మోక్షజ్ఞకు తారక్ శుభాకాంక్షలు:అన్నగారి ఫ్యామిలీకి తిరిగి దగ్గరవ్వాలనా?
తొలినాళ్ళలో తనను నిలబెట్టి, బలమైన పునాది ఏర్పాటుచేసిన నిర్మాతలు, ప్రేక్షకులూ నందమూరి అభిమానులే. అన్నగారి కుటుంబానికి చెడుఅనుభవాలు ఎదురయినపుడు కనీసం స్పందించలేదు
టాలీవుడ్‌లో ఇవాళ ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి సంబంధించి అతని మొదటి సినిమా నిర్మాతలు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కొంతకాలంగా నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ దానిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. అన్నగారి కుటుంబానికి చెడు అనుభవాలు ఎదురయినప్పుడు కనీసం మాటమాత్రమైనా స్పందించని జూనియర్ మొన్న ఏపీలో కూటమి విజయం సాధించినప్పుడు, ఇప్పుడు మోక్షజ్ఞ అరంగేట్రంపై మాత్రం స్పందించటం చూస్తే అన్నగారి కుటుంబానికి దగ్గరవ్వాలని అతను ప్రయత్నిస్తున్నాడు అనే వాదన వినిపిస్తోంది.
జూనియర్‌పై టీడీపీ, నందమూరి అభిమానుల ఆగ్రహం ఎందుకు?
జూనియర్ ఎన్టీఆర్ వైఖరిపై తెలుగుదేశం అభిమానులు, నందమూరి అభిమానులు కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారి ఆగ్రహంలో న్యాయం లేకపోలేదు. ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబునాయుడు భార్య అయిన భువనేశ్వరిని నిండుకొలువులో దారుణంగా అవమానించినరోజు అతను మౌనంగానే ఉండిపోయాడు. చంద్రబాబునాయుడును 53 రోజులు జైలులో ఉంచినప్పుడు ఒక్కరోజుకూడా స్పందించలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, ఇరువురూ గొప్పనేతలే అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడుగానీ ఒక స్టాండ్ తీసుకోలేదు. పోయిన ఏడాది ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు విజయవాడలో ఘనంగా జరిగినప్పుడు అనేకమంది ప్రముఖులతోపాటు, తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యర్థులగా భావించబడే మెగా ఫ్యామిలీకి చెందిన రాంచరణ్ కూడా హాజరయ్యాడుగానీ, ఇతను హాజరుకాలేదు. అంతెందుకు, ఇటీవల బాలయ్య చలనచిత్ర జీవితం 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కూడా బాలయ్యకు కనీసం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలపలేదు. అందుకే టీడీపీ అభిమానులు, నందమూరి అభిమానులు జూనియర్‌పై గుర్రుగా ఉన్నారు. ఇదిమాత్రమే కాదు, కొన్ని సందర్భాలలో అతని చర్యలు పరోక్షంగా జగన్‌కు మద్దతుగా ఉంటుంటాయి. వైసీపీ కార్యకర్తలు కొన్నిచోట్ల జగన్మోహన్ రెడ్డి ఫోటోతోపాటు జూనియర్ ఫోటోను కలిపి బ్యానర్‌లు కట్టడంపై పెద్ద వివాదం చెలరేగినప్పుడు ఇతను ఖండించకుండా మౌనంగా ఉండటం పరోక్షంగా సమర్థించినట్లు అయ్యింది. ఈ కారణాలన్నింటితోనే, తన 50 ఏళ్ళ చలనచిత్రజీవిత వేడుకల కార్యక్రమానికి జూనియర్‌ను ఆహ్వానించటానికి బాలయ్య అనుమతించలేదు.
టీడీపీ, నందమూరి అభిమానుల అండలేకుండానే ఎదిగాడా?
జూనియర్‌కు, నందమూరి కుటుంబానికి మధ్య సంబంధాలు కొంతకాలం సానుకూలంగా, కొంతకాలం ప్రతికూలంగా సాగుతుంటాయి. బాల్యంలో జూనియర్‌కు నందమూరి కుటుంబం అండ అంతగా లేదనే చెప్పాలి. తండ్రి హరికృష్ణకు సన్నిహితుడైన కొడాలి నాని సహచర్యంలోనే అతని బాల్యం ఎక్కువగా గడిచింది. 17 ఏళ్ళకే సినీ అరంగేట్రం చేశాడు. రామోజీరావు నిర్మించిన అతని మొదటి సినిమా 2001లో విడుదలయింది. అది ఫ్లాప్ అయినా, ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ చిత్రాల నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన స్టూడెంట్ నంబర్ ఒన్ చిత్రంతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వినాయక్, రాజమౌళిల ఆది, సింహాద్రి చిత్రాలతో అగ్రనటులలో ఒకరిగా మారాడు. అతను స్వతహాగా ఎంత ప్రతిభావంతుడైనా తొలినాళ్ళలో నిలబెట్టి, ఒక బలమైన పునాదిని ఏర్పాటుచేసిన నిర్మాతలు, ప్రేక్షకులూ నందమూరి అభిమానులే. తొలినాళ్ళలో బాగా పొగరుగా ఉండేవాడని, నాటి నంబర్ వన్ హీరో చిరంజీవి గురించి ఇంటర్వ్యూలో యాంకర్ ఏదో ప్రశ్న అడిగితే, అతను ఎవరో తనకు తెలియదని చెప్పాడని అంటుంటారు. నందమూరి కుటుంబం మొదట అతనికి సముచిత గౌరవం ఇవ్వకుండా అవమానించినా, స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత అతనిని అక్కన చేర్చుకుని తమలో కలుపుకున్నారు. మంచికి, చెడుకు అతనిని పిలవటం కలిసిమెలిసిపోవటం జరిగిపోయింది. అతనికి పెళ్ళి సంబంధంకూడా చంద్రబాబే స్వయంగా చూశారు. మంచి ధనవంతుల కుటుంబానికి చెందిన బాబు సమీప బంధువు నార్నె శ్రీనివాసరావు(ఈయన తదనంతరం వైసీపీలో చేరారు) కూతురుతో ఎన్టీఆర్ వివాహం జరిగింది.
