ఆంధ్రా భూముల కేటాయింపుల్లో కుంభకోణం ఉందా?
ఈ భూకేటాయింపు నిర్ణయాలమీద సుప్రీమ్ కోర్టు ఆధ్వర్యంలో CBI, ED, CBDT లచేత దర్యాప్తు చేయించాలంటూ ఇఎఎస్ శర్మ ప్రభుత్వానికి లేఖ;
గత కొన్ని సంవత్సరాలుగా, విచ్చలవిడిగా ప్రభుత్వాలు, వారికి నచ్చిన ప్రైవేటు కంపెనీలకు, చవకగా ప్రభుత్వ భూములను, ఏక పాక్షికంగా, చట్ట విరుద్ధంగా, ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా, ధారాదత్తం చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంఅటువంటి భూకేటాయింపు నిర్ణయాల మీద సుప్రీం కోర్టు వారి ఆధ్వర్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన CBI, ED, CBDT లచేత నిష్పాక్షికమైన దర్యాప్తు చేయించడం అవసరం. అటువంటి దర్యాప్తులో, వేలాది కోట్ల భూకుంభకోణాలు బయటపడే అవకాశం ఉంది
గత కొన్ని దశాబ్దాలుగా, అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు, విచ్చలవిడిగా, ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించవలసిన అతి విలువైన ప్రభుత్వ భూములను, పెట్టుబడులు చేస్తారని, ఉద్యోగావకాశాలు కలిగిస్తారనే సాకుతో, తమకు కావాల్సిన ప్రైవేటు కంపెనీలకు, తక్కువ ధరలకు, ధారాదత్తం చేయడం, మన రాష్ట్రంలో ఆనవాయితీ అయింది.
ఉదాహరణకు, రెండు మూడు రోజుల క్రింద, ప్రభుత్వం విదేశీ కంపెనీ అయిన LULU కంపెనీకి, విశాఖపట్నం, విజయవాడ నగరాల నడిబొడ్డులో, వందలాది కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను చట్టవిరుద్ధంగా ఇవ్వడం మీద, CBI, Enforcement Directorate వారి చేత దర్యాప్తు చేయించాలని, అటువంటి అక్రమమైన భూముల కేటాయింపుకు బాధ్యులైన రాజకీయ నేతల మీద, అధికారుల మీద, కఠినమైన చర్యలు తీసుకోవడం అవసరమని, మీకు నేను 28-7-2025 న రాసిన లేఖ జత పరుస్తున్నాను. ఆ లేఖను, CBI, Enforcement Directorate వారికి పంపడం జరిగింది.
ఇటువంటి భూకుంభకోణాలు గతంలో ఎన్నో ఏళ్లుగా జరిగాయి. మచ్చుకు, 2019 నుంచి, ఈరోజు వరకు, ప్రభుత్వంలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కొన్ని అక్రమమైన భూకేటాయింపుల వివరాలను సేకరించి, క్రింద సూచిస్తున్నాను.
గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, 22-7-2025 న, నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో, కారేడు పంచాయత్ లో, ఇటీవల ప్రభుత్వం 8,346 ఎకరాల సస్యశ్యామలమై వ్యవసాయ భూమిని, రైతుల కడుపులు కొట్టి, ఇండోసోల్ కంపెనీకి ఇవ్వడమే కాకుండా, అత్యంత ఔదార్యంతో ఆ కంపెనీ చేయబోయే పెట్టుబడి భారం లో 50% కి పైగా ప్రభుత్వమే భరిస్తుందనే ఆశ్చర్యకరమైన రాయితీ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ, నేను రాసిన లేఖ ను మీకు గుర్తు చేస్తున్నాను.
అదే ఇండోసోల్ కంపెనీకి , ముందున్న YSRC ప్రభుత్వం కూడా, ఉదారంగా భూములను ఇవ్వడం జరిగింది. ఆ భూకేటాయింపుల వివరాలు క్రింద సూచిస్తున్నాను.
