కమల గెలుపు ఖాయమంటున్న పాశ్చాత్య, హిందూ జోతిష్యులు: 10న కీలక డిబేట్!
ఈ జోస్యాలు నిజమై కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైతే, మూడు కొత్త రికార్డులు నమోదు కానున్నాయి. ఒకటి - అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన మొట్టమొదటి మహిళ.
అమెరికా అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ గెలుస్తుందని ఆ దేశంలోని ప్రఖ్యాత ఎన్నికల జోస్యుడు అలాన్ లిచ్‌మ్యాన్ చెప్పారు. ఈయన ఒక చరిత్రకారుడు కూడా. "అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్టర్‌డామస్" అని లిచ్‌మ్యాన్‌ను పిలుస్తారు. ఇప్పటివరకు పది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఈయన జోస్యం చెప్పగా, వాటిలో తొమ్మిది నిజం అయ్యాయి. ఈయన ఇటీవల ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ, ట్రంప్‌ను ఓడించి కమల అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తుందని చెప్పారు.
13 అంశాల ఆధారంగా జోస్యం
ఎన్నికల ఫలితంపై ఖచ్చితమైన జోస్యం చెప్పటానికి లిచ్‌మ్యాన్ “13 కీస్ టు వైట్ హౌస్” అనే ఒక వినూత్న పద్ధతిని అనుసరిస్తారు. ఈ పద్ధతిలో ఆయన అభ్యర్థి యొక్క విజయావకాశాలను పదమూడు కీలకమైన అంశాలపరంగా అంచనా వేస్తారు. ఆ అంశాలేమిటంటే - పార్టీలో అంతర్గతంగా అభ్యర్థికి మద్దతు, పోటీ, ప్రస్తుత అధ్యక్షుడి రేటింగ్, ఆర్థిక వ్యవస్థ, విదేశీ విజయాలు, సమాజంలో అశాంతి, ప్రస్తుత అధ్యక్షుడికి ఉన్న కరిష్మా, ప్రత్యర్థికి ఉన్న కరిష్మా మొదలైనవి.
ఈ 13 అంశాలపై తాను ఒప్పా, తప్పా అనే ప్రశ్నలు వేసుకుంటానని లిచ్‌మ్యాన్ తెలిపారు. ఏ అభ్యర్థికైనా 13 అంశాలలో 6 లేదా అంతకంటే ఎక్కువగా వ్యతిరేకంగా ఉంటే ఆ అభ్యర్థి పరాజితుడిగా, లేదంటే విజేతగా నిర్ధారిస్తానని చెప్పారు. ఈసారి ఈ పద్ధతిలో అంచనా వేయగా, కమలకు ఎనిమిది అనుకూలంగా రాగా, ట్రంప్‌కు కేవలం మూడే వచ్చాయని తెలిపారు.
హిందూ జోస్యులది కూడా అదే మాట
హిందూ జ్యోతిష్కులు కూడా కమలకే విజయావకాశాలు ఎక్కువని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ జాతకంలోకంటే కమలా హ్యారిస్ జాతకంలోనే విజయావకాశాలు మెరుగుగా ఉన్నాయని విశాఖపట్నానికి చెందిన జ్యోతిష్యుడు మణిశర్మ ది ఫెడరల్ తెలంగాణతో చెప్పారు. ఈ నెల 17 న సంభవించనున్న పాక్షిక్ చంద్ర గ్రహణం, వచ్చే నెల 2 న సంభవించనున్న వార్షిక సూర్య గ్రహణం ఫలితంగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ మారిపోతుందని, కమల అనూహ్యరీతిలో ముందంజలోకి వస్తుందని చెప్పారు. అమెరికాలో నివశించే హిందూ జ్యోతిష్కుడు పీవీఆర్ నరసింహారావు కూడా గెలుపు కమలదేనని తన తాజా యూట్యూబ్ వీడియోలో అన్నారు.
కమల గెలిస్తే మూడు కొత్త రికార్డ్‌లు నమోదు!
ఒకవేళ ఈ జోస్యాలు నిజమై కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైతే, మూడు కొత్త రికార్డులు నమోదు కానున్నాయి. ఒకటి - అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన మొట్టమొదటి మహిళ. రెండు - అమెరికా అధ్యక్షపదవికి ఎన్నికైన మొట్ట మొదటి ఏషియన్ అమెరికన్ సంతతి వ్యక్తి. మూడు - వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్‌గా అయిన అతి కొద్దిమంది వ్యక్తులలో ఒకరు కావటం. 188 ఏళ్ళ అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో కేవలం ఒక్కసారి మాత్రమే ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా అయ్యారు… 1988లో. ఆ తర్వాత అలా అయ్యిన వైస్ ప్రెసిడెంట్ కమలే అవుతారు.
