హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

వారంతా రోడ్డు నిర్మాణ కార్మికులు. వారి శిబిరంపై మంచు చెరియలు విరిగిపడడంతో మంచుపొరల్లో కూరుకుపోయారు.;

Update: 2025-02-28 11:57 GMT

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా కురిసిన హిమపాతానికి 57 మంది కార్మికులు మంచుపొరల కింద చిక్కుకుపోయారు. గత కొన్ని రోజులుగా వీరంతా రోడ్డు పనులు చేస్తూ..బద్రీనాథ్‌కు సమీపాన ఉన్న మనా గ్రామం బీఆర్‌వో క్యాంప్‌కు దగ్గరలోని శిబిరంలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో మొత్తం 57 మంది వాటి కింద చిక్కుకుపోయినట్లు బీఆర్‌వో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సీఆర్‌ మీనా తెలిపారు. ఇప్పటివరకు 10 మందిని రక్షించి ఆర్మీ క్యాంప్‌కు తరలించామని, అయితే వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

"మానా సరిహద్దు ప్రాంతంలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ శిబిరం వద్ద భారీ హిమపాతం సంభవించింది. రహదారి నిర్మాణ పనుల్లో ఉన్న 57 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో 10 మందిని రక్షించి మానా సమీపంలోని ఆర్మీ శిబిరానికి తరలించాం. అయితే, వారి పరిస్థితి విషమంగా ఉంది," అని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అధికార ప్రతినిధి IG నీలేష్ ఆనంద్ భార్నే ANI కి తెలిపారు.

Full View

కొనసాగుతున్న సెర్చింగ్..

మిగతా వారి జాడ కోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), స్టేట్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్ (SDRF), ఆర్మీ శ్రమిస్తున్నాయి. కానీ అధిక వర్షం, హిమపాతం వారికి ఆటంకంగా మారాయి. కార్మికులను తక్షణమే ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా 3,4 అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు.

"ఆ ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టడం చాలా కష్టం. శాటిలైట్ ఫోన్‌లు, ఇతర కమ్యూనికేషన్ పరికరాలు లేకపోవడంతో అటువైపు నుంచి సమాచారం పొందలేకపోతున్నాం. అయినా మా బృందం కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొస్తుందని ఆశిస్తున్నాం," అని ఆనంద్ భార్నే చెప్పారు.

ఘటన జరిగిన మన గ్రామం.. బద్రీనాథ్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. భారత్‌-టిబెట్‌ సరిహద్దును ఆనుకుని సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 

Tags:    

Similar News