కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు మొదలయినట్లేనా?
తమను అంతగా వేధించిన వైసీపీకి చెందిన నాయకులపై ఎలాంటి ప్రతీకారచర్యలకూ పాల్పడకపోవటం టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగిననాటినుంచి కూటమి పార్టీల కార్యకర్తలు, అభిమానులు ప్రభుత్వ వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో వేధింపులు, కేసులు ఎదుర్కొన్న టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు. తమను అంతగా వేధించిన వైసీపీకి చెందిన నాయకులపై ఎలాంటి ప్రతీకారచర్యలకూ పాల్పడకపోవటం వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అయితే వారి అసంతృప్తికి తెరపడినట్లే కనిపిస్తోంది. నిన్న వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు ప్రారంభమయ్యాయి. వారే సజ్జల రామకృష్ణారెడ్డి, బోరుగడ్డ అనిల్.
పోయినవారం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, ఐదేళ్ళ వైకాపా పాలనలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు లేవన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో ఉంది కదా అని అడిగిన ప్రశ్నకు స్పందించారు. ఎవరిపైన అయినా కక్ష సాధించటం తన స్వభావం కాదని, అలాగని తప్పు చేసినవారు ఎవరూ తప్పించుకోలేరని, తగిన సమయంలో చర్యలు ఉంటాయని చెప్పారు. వైసీపీ హయాంలో తనకంటే పెద్ద బాధితుడు ఎవరూ ఉండరని అన్నారు. అయితే చంద్రబాబు ఇది చెప్పిన వారంరోజులకే సజ్జల, బోరుగడ్డలపై చర్యలు మొదలవటం గమనార్హం.
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికేసులో ఇప్పటికే నందిగం సురేష్, జోగి రమేష్, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి వంటి వైసీపీ నేతలను విచారించారు. తాజాగా సజ్జలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన ఇవాళ పోలీసులముందు హాజరయ్యారు కూడా. మరోవైపు వైసీపీ హయాంలో చెలరేగిపోయి పవన్, లోకేష్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నేతలను గడ్డిపోచలలాగా మాట్లాడిన ఆకురౌడీ బోరుగడ్డ అనిల్ కూడా పోలీసులకు చిక్కాడు.
వైసీపీ హయాంలో అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, పట్టాభి వంటి టీడీపీ నాయకులనే కాకుండా, ఆ పార్టీ సానుభూతిపరులైన రఘురామకృష్ణంరాజు, గుంటూరు రంగనాయకమ్మ వంటివారిపై అప్పట్లో పోలీసులు ప్రైవేట్ ఆర్మీలాగా వ్యవహరించి వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిననాటినుంచి టీడీపీ, జనసేన శ్రేణులు ప్రతీకార చర్యలకోసం తహతహలాడిపోతున్నారు. ఈ తాజా పరిణామాలు చూసిన తర్వాతయినా కూటమి నాయకులు, కార్యకర్తల మనసు చల్లబడుతుందేమో చూడాలి.