అలాగే, ప్రభుత్వాలు, గ్రీనుకో కంపెనీకి, ఆ కంపెనీకి సంబంధించిన ఇతర కంపెనీలకు ఇచ్చిన భూకేటాయింపుల వివరాలు ఇలాగ ఉన్నాయి:
ఇవే కావు, ఇతర ప్రైవేట్ కంపెనీలకు కూడా, ప్రభుత్వాలు ఎంతో ఉదారంగా కేటాయించిన భూముల వివరాలు:
విశాఖపట్నం / అర్బన్ బీచ్ రోడ్ విజయవాడ / APSRTC భూమి లీజు / మార్కెట్ ధరలో 10% కన్నా చాలా తక్కువ
ప్రైవేట్ కంపెనీలమీద చూపిస్తున్న ఔదార్యం, ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలపట్ల చూపించకపోవడం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం.
మచ్చుకు కొన్ని వివరాలు కింద సూచించాను:
జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ఫెడరేషన్ (ప్రభుత్వరంగ సంస్థ)
అంటే, వారికి నచ్చిన ప్రైవేట్ కంపెనీలకు, ప్రజల భూములను ధారాదత్తం చేయడంలో, నేతలు చూపించే న్యాయం ఒకటి; వారు ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థలపట్ల, NGO ల పట్ల చూపించే వైఖరి ఇంకొకటి!
మీద సూచించిన వివరాల ఆధారంగా, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, క్రింది ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసిన అవసరం ఉంది:
ప్రభుత్వం భూములను ప్రజాప్రయోజనాలకే ఉపయోగించాలని, తప్పనిసరిగా ప్రజల ఆరోగ్య, వైద్య సౌకర్యాలవంటి అవసరాలకోసం, ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం తప్పనిసరి అయితే, కేవలం లీజు రూపంలో, కనీసం భూమి మార్కెట్ ధర ఆధారంగా 10% ఏటా లీజ్ రెంటు కు మాత్రమే, భూములను ప్రైవేట్ కంపెనీలకు బదలాయించాలని, రాష్ట్రప్రభుత్వం అప్పటి మంత్రివర్గం సమావేశంలో 2012లో ఒక సమగ్రమైన విధానాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. ఏ విధానం చేపట్టినా, ఆ విధానం రాజ్యాంగ విలువలకు అనుగుణంగా, ప్రజా విశ్వాస సిద్ధాంతం (Doctrine of Public Trust) కు అనుగుణంగా ఉండాలి. అటువంటి విధానాన్ని అమలుచేయడం ఉద్దేశం, ప్రభుత్వాలు, అందరిపట్ల, ఎటువంటి వివక్షత చూపకుండా, పారదర్శికమైన, న్యాయబద్ధమైన సమాన వైఖరి చూపించడం. మీద సూచించిన భూకేటాయింపులు, ఎన్నోవిధాలుగా 2012 భూకేటాయింపు విధానాన్ని ఉల్లంఘించాయి.
ప్రజలకు, సమాజానికి ఉపయోగపరమైన పెట్టుబడులు రాష్ట్రానికి రావాలంటే, భూములు చవకగా ఇవ్వడంకాదు, ప్రభుత్వవిధానాలు న్యాయబద్ధంగా, పారదర్శకంగా, అందరి పట్ల సమానమైన వైఖరిని చూపడం అవసరం
ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వరంగ సంస్థలకు, ప్రభుత్వభూములను హెచ్చు ధరలకు కేటాయిస్తూ, ప్రజలవద్దనుంచి లాభాలు గణించే ప్రైవేట్ కంపెనీలకు, అదే ప్రభుత్వ భూములను అతి చవుకగా ధారాదత్తం చేయడం, ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలకు, అక్రమంగా లబ్ది చేకూర్చడమే కదా?
ప్రభుత్వాలు, ప్రభుత్వభూములకు, ప్రజల తరఫున ట్రస్టీలు మాత్రమే కాని, ప్రజల విశ్వాసాన్ని ఉల్లంఘించి, ఏకపాక్షికంగా ఆ భూములను ఇష్టానుసారం ప్రైవేట్ కంపెనీలకు తక్కువ ధరలకు పంచిపెట్టడం, సుప్రీమ్ కోర్టువారు ధ్రువపరిచిన ప్రజా విశ్వాస సిద్ధాంతాన్ని (Doctrine of Public Trust) ను ఉల్లంఘించినట్లు అవుతుంది కదా?
