2004 ఎన్నికలు బలి తీసుకున్న ఈ ప్రముఖ సినీనటి ఎవరో తెలుసా?

ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తరఫున ప్రచారానికి బయల్దేరిన ప్రముఖ సినీనటి, అందాల రాశి సౌందర్య, ఆమె సోదరుడు అమర్ నాథ్ ఎలా చనిపోయారో తెలుసా?

By :  Admin
Update: 2024-04-18 04:18 GMT

2004 ఏప్రిల్ 17.. ఉదయం 11 గంటలు దాటింది. సింగిల్ ఇంజిన్ సెస్నా- 180 విమానం బెంగుళూరు సమీపంలోని జక్కూర్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి హైదరాబాద్ బేగంపేటకు బయల్దేరింది. సుమారు 30 మీటర్ల ఎత్తుకు వెళ్లింది. ఏమి జరిగిందో తెలియదు. ఒక్కసారిగా విమానం నుంచి మంటలు వచ్చాయి. పేలిపోయింది. ఆ దుర్ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తరఫున ప్రచారానికి బయల్దేరిన ప్రముఖ సినీనటి, దక్షిణాది వెండితెర వెలుగు, అందాల రాశి సౌందర్య, ఆమె సోదరుడు అమర్ నాథ్ ఈ ప్రమాదంలో చనిపోయారు. సింగిల్-ఇంజిన్, నాలుగు-సీట్లున్న సెస్నా 180 రన్‌వేను క్లియర్ చేసి పైకి ఎగిరిన కొన్ని సెకన్లకే నేలకూలింది.బెంగళూరు అగ్రికల్చరల్ సైన్సెస్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో కూలిపోయిన ఈ విమాన ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ విమానప్రమాదాన్ని తొలుత గుర్తించి అక్కడికి హుటాహుటిన వెళ్లిన ఇద్దరు విశ్వవిద్యాలయ ఉద్యోగుల్లో ఒకరైన బీఎన్ గణపతి.. సౌందర్య మృతదేహాన్ని గుర్తించారు. చనిపోయినపుడు సౌందర్య 7 నెలల గర్భిణి.

రాజకీయాలపై మక్కువ చూపిన తన సోదరుడు అమర్ నాథ్ తో కలిసి ఆ ఏడాదే బీజేపీలో చేరిన సౌందర్య 2004 పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ బయల్దేరారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో ఆమె కరీంనగర్‌ వెళ్లాల్సి ఉంది. ఆ యాత్ర పూర్తి కాకుండానే ఆమె జీవిత యాత్రను ముగించడం విషాదం.
తెలుగు సినీచరిత్రలో మహానటి సావిత్రి తర్వాత స్థానం సౌందర్యకే దక్కుతుందంటారు సినీపండితులు. సావిత్రి తర్వాత అత్యంత విజయవంతమైన నటిగా ఆమె తెలుగుప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాయించారు. 1992లో సినీరంగ ప్రవేశం చేసి అనతికాలంలోనే విలక్షణమైన పాత్రలు పోషించి బహుముఖ నటిగా పేరు తెచ్చుకున్న సౌందర్యకు రాజకీయాలంటే ఆసక్తి లేకపోయినా ఆమె సోదరుడి బలవంతంతో రాజకీయాల్లోకి చేరారు. బీజేపీ తరఫున ప్రచారం ప్రారంభించారు. కర్నాటకలో ప్రచారం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి బీజేపీకి పట్టున్న కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఆమెతో ప్రచారం చేయించాలని ఆనాటి బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆమె టూర్ ను ప్లాన్ చేశారు. మధ్యలోనే అర్థంతరంగా ఆమె తన ప్రాణాలను పొగొట్టుకోవాల్సి వచ్చింది.