అసలు జూనియర్‌కు, అన్నగారి కుటుంబానికి ఎక్కడ చెడింది?
అన్నగారి కుటుంబంలో కలిసిపోయిన తర్వాత, 2004 ఎన్నికల్లో తనకు మెంటార్ అయిన కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ గుడివాడ అసెంబ్లీ టీడీపీ టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా, నాని ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2009 ఎన్నికల వచ్చే సమయానికి వైఎస్‌ను ఎదుర్కోవటానికి జూనియర్ కరిష్మాకూడా తోడయితే మంచిదనే ఉద్దేశ్యంతో చంద్రబాబు అతనిని ప్రచారంలో దించారు. ఆ ఎన్నికల్లో తన మరో మిత్రుడైన వల్లభనేని వంశీకి విజయవాడ పార్లమెంట్ స్థానానికి టీడీపీ టిక్కెట్ ఇప్పించుకున్నారు. జూనియర్ 2009 ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించారు, యాక్సిడెంట్‌కు కూడా గురయ్యారుగానీ, అతని ప్రచారానికి తగిన ఫలితం దక్కలేదు. అతను పర్యటించిన చాలా చోట్ల టీడీపీ ఓడిపోయింది, రాష్ట్రవ్యాప్తంగా కూడా మెజారిటీ రాలేదు. ఆ తదనంతరకాలంలో జూనియర్‌కు, లోకేష్‌కు మధ్య ఏవో అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా పదవిని రెండోసారి కొనసాగిస్తారని ఆశించిన హరికృష్ణకు అది దక్కకపోవటంతో ఆయనకూడా చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారు. వీటన్నింటి కారణాలతో చంద్రబాబు, లోకేష్‌లపై జూనియర్ కినుక వహించారు. లోకేష్ తన అల్లుడు కనుక బాలకృష్ణ అనివార్యంగానే అతనివైపు మొగ్గారు. దానితో జూనియర్‌కు, అన్నగారి కుటుంబానికి దూరం మరింత పెరిగింది.
డబుల్ యాక్షన్?
2009 ఎన్నికల తర్వాత అలా ఏర్పడిన అంతరం అలాగే కొనసాగింది. అయితే కొన్ని సందర్భాలలో బాలకృష్ణకు, చంద్రబాబునాయుడుకు ఎదురయ్యినప్పుడుగానీ, బాలకృష్ణ గురించి ప్రస్తావన వచ్చినప్పుడుగానీ జూనియర్ మంచిగా మాట్లాడేవాడు. పరోక్షంగా మాత్రం ఆయన పనులన్నీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్లుగా ఉండేవి. తన తండ్రి, ఎన్టీఆర్ చైతన్యరథానికి సారధి అయిన హరికృష్ణ చనిపోయినప్పుడు ఆ సామాజికవర్గానికి చెందిన కొందరు పెద్దలు జూనియర్ దగ్గరకు వెళ్ళి భౌతిక కాయాన్ని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం అయిన ఎన్టీఆర్ భవన్‌లో కొంతసేపు ఉంచితే బాగుంటుందని సూచిస్తే ససేమిరా అన్నాడు. కేవలం ఎన్టీఆర్ కాదనటంవలనే హరికృష్ణ భౌతిక కాయాన్ని ఆ రోజు ఎన్టీఆర్ భవన్‌కు తీసుకెళ్ళలేకపోయామని ఆ పెద్దలు తదనంతరకాలంలో యూట్యూబ్ ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. హరికృష్ణ మొదటి భార్యకు పుట్టిన సుహాసినికి తెలుగుదేశం 2014లో కూకట్‌పల్లి అసెంబ్లీ టికెట్ ఇస్తే జూనియర్ కనీసం ప్రచారం కూడా చేయలేదు. అతని మామ నార్నె శ్రీనివాసరావు 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అతనిని దగ్గరగా చూసినవాళ్ళు కొందరు అతను సినిమాలలో హీరోయేగానీ, నిజజీవితంలో పెద్ద అవకాశవాది అని విమర్శిస్తుంటారు. అతని ఇటీవలి చర్యలు చూస్తే అది నిజమేమోనని అనిపిస్తుంటుంది. తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ఇటీవల ఘనవిజయం సాధించగానే, చంద్రబాబునాయుడుకు, లోకేష్‌కు, బాలకృష్ణకు, పురందేశ్వరికి ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీపై శుభాకాంక్షలు ప్రకటించాడు. ముందుముందు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో చూడాలి, మరి నందమూరి కుటుంబం అతనిని మళ్ళీ తమలో కలుపుకుంటుందా అనేదికూడా ఆసక్తికరంగా మారింది.