చౌకబారు విమర్శలు చేస్తే పోయేది మీ విలువే!
పదేళ్ళుగా తమ చేతిలో ఉన్న అధికారాన్ని రేవంత్ రెడ్డి లాగేసుకున్నాడన్న ఉక్రోషంతా మాట్లాడినట్లుగా ఉంటున్నాయి వారు ముఖ్యమంత్రిపై చేసే విమర్శలు.
రానురానూ కేసీఆర్, కేటీఆర్ చేసే విమర్శలు వారి స్థాయిని దిగజార్చే విధంగా ఉంటున్నాయి. పదేళ్ళుగా తమ చేతిలో ఉన్న అధికారాన్ని రేవంత్ రెడ్డి లాగేసుకున్నాడన్న ఉక్రోషంతా మాట్లాడినట్లుగా ఉంటున్నాయి వారు ముఖ్యమంత్రిపై చేసే విమర్శలు. రేవంత్ రెడ్డి వికృత చేష్ఠలకు పాల్పడ్డారంటూ కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశారు. సీఎమ్ గౌడన్నలను అవమానించాడని ఆ ట్వీట్‌లో ఆరోపించారు.
ఇంతకూ రేవంత్ అంతగా గౌడన్నలను ఏమి చేశాడయ్యా అంటే - నిన్న అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ గౌడన్నలపట్ల దుర్మార్గంగా ప్రవర్తించారని కేటీఆర్ ఆరోపణ. ఆ కార్యక్రమంలో గౌడన్నలను చెట్లమీద గంటల తరబడి నిలబెట్టి, వారి వృత్తిమీద చౌకబారు జోకులు వేస్తూ దాన్ని ప్రచారానికి వాడుకోవటం అమానవీయం, దుర్మార్గం అని ట్వీట్ సారాంశం. మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే ప్రచారం పీక్‌లో ఉంటుందంటూ ఎద్దేవా చేశారు.
ఈ విమర్శలో ఏమైనా సహేతుకంగా అనిపిస్తుందా అంటే లేదనే చెప్పాలి. ముఖ్యమంత్రి, అనేక మంది మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కేటీఆర్ ఆరోపించినట్లు, పంపిణీ కార్యక్రమం గంటల తరబడి జరిగే అవకాశమే ఉండదు. మహా జరిగితే అరగంట జరిగి ఉంటుంది. దానిని భూతద్దంలో చూసి, మసిబూసి మారేడుకాయ చేయాలన్నది కేటీఆర్ ప్రయత్నంలాగా కనబడుతోంది.
ఇదే కాదు, కేసీఆర్ కూడా ఆ మధ్య రేవంత్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇది లిల్లీ పుట్ల ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా రేవంత్‌ను బాడీ షేమింగ్ చేయటమే. విధానాల పరంగా ఏమైనా విమర్శించవచ్చుగానీ, ఇలా వ్యక్తిగతంగా హేళన చేస్తూ మాట్లాడటం కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడైన రాజకీయనాయకుడు చేయాల్సిన పని కాదు. ఇదే కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు నాలుగు నెలల్లో పడిపోతుందని కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. దానిపైన స్పందిస్తూ, ఈ ప్రభుత్వం పడిపోతుందని అన్నవాళ్ళు ఏమైపోయారు అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో అయితే కేసీఆర్ వ్యాఖ్యలను చూసి అందరూ నవ్వుకున్నారు. ఎన్నికల తర్వాత తాను కూడా ప్రధానమంత్రి రేసులో ఉంటానని కేసీఆర్ నాడు వ్యాఖ్యానించారు. తీరా చూస్తే ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. ఏది ఏమైనా కేసీఆర్, కేటీఆర్ నోరు కాస్త సంబాళించుకుని మాట్లాడితే బాగుంటుంది.