జేడీ(యూ) చీఫ్ నితీష్‌కు ఈ సారి ముస్లింల మద్ధతు ఉంటుందా?

వక్ఫ్ (సవరణ) చట్టానికి మద్దతు ఇచ్చిన నితీష్‌ను ఆదరిస్తారా?;

Update: 2025-07-13 08:46 GMT

2025 వక్ఫ్ (సవరణ) చట్టానికి మద్దతు ఇచ్చిన జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్‌కు తర్వలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలే అందుకు నిదర్శనం. వారం క్రితం మొహర్రం రోజున జేడీ(యూ) ఎమ్మెల్యే మనోర్మ దేవి కుమారుడు రాకీ యాదవ్ తన తల్లి నియోజకవర్గంలో సంతాప సభకు వెళ్తున్న సమయంలో కొంతమంది ముస్లింలు ఆమెకు, పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మాటతప్పిన ఎమ్మెల్యే..

బెలగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి గత నవంబర్‌లో ఉప ఎన్నిక జరిగింది. ఈ నియోజకవర్గంలో ముస్లింల జనాభా ఎక్కువ. వక్ఫ్ (సవరణ) బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇవ్వదని స్పష్టంగా చెప్పడంతో ఉప ఎన్నికలో మనోర్మ దేవి గెలుపొందారు. మహముదాబాద్ గ్రామం, పొరుగున ఉన్న మరో ఐదు గ్రామాలను సందర్శించిన రాకీకి ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ముస్లిం యువకులు రాకీకి వ్యతిరేకంగా "గో బ్యాక్" " ముర్దాబాద్ " అంటూ నినాదాలు చేశారు.

2017లో గయా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి ప్రాణాలు కోల్పోడానికి కారణమైన రాకీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే 2023లో పాట్నా హైకోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న రాకీ.. మనోర్మ వారసుడిగా చెలామణి అవుతున్నాడు.

ఇఫ్తార్ విందు బహిష్కరణ..

నితీష్, అతని పార్టీపై ముస్లింల ఆగ్రహంగా ఉండటానికి అది ఒక్కటే కారణం కాదు. పాట్నాకు చెందిన ముస్లిం సంస్థ ఇమారత్-ఎ-షరియా పిలుపు మేరకు ..మార్చిలో నీతిష్ ఇంట్లో ఏర్పాటు చేసిన ఇఫ్టార్ విందును సైతం ముస్లింలు బహిష్కరించారు.

వక్ఫ్ బిల్లుకు నితీష్ కుమార్ మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 26న పాట్నాలో ఇమారత్-ఎ-షరియా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించింది. నితీష్ తన మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో నితీష్ కుమార్‌పై ముస్లింల అసంతృప్తిని బయటపెట్టడం ఇదే మొదటిసారి. వక్ఫ్ చట్టానికి మద్దతు ఇచ్చినందుకు ఏప్రిల్‌లో మైనారిటీ సంక్షేమ మంత్రి ఎండీ జామా ఖాన్‌కు తన సొంత జిల్లా కైమూర్‌లో నిరసన సెగ తగిలింది. ఆయన నియోజకవర్గం చైన్పూర్‌లో ఈ సారి ఆయనకు ఓటు వేయవద్దని ముస్లింలు ప్రచారం చేసినట్లు సమాచారం.

పాట్నాలో మెగా ర్యాలీ..

పాట్నాలో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జూన్ 29న నిర్వహించిన మెగా ర్యాలీలో కూడా నితీష్, జేడీ(యూ)పై ముస్లింలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో ప్రతిపక్ష భారత కూటమి నాయకుల హాజరై.. సవరించిన వక్ఫ్ చట్టాలను వ్యతిరేకించారు. నితీష్‌కు మద్దతు ఇవ్వడంపై వారి వైఖరిని తెలుసుకోవడానికి ది ఫెడరల్ డజన్ల కొద్దీ ముస్లిం నిరసనకారులతో మాట్లాడింది. “మేము బీజేపీ నుంచి ఏమీ ఆశించలేదు కానీ నితీష్ కుమార్ మమ్మల్ని మోసం చేశారు. సవరించిన వక్ఫ్ చట్టాలకు బీజేపీ కంటే ఆయనే ఎక్కువ బాధ్యత వహిస్తున్నారు. ఆయన మతతత్వ ముఖం బయటపడింది. ఈసారి ఆయనకు మా మద్దతు ఉండడు” అని పాట్నాకు చెందిన యువ నిరసనకారుడు సైఫ్ అహ్మద్ తెలిపారు.