కమల-ట్రంప్‌ల మధ్య ఈ నెల 10న కీలక డిబేట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల తతంగంలో ఇరు పార్టీ అభ్యర్థులమధ్య జరిగే చర్చ కీలకపాత్ర పోషిస్తుంది అన్న సంగతి తెలిసిందే. 2024 అధ్యక్ష ఎన్నికలకుగానూ ఇప్పటికే ఒకసారి ఈ డిబేట్ జరిగింది. అయితే అప్పుడు డెమోక్రాట్ల అభ్యర్థిగా బైడెన్ ఉన్నారు. ఆ డిబేట్‌లో బైడెన్ పలుసార్లు తడబడ్డారు, ట్రంప్‌కు అది అడ్వాంటేజ్ అయింది. డెమోక్రాట్ల అభ్యర్థిగా బైడెన్ స్థానంలోకి కమల వచ్చిన తర్వాత ఇదే మొదటి డిబేట్. కమలకు మహా గడుసు నాయకురాలు అనే పేరు ఉంది కాబట్టి ట్రంప్ పప్పులు మునుపటిలాగా ఉడకకపోవచ్చు. ఈ నెల 10న ఏబీసీ న్యూస్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్‌లో జరిగే డిబేట్ కోసం ఇరువురు నేతలూ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కమల అయితే ప్రచారంనుంచి ఆరు రోజులు ఆఫ్ తీసుకుని మరీ పిట్స్‌బర్గ్‌లోని ఒక హోటల్‌లో మకాం వేసి తయారవుతున్నారు. ప్రఖ్యాత యాక్టింగ్ స్కూల్ - లీ స్ట్రాస్‌బర్గ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఒక నిపుణుడు వచ్చి ఆమెకు శిక్షణ ఇస్తున్నారు. ట్రంప్ మాత్రం తాను ఏమీ ప్రిపేర్ కావటంలేదని, ఆశువుగా మాట్లాడతానని చెప్పుకొస్తున్నాడు. అయితే వివిధ ప్రదేశాలలో టౌన్ హాల్‌లలో జరిగే ప్రశ్నోత్తర కార్యక్రంలో తన రిపోర్టర్‌లను పెట్టుకుని ముందే తయారు చేసిన ప్రశ్నలను అడిగించుకుని సమాధానాలు చెప్పటంద్వారా ట్రంప్ కూడా బాగానే తయారవుతున్నాడని సమాచారం. అయితే, అతను డిబేట్‌లో ఆవేశపడితే అదుపుతప్పి రచ్చ రచ్చ చేస్తాడేమోనని ట్రంప్ శిబిరంలోనివారు భయపడుతున్నారు.
ట్రంప్ గెలిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని, అతను ఒక గతం తాలూకు అవశేషమని కమల అంటున్నారు. మరోవైపు, కమల అతి ఉదారవాద రాజకీయవేత్త అని, ఆమెతో అమెరికా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుందని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
ఈ డిబేట్‌లో వక్తలు పాటించవలసిన నియమాలను ఇప్పటికే ప్రకటించారు. ఎవరు మాట్లాడుతుంటే వారి మైక్‌ను మాత్రమే ఆన్ చేస్తారు, రెండోవారి మైక్ మ్యూట్ అయిఉంటుంది. అభ్యర్థులు విరామ సమయంలో తమ సహాయకులతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు, తమతో నోట్స్ తెచ్చుకోవటానికి అవకాశం ఉండదు. చర్చ సమయంలో ఇరువురికీ ఒక పెన్, ఒక ప్యాడ్, ఒక మంచినీళ్ళ బాటిల్ మాత్రమే ఇవ్వబడతాయి. స్టూడియోలో ప్రేక్షకులు ఉండబోరు. వరల్డ్ న్యూస్ టునైట్ యాంకర్ డేవిడ్ మ్యూర్, ఏబీసీ న్యూస్ లైవ్ ప్రైమ్ యాంకర్ లిస్నీ డేవిస్ ఈ డిబేట్‌కు మోడరేటర్‌లుగా వ్యవహరిస్తారు.
ట్రంప్‌కు సహాయం చేస్తున్న మాజీ డెమోక్రాట్ తులసి గిబ్బర్డ్
గతంలో 2019లో డెమోక్రటిక్ పార్టీలో అంతర్గతంగా అధ్యక్ష అభ్యర్థిత్వంకోసం కమలతో పోటీ పడి, ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలోకి జంప్ చేసిన తులసి గిబ్బర్డ్‌ను ఇప్పుడు జరగబోయే డిబేట్‌లో తనకు సాయం చేయటంకోసం ట్రంప్ తెచ్చుకున్నాడు. నాడు తులసితో పోటీ పడటంవలన ఆమెకు కమల బలాలు, బలహీనతలు క్షుణ్ణంగా తెలుసు. అందుకే ఆమెతో డెమోక్రటిక్ పార్టీకి రాజీనామా చేయించి ట్రంప్ పట్టుకొచ్చుకున్నాడు. ఆమె పేరులో తులసి ఉందని భారతీయ మూలాలు ఉన్నాయని చాలామంది పొరబడుతుంటారు. అయితే తనకు ఎలాంటి భారతీయ మూలాలూ లేవని ఆమె ఒక ప్రకటనలో స్పష్టీకరించారు.