రాజ్‌కోట్ అగ్నిప్రమాద ఘటనలో అధికారుల సస్పెన్షన్
గుజరాత్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను ఆ రాష్ట్ర సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
అనుమతులు లేకుండా గేమ్ జోన్ నిర్వహణకు అనుమతించిన అధికారులపై గుజరాత్ ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. 27 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సర్కారు ఆరుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సస్పెండ్ అయిన వారిలో రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ జైదీప్ చౌదరి, ఆర్‌ఎంసీ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ గౌతమ్ జోషి, రాజ్‌కోట్ రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎంఆర్ సుమ, పరాస్ కొఠియా, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు వీఆర్ పటేల్, ఎన్‌ఐ రాథోడ్ ఉన్నారు.
అగ్నిమాపక శాఖ NOC ఇవ్వలేదు..
అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందకుండానే గేమ్‌జోన్ నిర్వహిస్తుండడం గమనార్హం. "గేమ్ జోన్‌కు రోడ్లు, భవనాల శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఫైర్ డిపార్టుమెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారని, అయితే ఎన్‌ఓసి రావాల్సి ఉందని రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ చెప్పారు.
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శనివారం అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఘటనకు కారకులయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన తర్వాతి రోజు ఆరుగురు అధికారులను సస్పెండ్ చేశారు.
ఇద్దరి అరెస్టు, ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్..
రాజ్‌కోట్ నానా-మావా ప్రాంతంలోని టీఆర్‌పీ గేమ్ జోన్‌లో సంభవించిన అగ్ని ప్రమాద ఘటనకు సంబధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. గేమ్‌జోన్ ఆరుగురు పార్ట్‌నర్లతో పాటు మరొకరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
సుమోటోగా స్వీకరించిన గుజరాత్ హైకోర్టు..
గుజరాత్ హైకోర్టు అగ్ని ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించింది. "మానవ నిర్మిత విపత్తు" గా పేర్కొంది.
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా..
కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు ₹4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ₹2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది.
ఘటన ఎలా జరిగింది?
వేసవి సెలవులు, అందులోనూ వారాంతం కావడంతో.. సాయంత్రం సరదాగా గడిపేందుకు చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు గేమ్ జోన్‌కు వచ్చారు. శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గేమ్‌జోన్‌లో మంటలు చెలరేగాయి. ఎగసిపడిన మంటలు దాటికి గేమ్‌జోన్ ఫైబర్ డోమ్ కూలిపోవడంతో తప్పించుకునేందుకు వీలులేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రాత్రి 11 గంటల సమయానికి 27 మృత దేహాలను వెలికి తీశారు. అందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని రాజ్‌కోట్ కలెక్టర్ ప్రభాస్ జోషి తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ తెలిపారు.
ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రధాని దిగ్భ్రాంతి, రాష్ట్రపతి విచారం..
రాజ్‌కోట్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.