని తీయకపోవటంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు పలు జోకులు కూడా వేశారు. కేసీఆర్ రాజులాగా ఊహించుకుంటాడు కాబట్టి టోపీని ఇలా కిరీటంలాగా పెట్టుకుంటున్నాడని చురకలు వేశారు. మరికొందరైతే అందరికీ టోపీ పెట్టటానికి అది పెట్టుకు తిరుగుతున్నాడని అన్నారు. బండి సంజయ్ లాంటి మరికొందరు కేసీఆర్ పిట్టలదొరనని నిరూపించుకుంటున్నాడని వెటకారం చేశారు.

ఇంకో విషయం ఏమిటంటే, ఫామ్ హౌస్‌లో పెట్టుకున్న టోపీకి పర్పుల్ కలర్ రిబ్బన్ ఉండగా, చివరి రోజుల్లో పెట్టుకున్న టోపీకి ఆకుపచ్చ రిబ్బన్ ఉండేది.

సరే ఇదిలా ఉండగా, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ కూడా కౌబాయ్ టోపీ పెట్టుకుని కనిపించారు. అయితే కేసీఆర్ పెట్టుకున్న కౌబాయ్ టోపీకి, రేవంత్ పెట్టుకున్న టోపీకి చాలా వ్యత్యాసం ఉంది. కేసీఆర్ పెట్టుకునేది క్రీమ్ కలర్ కౌబాయ్ హ్యాట్ కాగా, రేవంత్ ఇవాళ పెట్టుకున్నది నలుపురంగు కౌబాయ్ హ్యాట్. ఈ కౌబాయ్ హ్యాట్ పోలీసు శాఖవారిది. ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి రేవంత్ హాజరయ్యారు. గోషా మహల్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత రేవంత్ రెడ్డి అక్కడి సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనకు తమ పోలీస్ ఎంబ్లమ్ ఉన్న కౌబాయ్ టోపీని ధరింపజేశారు. అదీ రేవంత్ కౌబాయ్ టోపీ వెనక ఉన్న కథ.

Tags:    

Similar News