'నితీష్ మూల్యం చెల్లించుకోకతప్పదు’

మతపరంగా సున్నితమైన భాగల్పూర్ జిల్లాకు చెందిన రోడ్డుసైడు వ్యాపారి ఎండీ ఖుర్బాన్ పెద్దగా చదువుకున్నవాడు కాదు. ముస్లింల ప్రయోజనాలను వక్ఫ్ సవరణ చట్టం దెబ్బతీస్తుందని మాత్రం తెలుసు. "వారు మా వక్ఫ్ ఆస్తులు, మసీదులు, శ్మశానవాటికలు సహా మతపరమైన ప్రదేశాలను స్వాధీనం చేసుకుంటారు. ఇకపై ఒక్క శాతం ముస్లింల ఓట్లు కూడా నితీష్‌కు పడవు," అని పేర్కొన్నారు.

ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కిషన్‌గంజ్ జిల్లాకు చెందిన రిటైర్డ్ స్కూల్ టీచర్ హసన్ అన్సారీ ఇలా అన్నారు. ‘‘గత ఎన్నికల్లో నితీష్‌కు మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నా. పోయినసారి నితీష్ వైపు నిలుచున్నాం. అతనికి ఓటు వేసాం. కానీ ఈ సారి అలా జరగదు,’’ అని అన్సారీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువ ప్లంబర్ ముజఫర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ముస్లింల మనుగడకు సంబంధించిన విషయం కావడంతో నిరసనలో పాల్గొనడానికి మధుబని నుంచి రావాల్సి వచ్చింది. మా ప్రాథమిక హక్కులను హరించడానికి కేంద్రం పట్టుదలతో ఉంది. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చి నితీష్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. ఆయన లౌకిక నాయకుడైతే.. దానిని మద్దతు ఇచ్చేవాడు కాదు. " అని పేర్కొన్నారు.

బీహార్ రాజకీయాల్లో ముస్లింల ప్రాధాన్యం..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు, నాలుగు మాసాల్లో జరగనున్నాయి. బీహార్ జనాభాలో సుమారు 17.7 శాతంగా ఉన్న ముస్లింలు నితీష్‌కు ఈ సారి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు కూడా.

వెనకబడిన జిల్లాలు (అరారియా, పూర్నియా, కిషన్‌గంజ్, కతిహార్) ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ జిల్లాల్లోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో ముస్లింల మద్దతు జేడీ(యూ)కి కీలకం. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా మిగతా నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు.

లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీకి ముస్లింలు విధేయులుగా ఉన్నా...గత రెండున్నర దశాబ్దాలలో (2020 మినహా) వరుసగా జరిగిన ఎన్నికలలో జేడీ(యూ)కి 25-30 శాతం మంది ఓటు వేసినట్లు తెలుస్తోంది. నితీష్ చేసిన అభివృద్ధి పనులు, లౌకిక విధానాలే అందుకు కారణం.

నితీష్‌కు ప్రజాదరణ తగ్గుతోంది..

పాట్నాకు చెందిన జాన్ పహల్ అనే పౌర సమాజ సంస్థను కూడా నడుపుతున్న రాజకీయ కార్యకర్త సత్యనారాయణ మదన్.. ముస్లింలలో గణనీయమైన వర్గం నితీష్‌కు మద్దతు ఇచ్చి ఓటు వేసి ఆయన రాజకీయ ఎదుగుదలకు దోహదపడిందని చెప్పారు.

