లక్ష రూపాయల ఇంజక్షన్‌తో గుండెజబ్బులకు చెక్: వార్తల్లో నిజమెంత?
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను లివర్ తొలగించనీయకుండా మన శరీరంలోని PCSK9 అనే మాలిక్యూల్ అడ్డు పడుతూ ఉంటుంది. ఈ ఇంజక్షన్ ఆ మాలిక్యూల్ అలా అడ్డుపడకుండా చేస్తుంది.
మార్కెట్‌లోకి కొత్తగా లక్ష రూపాయల ఇంజక్షన్ ఒకటి వచ్చిందని… అది చేయించుకుంటే గుండెపోటు రాకుండా నివారించవచ్చు అని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఊదరగొడుతూ వార్తలు వస్తున్నాయి. ఇంకేముంది, కొత్త వార్త ఒకటి దొరకటంతో, వాట్సప్ వీరులు రెచ్చిపోతున్నారు. వాట్సప్ యూనివర్సిటీకి చేతినిండా పని దొరికింది. అసలు ఇన్‌క్లిసిరాన్ అనే ఆ ఇంజక్షన్ గురించిన వార్తలో నిజమెంత అనేదానిని పరిశీలిద్దాం.
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో కొవ్వు బాగా పేరుకుపోయి, రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు(వైద్య పరిభాషలో బ్లాక్స్ ఏర్పడటం అంటారు) గుండెజబ్బు వస్తుంటుంది. ఈ కొవ్వులో గుడ్ కొలెస్ట్రాల్(హెచ్‌డీఎల్) బ్యాడ్ కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్) ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ 70-80 శాతం పేరుకుపోయినప్పుడు బైపాస్ ఆపరేషన్ చేస్తారు, కొద్దిగా పేరుకుపోయినప్పుడు స్టెంట్ వేస్తారు. అయితే ఈ రెండు రకాల రోగులు కూడా అప్పటినుంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించే ‘స్టాటిన్’ మాత్రలు, రక్తాన్ని పలచన చేసే మాత్రలు జీవితాంతం వాడుతూ ఉండాలి.
స్టాటిన్ మాత్రలు వాడినా కొందరికి కొలెస్ట్రాల్ నియంత్రణ కాకపోవటం జరుగుతుంటుంది. మరికొందరిలో స్టాటిన్ మాత్రలు వాడటంవలన తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడుతుంటాయి. ఇలాంటి వారికి ఈ ఇంక్లిసిరాన్ ఇంజక్షన్ ఒక వరప్రసాదిని లాంటిది.
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దీనికి ఈ మధ్యనే అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఔషధం లెక్వియో అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెట‌్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇండియాకంటే ముందే అమెరికా, యూకేలలో దీనికి అనుమతులు లభించాయి. గుండెపోటు రాకుండా ఇది సమర్థవంతంగా పని చేస్తోందని లాన్సెట్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన పరిశోధనాపత్రంలో పేర్కొన్నారు. ఐదు దేశాలలో నిర్వహించిన ట్రయల్స్‌కు సంబంధించిన నివేదికను లాన్సెట్ జర్నల్‌లో 2023 జనవరిలో ప్రచురించారు.
దీని ఖరీదు లక్ష నుంచి లక్షా ఇరవై వేలదాకా ఉంటుంది. దీనిని ఆరు నెలలకు ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. ఇది వాడితే ఇక స్టాటిన్ మాత్రలు వాడాల్సిన అవసరంఉండదు.
ఈ ఇంజక్షన్‌లోని సూత్రమేమిటంటే - రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను లివర్ తొలగించనీయకుండా మన శరీరంలోనే ఉండే PCSK9 అనే ఒక మాలిక్యూల్ అడ్డు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంజక్షన్ ద్వారా ఆ మాలిక్యూల్ అలా అడ్డుపడకుండా చేయగలుగుతారు. తద్వారా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను లివర్ విజయవంతంగా తొలగించగలుగుతుంది.