మీద మచ్చుకు సూచించిన వివరాల ఆధారంగా, ప్రభుత్వం, ఒకొకక్క కంపెనీ విషయంలో, భూముల ధర నిర్ణయించడంలో, ఒకొక్క వైఖరి చూపడం, వారి మధ్యలో కూడా పక్షపాత వైఖరి చూపించడం అవుతుంది కదా?
కంపెనీలు పెట్టుబడుల విషయంలో, ఉద్యోగావకాశాల విషయంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు వారు నెరవేర్చారో, వారి పట్ల పక్షపాతం చూపిస్తూ భూములను చవకగా ఇచ్చి, రాయితీలు ప్రసాదించిన ప్రభుత్వాలు ఎటువంటి సమీక్ష చేయకపోవడం, ఆ విషయంలో ప్రజలకు జవాబుదారీగా ఉండకపోవడం, ప్రజలు విస్తృతంగా ప్రశ్నిస్తున్నారు. హామీలను నెరవేర్చని కంపెనీలమీద ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భాలు అరుదు
అటువంటి పక్షపాతం చూపిస్తున్న రాజకీయ పార్టీలు, వారి నాయకులు, ఆ కంపెనీల వద్ద నుంచి, ప్రత్యక్షం గా కాని, పరోక్షంగా కాని, ఎన్నికలలో, ఇతర సందర్భాలలో, ఎటువంటి సహాయం పొందారు? ఆ విషయం మీద నిష్పాక్షికమైన దర్యాప్తు జరిగితే, నిజానిజాలు బయటపడతాయి.
సుప్రీమ్ కోర్టువారు, 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం కేసుల లో ఇచ్చిన తీర్పులప్రకారం, ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో, నేతలు, అధికారులు, మార్కేట్ ధరలకన్నా తక్కువ ధరలకు ఇవ్వడం, వారి పట్ల పక్షపాతం చూపించడం జరిగితే, వారు ఆవిధంగా తీసుకున్న నిర్ణయాలు అవినీతితో కూడిన నిర్ణయాలుగా పరిగణించాలి. అంటే, 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం కేసుల లో, సుప్రీమ్ కోర్టు వారు ఆదేశించించినట్లు, అటువంటి నిర్ణయాలను తీసుకున్న నేతలమీద, ఆ నిర్ణయాల్లో భాగస్వాములైన అధికారులమీద, Prevention of Corruption Act (1988) క్రింద, Prevention of Money Laundering Act (2002) క్రింద, ఆ తీర్పులకు అనుగుణంగా, దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది
సుప్రీమ్ కోర్టువారు, జగ్ పాల్ సింగ్ కేసు [CA N0.1132/2011 @ SLP(C) No.3109/2011 (Arising out of Special Leave Petition (Civil) CC No. 19869 of 2010] లో, ప్రజా ప్రయోజనాలకోసం ఉపయోగించవలసిన ప్రభుత్వ భూములను, ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిలోను, ప్రైవేట్ సంస్థలకు, కేటాయించకూడదని, వారు 28-1-2011 న ఇచ్చిన తీర్పులో, అన్ని రాష్ట్రాలను ఆదేశించడం జరిగింది. అంటే ఇటువంటి నిర్ణయాలు, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు అయింది.
మీద సూచించిన కొన్ని భూకేటాయింపులు, తీరప్రాంతంలో CRZ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండడం కారణంగా, అక్రమమైన నిర్ణయాలు. అటువంటి నిర్ణయాలు తీసుకున్న నేతలమీద, అధికారులమీద, ఆ నిబంధనలకు అనుగుణంగా, సుప్రీమ్ కోర్టు వారు గతంలో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
అలాగే, నగరాలలో, కొండలమీద, జలాశయాలలో, ప్రభుత్వం, ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టడాలకోసం ఇవ్వడం, చట్టపరంగా తయారు చేసిన నగరం మాస్టర్ ప్లాన్ కు విరుద్ధం. ఆకారణంగా కూడా వారిమీద చర్యలు తీసుకోవాలి.
