సినర్జిన్‌ ఫార్మా కంపెనీలో పేలుడు ఎలా జరిగింది?

ఆంధ్రప్రదేశ్‌లోని సినర్జిన్‌ పార్మాకంపెనీలో పేలుడు వల్ల నలుగురు కార్మికులు మృత్యువుతో పోరాడుతున్నారు.

Update: 2024-08-23 05:49 GMT

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సంఘటన మరువకముందే పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో పేలుడు సంభవించి నలుగురికి తీవ్ర గాయాలు కావడం సంచలనంగా మారింది. ఫార్మా కంపెనీల్లో భద్రతాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫార్మా సిటీలోని సినర్జిన్‌ యాక్టివ్‌ ఇంగ్రిడియన్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. అయితే సంఘటన అర్ధర్రాతి జరిగినా శుక్రవారం ఉదయం 9 గంటల వరకు బయటి ప్రపంచానికి తెలియలేదు. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను విశాఖపట్నంలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఈ కంపెనీ 24 గంటలు పనిచేస్తుంది. కార్మికులు షిఫ్ట్‌ల ప్రకారం పనిచేస్తారు. రసాయనాలు, మందులు ఈ కంపెనీలో తయారు చేస్తారు. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప లేకుంటే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రసాయనాలు కలిపే సమయంలో మిషనరీని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక మెడిసిన్‌ తయారీకి కావాల్సిన రకరకాల ఉత్పత్తులను కలపాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కంపెనీలో ముడి మందును మిక్స్‌ చేసే సమయంలో వారికి ఉండాల్సిన షూట్స్‌ ఉండలేదని, యాజమాన్యం వారికి సరైన డ్రెస్‌లు ప్రొవైడ్‌ చేయలేదనే విమర్శలు ఉన్నాయి.
కంపెనీలో వేరే దేశాలు, వేరే రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉద్యోగులుగా ఉన్నారు. సినర్జిన్‌ కంపెనీ తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో మూడు సెక్టార్లు ఉన్నాయి. రెండో నెంబరు కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ఒక మెడిసిన్‌ తయారీ కోసం వినియోగించిన రసాయనాల వేస్ట్‌ను భూమిలోపలికి పంపిచాల్సి ఉంటుంది. అయితే కొన్ని కంపెనీల వారు అటువంటివేమీ చేయకుండా కాలువల ద్వారా బయటకు వదులుతున్నారు. ఆ రసాయనాలు ప్రజలకు హాని చేయడమే కాకుండా మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇందువల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని పరవాడ ఫార్మాసిటీలో లోని సినర్జిన్‌ కంపెనీలో చోటు చేసుకున్న పరిణామాలు భద్రతా ప్రమాణాలు పాటించనందునే జరిగాయని పలు కార్మిక సంఘాల వారు అంటున్నారు. ఈ కంపెనీల్లో సుమారు 800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన కంపెనీలో 200 మంది పైన కార్మికులు ఉన్నట్లు సమాచారం. రియాక్టర్లను ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా మార్చాల్సి ఉంటుంది. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల నిర్లక్ష్యం కారణంగా అవి మార్చడం లేదని కొందరు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ప్రస్తతం గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్న వారు జార్కండ్‌కు చెందిన వారుగా అధికారులు ప్రకటించారు.
కంపెనీలో రసాయనాలు మిక్స్‌ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. దానివల్లే జరిగిందా? మరేవైనా కారణాలు ఉన్నాయా? అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు. రసాయనాలు మిక్స్‌ చేసే టప్పుడు తగిన జాగ్రతలు యాజమాన్యం తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేదే కాదని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. సెజ్‌ల్లో కార్మిక సంఘాల పాత్రను నిషేదించడం వల్ల ప్రశ్నించే వారు లేక కంపెనీ యజమానులు వారి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ రవీంద్రనాద్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక సంఘటన జరిగి 18 మంది దుర్మరణం పాలైన సంఘటన మరువక ముందే ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు ఫార్మా కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
సంఘటన సమాచారాన్ని అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులో మాట్లాడారు. కంపెనీ యజమానులతో మాట్లాడి బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. హోంశాఖ మంత్రి అనితను వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. సంఘటనకు కారణాలు పూర్తి స్థాయిలో సేకరించి తగిన నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఫార్మా కంపెనీల్లో పనిచేయాలంటేనే కార్మికులు భయపడే పరిస్థితుల వచ్చాయి. జార్కండ్‌ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వీరి వివరాలు పూర్తిస్థాయిలో తెలుసుకుని వారి బంధువులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇటువంటప్పుడు ఆ కుటుంబాలు పడే ఆవేదిన చెప్పనలవి కాకుండా ఉంటుంది. బతుకు దెరువుకోసం కంపెనీల్లో చేరుతుంటే అవి మృత్యు లోగిళ్లుగా మారటంతో కార్మికులను భయం వీడటం లేదు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే సినర్జిన్‌ కంపెనీలో ప్రమాదం జరిగిందని ఏఐటీయూసీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు దొరబాబు చెప్పారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఎప్పటికప్పుడు కంపెనీలను సందర్శించి తనిఖీలు చేస్తూ మిషనరీలో ఉండే లోపాలు గుర్తించడంతో పాటు మందుల తయారీలో కల్తీలకు తావు లేకుండా తగిన మోతాదులో మిక్సింగ్‌ జరిగితే ప్రమాదాలు ఉండవని, ప్రమాణాలు కంపెనీ వారు పాటించనందునే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. సంఘటనల సమయంలో ప్రభుత్వం హడావుడి చేసి ఆ తరువాత పట్టించుకోవడం లేదన్నారు.
Tags:    

Similar News