చక్కటి క్యారెక్టరైజేషన్ సెన్స్ ఉన్న నటీమణుల్లో సౌందర్య ఒకరు. సౌందర్య కన్నడ నటి అయినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమ్మోరు, పవిత్ర బంధం, రాజా, సూర్యవంశం వంటి పాత్రలను పోషించిన ఆమె మరణం పట్ల యావత్ సినీప్రపంచం సంతాపాలు వ్యక్తంచేసింది. తక్కువ కెరీర్ లో ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న వారిలో సౌందర్య ఒకరు. చనిపోయే నాటికి ఆమె వయసు కేవలం 29 ఏళ్లు.
కుంకమ రంగు చీరెతో ప్రచారం చేయాలనుకున్న సౌందర్య..
రాజకీయాలకు ఆమె కొత్త. పైగా చేరింది బీజేపీలో. ఆ పార్టీ అనడంతోనే గుర్తుకువచ్చేది కాషాయరంగు. ఖరీదైన రంగురంగుల చీరెల్లో వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తే జనాన్ని ఆకట్టుకోలేమని గుర్తించిన సౌందర్య.. ఆ రోజు తను విమానం ఎక్కడానికి ముందు తన అంతిమ కోర్కెను తన సమీప బంధువుకి చెప్పారు. ఆమె చనిపోయిన చాలా కాలం తర్వాత ఆమె బంధువు నిర్మల ఈ విషయాన్ని బయటపెట్టారు. విమానం ఎక్కేముందు ఫోన్ లో సౌందర్య తన ఆకాంక్షను బయటపెట్టారు. 'నిర్మలా, నేను ఈ రంగుల చీరెల్లో ఎన్నికల ప్రచారం చేయడం అంతగా బాగున్నట్టు అనిపించలా. కుంకమ రంగు కాటన్ చీరలతో వెళ్లి ప్రచారం చేస్తే బాగుంటుందని భావిస్తున్నా. నాకు కాటన్ చీరలేవీ లేవు. అటువంటి చీరెలు తెప్పించి పెట్టు' అని సౌందర్య చెప్పినట్టు నిర్మల చెప్పారు. కుంకమ రంగు కాటన్ చీరలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనే తన ఉద్దేశాన్ని సౌందర్య వ్యక్తం చేసింది.
సౌందర్య చివరి కోరిక తెలిసిన పార్టీ పెద్దలు, ఇతర ప్రముఖులు ఆమె చిత్తశుద్ధిని కీర్తించారు. అయితే అవేవి వినడానికి ఆమె ఈ లోకంలో లేరు. ఆమె గురించి తెలిసిన వారిపై ఆమె తీవ్ర ప్రభావాన్ని చూపింది. సౌందర్ సాంప్రదాయ అలంకరణకే ఎక్కువ మక్కువచూపేవారు. అందువల్లే ఆమె తెలుగింటి ఆడపడుచుగా నిలిచారు. ఈ పేరునే బీజేపీ తన సొంతం చేసుకోవాలనుకుంది. దురదృష్టవశాత్తు ఆమె దుర్మరణం చెందడం ఊహించని విషయం. ఆమె బతికి ఉంటే బీజేపీలో ఈవేళ ఏ స్థాయిలో ఉండేవారో ఊహించడం కష్టం. సౌందర్య ఆకస్మిక మరణం ఆమె కుటుంబాన్ని, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

తెలుగు సినీ పరిశ్రమలో అత్యుత్తమ నటీమణులలో ఒకరైన సౌందర్య తన కెరీర్‌లో కొన్ని అసాధారణమైన చిత్రాలలో నటించారు. బాలీవుడ్‌లో ఆమె అమితాబ్ బచ్చన్ సరసన సూర్యవంశం అనే ఎవర్ గ్రీన్ సినిమాలో నటించింది. జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. 1992లో కన్నడ చిత్రం గంధర్వతో సినీ రంగ ప్రవేశం చేసిన సౌందర్య తెలుగు, తమిళంలో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. తెలుగులో రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, నంబర్ వన్, హలో బ్రదర్, అమ్మోరు తో ఆమె కెరీర్‌ అప్రతిహాతంగా సాగింది.
1988లో వచ్చిన అంతఃపురం చిత్రం ఆమె అద్భుత నటనకు దర్పణం. ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డుతో సహా అనేక ప్రశంసలను గెలుచుకుంది ఆ చిత్రం. 1999లో రొమాంటిక్ డ్రామా రాజాలో ఆమె నటనకు మూడో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డుతో పాటు ఇండస్ట్రీ హిట్ చిత్రం పడయప్పను సంపాదించిపెట్టింది. అన్నయ్య, నిన్నే ప్రేమిస్తా, ఆజాద్, ఎదురులేని మనిషి వంటి చిత్రాలతో ఆమె కెరీర్ మరింత పుంజుకుంది. 2002లో ఆమె నిర్మాతగా నిర్మించిన ద్వీప చిత్రంలో ఆమే కథానాయిక. ఆమె బతికుండగా విడుదలైన చివరి చిత్రం 'శ్వేత నాగు' పైగా అది ఆమె 100వ చిత్రం.
సరిగ్గా 16 ఏళ్ల తర్వాత మళ్లీ అదే రోజున అటు కర్నాటక ఇటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లో ముమ్మరంగా 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఏప్రిల్ 17న ఆమె చనిపోతే ఏప్రిల్ 18న ఆమె అంతిమసంస్కారం జరిగింది. ఆమెకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకోవాలని నాలుగుసీట్లు సంపాయించుకోవాలన్న బీజేపీ గాని ఆమె సహచర బృందం గాని ఆమెను స్మరించుకున్న దాఖలాలు లేవు ఆమె కుటుంబ సభ్యులు తప్ప. అందుకేనేమో రాజకీయాలకు అవసరాలు తప్ప అత్మీయతలు అవసరం ఉండదంటారు. ఏది ఏమైనా 2004 ఎన్నికలు బలి తీసుకున్న వారిలో ఈ ప్రముఖ నటి, అందాల కుప్ప సౌందర్య ఒకరు.
Tags:    

Similar News