"2005 ఎన్నికలలో ముస్లింలు ఆయనకు ఓటు వేసి అధికారంలోకి తెచ్చారు. 2010 ఎన్నికల్లో జేడీ(యూ) 243 స్థానాల్లో అత్యధికంగా 115 స్థానాలను గెలుచుకుంది. అందుకు ముస్లిం ఓట్లే కారణం. 2015 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆర్జేడీతో చేతులు కలిపిన జేడీ(యూ) ముస్లింలు మద్దతు ఇవ్వడంతో 71 సీట్లు గెలుచుకున్నారు." అని వివరించారు.

కానీ 2019 తర్వాత, CAA-NRCకి మద్దతు ఇచ్చి NDA కూటమితో నితీష్ జతకట్టారు. BJPతో ఆయన చాలా అనుబంధం ఉన్నా.. లౌకికవాద రక్షకుడిగా చూసిన ముస్లింలు ఆయననపై నిరాశ పెంచుకున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక చిన్న వర్గం మాత్రమే ఆయనకు ఓటు వేసింది. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ కేవలం 43 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇది ఇప్పటివరకు అత్యల్ప సంఖ్య.

మైనారిటీలు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో జేడీ(యూ) 11 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది. కానీ వారిలో ఎవరూ గెలవలేదు. ఈసారి నితీష్ వైఖరి తమ లక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నందున ఈ సారి గెలుపు అవకాశాలు దాదాపుగా లేనట్లేనని మదన్ అన్నారు.

‘ఈ సారి మద్దతు ఇవ్వకపోవచ్చు’

"నితీష్ సిఎఎ-ఎన్‌ఆర్‌సికి మద్దతు ఇచ్చినందున 2020 అసెంబ్లీ ఎన్నికలలో జెడి(యు) అత్యల్ప శాతం ముస్లిం ఓట్లను పొందింది. ఈ సారి వక్ఫ్ సవరణ చట్టానికి నితీష్ మద్దతు ఇవ్వడంతో ముస్లింలు ఆయనకు మద్దతు ఇవ్వరు,”అని రాజకీయ విశ్లేషకుడు సోరూర్ అహ్మద్ పేర్కొన్నారు.

పార్టీకి దూరమయిన ముస్లిం నేతలు..

ఏప్రిల్‌లో పార్లమెంటులో వక్ఫ్ (సవరణ) బిల్లు ఆమోదం పొందినప్పుడు.. డజనుకు పైగా ముస్లిం నాయకులు జేడీ(యూ) నుంచి వైదొలిగారు. వారిలో ఒకరైన మొహమ్మద్ ఖాసిం అన్సారీ.. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా నితీష్ వేలాది మంది ముస్లింలను నిరాశపరిచారని అన్నారు.

జేడీ(యూ) ఎమ్మెల్సీ గులాం గౌస్ కూడా తన అసంతృప్తిని బయటపెట్టారు. ఈయన కూడా పస్మాండ ముస్లిం. మొదట్లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రజా నిరసనలలో కూడా పాల్గొన్న ఈయన తర్వాత మౌనంగా ఉండిపోయారు.

CSDS-Lokniti సర్వే ప్రకారం..2015 నుంచి నితీష్, JD(U)లకు ముస్లిం మద్దతు, ఓటు శాతం తగ్గాయి. "ముస్లింలను బాధపెట్టే BJP ఎజెండాకు నితీష్ మద్దతు ఇవ్వడంపై ముస్లింలంతా ఆగ్రహంగా ఉన్నారు,’’ అని కార్యకర్త మదన్ అన్నారు.

అయితే వక్ఫ్ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన JD(U) నాయకుడు, మాజీ ఎంపీ అహ్మద్ అష్ఫాక్ కరీం అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు.

"నితీష్-జీ ఒక లౌకిక నాయకుడు. ముస్లింల సాధికారత, అభ్యున్నతికి చాలా కృషి చేశారు. ముస్లింలు ఇప్పటికీ ఆయనను తమ నాయకుడిగా భావిస్తారు, రాబోయే ఎన్నికలలో ఆయనకు మద్దతు ఇస్తారు. ఇతరుల మాదిరిగానే ముస్లింలు మంచి రోడ్లు, విద్యుత్ కనెక్షన్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు పొందారు," అని ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం ఎదురు చూస్తున్న కరీం అన్నారు. 

Tags:    

Similar News