గతంలో, ప్రభుత్వాలు చవకగా ప్రభుత్వ భూములను, ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినా, కంపెనీలు మాత్రం ఆభూములను బ్యాంకులకు మార్కెట్ ధరలకు తాకట్టుపెట్టి, పెద్దఎత్తున రుణాలు తీసుకుని, ఆ నిధులలో కొంత, ఇతర ప్రయోజనాలకోసం ఉపయోగించిన సమాచారం ఉంది. అంటే, అటువంటి సందర్భాలలో, నిధులు వారి విదేశీ ఖాతాలకు అక్రమంగా తరలించబడ్డాయా? ఆవిషయంలో, నేతల, మరియు అధికారుల పాత్ర ఉందా? ఆ విషయం మీద దర్యాప్తు అవసరం.
మీద సూచించిన చాలా పరిశ్రమల వలన వచ్చే కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం క్షీణిస్తున్న్నది. నేతలకు, ప్రైవేట్ కంపెనీ యజమానులకు మధ్య ఉన్న సంబంధాలకారణంగా, ఆ యాజమాన్యాలమీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అందరికీ తెలిసిన విషయం. ప్రజలకు ఆవిధంగా జరిగే నష్టానికి, బాధ్యులైన నేతలమీద, అధికారులమీద చర్యలు తీసుకోవాలి కదా?
స్థానికంగా అటువంటి పరిశ్రమలవలన ప్రజలకు కలిగే ఉద్యోగావకాశాలు తక్కువ. కేవలం, మీనియల్ ఉద్యోగాలు (వాచ్ మెన్ వంటి ఉద్యోగాలు)మాత్రమే స్థానిక ప్రజలకు లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో, ప్రభుత్వభూములలో సాగుచేసే చిన్నకారు రైతులు, అటువంటి భూకేటాయింపుల కారణంగా, నిర్వాసితులవుతున్నారు.అంటే, మీద సూచించిన విధంగా ప్రభుత్వ భూములను, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం వలన, ప్రజలు ఎన్నోవిధాలుగా నష్టపడుతున్నారు. వారికి వచ్చే లాభాలు తక్కువ. లాభాలు గణించేది ప్రైవేట్ కంపెనీలు మాత్రమే
మీద సూచించిన భూకేటాయింపులు ఉదాహరణకు మాత్రమే, గత రెండుమూడు దశాబ్దాలుగా, వేలాది ఎకరాల ప్రభుత్వభూములను, అధికారంలో ఉన్న రాజకీయనాయకులు యథేచ్ఛగా, ప్రైవేట్ కంపెనీలకు సమర్పించిన విషయం అందరికీ తెలిసినదే. ఆ భూకేటాయింపులలో, ఎన్నోనిర్ణయాలను లోతుగా దర్యాప్తుచేస్తే, వేలాదికోట్ల భూకుంభకోణాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
నా ఉద్దేశంలో అటువంటి దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలంటే, సుప్రీమ్ కోర్టు పర్యవేక్షణలో, CBI, Enforcement Directorate (ED), CBDT వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలద్వారా జరగాలి.
ఈ లేఖ నకళ్ళను, నేను కేంద్ర దర్యాప్తు సంస్థలైన CBI, ED, CBDT లకు పంపిస్తున్నాను. సుప్రీమ్ కోర్టువారి పర్యవేక్షణలో, వారు మీద వివరించిన ప్రశ్నలమీద లోతుగా దర్యాప్తుచేసి, బాధ్యులైన వారిమీద చర్యలు తీసుకోవాలి.
అలాగే, ప్రభుత్వ భూములను, కంపెనీలు తాకట్టు పెట్టి, బ్యాంకులనుంచి ఎటువంటి రుణాలు పొందారు, ఆనిధులను ఏ విధంగా ఉపయోగించారు అనే వివరాలను RBI దర్యాప్తు చేయాలి.
రాష్ట్రప్రభుత్వ అధికారులకు కూడా మీద సూచించిన ప్రశ్నలకు జవ్వాబు ఇవ్వవలసిన బాధ్యత ఉందని మీకు పదేపదే గుర్తుచేస్తున్నాను. రాజకీయ నేతలు అటువంటి చట్టవిరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటే, వారికి తగిన సలహాలను ఇచ్చే బాధ్యత అధికారులకు ఉంది. ఆ విధంగా సరిఅయిన సలహాలను ఇవ్వకపోతే, వారిమీద కూడా చర్యలు తీసుకోవడం అవసరం.
(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కు రాసిన లేఖ)