జగన్ కొత్త టీమ్‌ ఆరుగురిలో ఐదుగురు రెడ్లే! “నా ఎస్‌సీలు” ఏమయ్యారో?

“నా ఎస్‌సీలు, నా ఎస్‌టీలు, నా బీసీలు” అంటూ జపం చేసిన జగన్ ఇప్పుడు కీలకమైన పార్టీ పదవుల్లో ఒక్కరిని తప్పితే అందరూ రెడ్లనే నియమించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Update: 2024-10-18 08:04 GMT

పార్టీ ప్రక్షాళనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తన కోటరీలో మార్పులు, చేర్పులు చేశారు. గతంలో పార్టీలో చక్రం తిప్పినవారిలో ఇద్దరు నేతలు(సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి)ను తప్పించారు. కొత్త రీజినల్ కోఆర్డినేటర్లను నియమించారు. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బాధ్యతలనుంచి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని తప్పించి రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం బాధ్యతలను అప్పగించారు. ఇటీవలి ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన విజయసాయిరెడ్డికి తిరిగి విశాఖ, శ్రీకాకుళం బాధ్యతలను అప్పగించారు.

ఇప్పటివరకు గోదావరి జిల్లాలకు ఇన్‌ఛార్జిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి గుంటూరు, ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్‌గా బాధ్యతలు ఇచ్చారు. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో రాయలసీమ బాధ్యతలు చూస్తుండేవారు, ఆయనకు ఇప్పుడు చిత్తూరు, నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌ఛార్జిగా, శాసన మండలిలో ప్రతిపక్షనేతగా ఉన్న బొత్స సత్యనారాయణను నియమించారు. కృష్ణాజిల్లా బాధ్యతలను రాంకీ అయోధ్య రామిరెడ్డికి అప్పగించారు.

వైసీపీ అధికారంలో ఉండగా, సజ్జలకు, విజయసాయికి మధ్య ఆధిపత్య పోరు ఉండేదని చెబుతారు. ఫలితాలు వెలువడిన తర్వాత పలువురు వైసీపీ నాయకులు సజ్జలపై, ధనుంజయరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వాటి ప్రభావమో, ఏమో జగన్ సజ్జలను పక్కన పెట్టేశారు. మరోవైపు విజయసాయిరెడ్డిని కూడా జగన్ ఇటీవల పక్కన పెట్టారు(పార్లమెంటరీ పార్టీనేత పదవినుంచి విజయసాయి రెడ్డిని తొలగించి వైవీ సుబ్బారెడ్డికి ఆ పదవిని కట్టబెట్టారు)గానీ, ఎందుకో ఇప్పుడు మళ్ళీ ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. దీనితో సజ్జల, విజయసాయిల మధ్య ఆధిపత్య పోరులో ఇప్పుడు విజయసాయిది పైచేయి అయినట్లుగా కనబడుతోంది.

సోషల్ మీడియాలో జగన్ కొత్త టీమ్‌పై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, మొన్న మొన్న జరిగిన ఎన్నికల దాకా “నా ఎస్‌సీలు, నా ఎస్‌టీలు, నా బీసీలు” అంటూ జపం చేసిన జగన్ ఇప్పుడు కీలకమైన పార్టీ పదవుల్లో ఒక్కరిని తప్పితే అందరూ రెడ్లనే నియమించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎస్‌సీలు, ఎస్‌టీలు, బీసీలను కరివేపాకుల్లాగా వాడుకుని పారవేయటమేనా సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ అని అడుగుతున్నారు. “కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం” అని చెప్పిన జగన్ ఇలా చేయటమేమిటని మీమ్స్‌లో వెక్కిరిస్తున్నారు. మరికొందరు శ్రీరెడ్డికి కూడా ఒక పదవి ఇవ్వవలసింది అని వెటకారం చేస్తున్నారు.

మరోవైపు, చంద్రబాబు, నారా లోకేష్‌లపై వైసీపీలోని రెడ్డి సామాజికవర్గం నాయకులు కూడా చేయనంత తీవ్రంగా విమర్శలు చేసిన కొడాలినానిని గానీ, పవన్‌ను పచ్చిబూతులు తిట్టిన పేర్ని నానినిగానీ ఈ పదవుల్లో నియమించకుండా పక్కన పెట్టేయటంపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఐదుగురు రెడ్లే మొత్తం రాష్ట్రాన్ని పాలిస్తూ దోచుకుంటున్నారని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ విమర్శించారు. తాజాగా జగన్ టీమ్‌ను చూస్తుంటే ఆ వాదనకు బలం చేకూర్చేవిధంగా ఉంది.

Tags:    

Similar News