అయితే ఈ ఇంజక్షన్‌ను ఉపయోగించటంపై విచక్షణతో వ్యవహరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అపోలో ఆసుపత్రిలో పని చేసే కార్డియాక్ సర్జన్ గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ, ఇంజక్షన్‌తో ఎల్‌డీఎల్ కొలెస్టరాల్ కొంతవరకు తగ్గుతుంది అన్నది నిజమేనని అన్నారు. వైద్యరంగంలో ఏదైనా పురోగతి వచ్చినప్పుడు అది అకస్మాత్తుగా ఒక మేజిక్ లాగా రాదని చెప్పారు. ఇది కూడా ఏమీ మేజిక్ కాదని అన్నారు. ఇండియాలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అని, పాశ్చాత్యులతో పోలిస్తే రెండు మూడు రెట్లు ఎక్కువ అని తెలిపారు. ఇండియాలో రక్తనాళాలు చిన్నవని చెప్పారు. మొదటి సంవత్సరం సంవత్సరానికి మూడు ఇంజక్షన్ లు ఇవ్వాలని, రెండో సంవత్సరం నుంచి రెండు ఇంజక్షన్‌లు జీవితాంతం ఇవ్వాలని తెలిపారు.
మరో హార్ట్ సర్జన్ గోకుల్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఇంజక్షన్ ఆరు నెలలనుంచి ఇండియాలో వాడుతున్నామని చెప్పారు. కొంతమంది గుండె జబ్బు రోగులకు మళ్ళీ మళ్ళీ గుండెపోటు వస్తుందని, వాళ్ళకు ఈ ఇంజక్షన్ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇది వాడిన రోగులు అందరికీ బాగా పని చేస్తోందని తెలిపారు. ప్రస్తుతానికి కొంచెం ర్యాష్, మైల్డ్ ఫీవర్ వంటివేగానీ, పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని తెలిపారు.
ప్రముఖ కార్డియాలజిస్ట్, పల్స్ హార్ట్ సెంటర్ వైద్యులు ముఖర్జీ మాట్లాడుతూ, ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కొలెస్ట్రాల్ బాగా తగ్గుతున్నాయని చెప్పారు. నోవార్టిస్ తీసుకొచ్చిన ఈ ఇంజక్షన్ ఒక్కొక్కటి లక్ష నుంచి లక్షా పాతికవేలదాకా ఉంటుందని తెలిపారు. ఇదేమీ చౌక అయిన ఔషధం కాదని, సంవత్సరానికి రెండున్నర లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. దీనిని వాడటంవలన దీర్ఘకాలంలో జాయింట్ పెయన్స్, శ్వాసకోశ సంబంధ సమస్యలు రావచ్చని అన్నారు.
ఇది ఒక అద్భుత ఔషధం అయితే కాదని చెప్పారు. ఈ ఇంజక్షన్ తో గుండెపోటులు ఎంతవరకు తగ్గవచ్చు అనేది మాత్రం ఇంకా తెలియదని, ఈ సంవత్సరం చివరికిగానీ, వచ్చే సంవత్సరం మొదట్లోగానీ వచ్చే ఓరియన్ 4 అనే ట్రయల్ మందుతో ఆ విషయాలు తెలియవచ్చని చెప్పారు. ఒక మహా అద్భుతం వచ్చేసింది అనుకోవద్దు అన్నారు.
గతంలో కూడా స్టాటిన్ మాత్రలు పని చేయనివారికి ఒక ఇంజక్షన్ ప్రత్యామ్నాయంగా ఉండేదని, దానిని నెలకు రెండుసార్లు ఇవ్వాల్సిఉండేదని తెలిపారు. ఏది ఏమైనా, ఇంజక్షన్ తీసుకున్నాముకదా అని నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదని చెప్పారు. ఏది పడితే అది తిని, తాగి కూర్చుంటే ప్రమాదం తప్పకుండా ఉంటుందని ముఖర్జీ అన్నారు.
ఇండియాలో ఏటా గుండెజబ్బుతో 20 శాతంమంది పురుషులు, 17శాతం మహిళలు చనిపోతున్నారు. మరోవైపు ఈ ఇంజక్షన్‌పై విమర్శలు కూడా బాగానే వినబడుతున్నాయి. ప్రతి విషయంలో కుట్రకోణాన్ని చూసేవారు… ఈ ఇంజక్షన్‌ను ఫార్మా మాఫియా సృష్టి అని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది… బర్బెరిన్ ఫైటోసమ్ అనే ఔషధం కూడా ఈ ఇంజెక్షన్ చేసే పనిని చేస్తుందని, దాని ధర దీనికంటే చాలా తక్కువని చెబుతున్నారు.